కార్యాలయ అడుగుల వేగం పెరిగింది

కొవిడ్‌తో దెబ్బతిన్న కార్యాలయ భవనాల లీజింగ్‌ ప్రక్రియ ఊపందుకుంది. ఆఫీసులు తెరుచుకోవడంతో క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గత నెలలో 61 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ భవనాల లావాదేవీలు జరిగాయి.

Updated : 25 Jun 2022 13:02 IST

ఈనాడు, హైదరాబాద్‌

కొవిడ్‌తో దెబ్బతిన్న కార్యాలయ భవనాల లీజింగ్‌ ప్రక్రియ ఊపందుకుంది. ఆఫీసులు తెరుచుకోవడంతో క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గత నెలలో 61 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ భవనాల లావాదేవీలు జరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ జేఎల్‌ఎల్‌ శుక్రవారం తాజా నివేదిక విడుదల చేసింది. గత ఏడాది మే నెలలో ‘ఏ’ గ్రేడ్‌తో సహా అన్ని రకాల కార్యాలయ భవనాల లీజింగ్‌ 22 లక్షల చదరపు అడుగులు కాగా.. ఈసారి అది మూడు రెట్లు పెరిగింది. క్రితం ఏడాది కొవిడ్‌ రెండోవేవ్‌ ఆఫీసు మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. మూడోవేవ్‌ అనంతరం ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండటంతో ఆఫీసు స్పేస్‌ లీజింగ్‌ సైతం పెరిగింది. ఏప్రిల్‌లో 48 లక్షల చదరపు అడుగుల లీజింగ్‌ లావాదేవీలు జరగ్గా.. మే నాటికి 28 శాతం పెరుగుదల కనిపించింది.

ముందస్తు ఒప్పందాలు

దిల్లీ రాజధాని ప్రాంతం, ముంబయి నగరాలన్నింటిలో కార్యాలయ భవనాల లీజింగ్‌ లావాదేవీల్లో అత్యధికంగా ముందస్తు ఒప్పందాలు చేసుకున్నవి కావడం విశేషం. పలు సంస్థలు లీజింగ్‌ను పునరుద్ధరించాయి. ఈ రెండింటి వాటానే మే నెల లావాదేవీల్లో 91 శాతంగా ఉంది.

వందకోట్ల చ.అ. దాటింది

దేశవ్యాప్తంగా ‘ఏ’ గ్రేడ్‌ కార్యాలయ భవనాల స్టాక్‌ గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 73.2 కోట్ల చదరపు అడుగులకు చేరింది. ‘బి’, ‘సి’ గ్రేడ్‌ కార్యాలయ భవనాల స్టాక్‌ 37 కోట్ల చ.అ. వరకు ఉంటుంది.

హైదరాబాద్‌లో చూస్తే..

దేశంలోనే నాలుగో అతిపెద్ద కార్యాలయాల మార్కెట్‌గా హైదరాబాద్‌ ఉంది. బెంగళూరు, ముంబయి, దిల్లీ మనకంటే ముందున్నాయి. కొవిడ్‌కు ముందు  ఒక ఏడాది నిర్మాణాల పరంగా బెంగళూరును హైదరాబాద్‌ అధిగమించింది. కొవిడ్‌ తర్వాత కూడా ఇది కొనసాగుతోంది. గత ఏడాది ఆఖరి నాటికి ‘ఏ’ గ్రేడ్‌ కార్యాలయ భవనాలు హైదరాబాద్‌లో 9.4 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరి నాటికి 10 కోట్ల మార్క్‌ను దాటుతుందని అంచనా. 2016-2021 కాలంలోనే వేగంగా నిర్మాణాలు వచ్చాయి. 81 శాతం ఐదేళ్ల కాలంలో వచ్చినవే ఉన్నాయి. అత్యంత వేగంగా ఆఫీసు స్పేస్‌ మార్కెట్‌ వృద్ధి చెందుతున్న నగరాల్లో భాగ్యనగరం ముందు వరసలో ఉంది.

* ఐటీని సిటీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే లక్ష్యంతో తీసుకొచ్చిన గ్రిడ్‌ పాలసీతో పశ్చిమేతర హైదరాబాద్‌లో వచ్చే నాలుగైదేళ్లలో 3.5 నుంచి 4 కోట్ల చదరపు అడుగుల ‘ఏ’ గ్రేడ్‌ కార్యాలయ భవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ‘ఏ’ గ్రేడ్‌ ఆఫీసు స్పేస్‌ కొరత ఉంది.


పదేళ్లలో మరో 25 కోట్ల చ.అ. వరకు విస్తరణ

ఎస్‌.రాంరెడ్డి, మాజీ అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

రాబోయే ఏడు నుంచి పదేళ్ల వ్యవధిలో హైదరాబాద్‌లో 20 నుంచి 25 కోట్ల చదరపు అడుగుల కార్యాలయాల నిర్మాణాలు రాబోతున్నాయి.  ఒక్కో ఉద్యోగికి సగటున 100 చ.అ.తీసుకుంటే 20 నుంచి 25 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఆ మేరకు సిటీలో సగటున ఏటా 2 లక్షల ఇళ్లకు డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కడుతున్న ఇళ్లు వార్షికంగా 30వేల నుంచి 35వేల మధ్యన ఉంటున్నాయి. కాబట్టి ఇళ్లకు మరికొన్నేళ్ల పాటు డిమాండ్‌ తగ్గదు. కొత్త బిల్డర్లకు చాలా అవకాశాలు ఉన్నాయి. న్యాయబద్ధంగా వ్యాపారం చేసే వారిని ఆహ్వానిస్తున్నాం. కానీ అత్యాశకు పోయి కొనుగోలుదారుల సొమ్ముతో ఆటలాడుకునే వారి విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి.  ఇప్పటికే నిర్మాణం పూర్తై అమ్ముడు పోకుండా పెద్ద సంఖ్యలో ఫ్లాట్‌లు ఉన్నాయనేది వాస్తవం కాదు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెరా వద్ద ఉన్న గణాంకాల ఆధారంగా నిర్మాణ అనుమతిలో పేర్కొన్న యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటుండడంతో  గణాంకాలు పెద్దవిగా కనిపిస్తున్నాయి. మా సంస్థకే 2016, 2019లో 2500 యూనిట్లకు రెండు సార్లు దశలవారీగా అనుమతి తీసుకున్నాం. 2024కు గాని 11 బ్లాక్‌లు పూర్తికావు. సగటున ఏడాదికి 350 నుంచి 400 ఇళ్లే కట్టగలిగాం. కానీ రికార్డుల్లో 2500 ఉంటుంది. కాబట్టి అనుమతి పొందిన యూనిట్లను స్టాక్‌గా చూడొద్దు. హైదరాబాద్‌లో ఇళ్ల డిమాండ్‌కు ఎలాండి ఢోకా లేదు. ఉపాధిపరంగా ఐటీతో పాటూ ఫార్మా, వైద్యం, వినోద రంగంలో పెద్ద ఎత్తున అవకాశాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. మున్ముందు మరింత పెరుగుతాయి. హైదరాబాద్‌ నలువైపులా వృద్ధికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ నివసించే జనాభా కోటి దాటింది. రెండు కోట్ల జనాభా నివసించే నగరంగా హైదరాబాద్‌కు తగిన మౌలిక వసతులు ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని