Real Estate : 2023 వరకు ఇంతేనా?

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కొద్దినెలలుగా నెమ్మదించింది. కొవిడ్‌ అనంతరం ప్రదర్శించిన దూకుడు ప్రస్తుతం కనిపించడం లేదు. మార్కెట్‌ కొంత స్తబ్ధుగా ఉంది. ఈ ప్రభావం తాత్కాలికమేనా? లేదంటే ఎన్నికలు జరిగే వరకు ఉంటుందా? స్థిరాస్తి వర్గాలు దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.

Updated : 16 Jul 2022 14:04 IST

ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కొద్దినెలలుగా నెమ్మదించింది. కొవిడ్‌ అనంతరం ప్రదర్శించిన దూకుడు ప్రస్తుతం కనిపించడం లేదు. మార్కెట్‌ కొంత స్తబ్ధుగా ఉంది. ఈ ప్రభావం తాత్కాలికమేనా? లేదంటే ఎన్నికలు జరిగే వరకు ఉంటుందా? స్థిరాస్తి వర్గాలు దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.
రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ఏడాది తొలి ఆరునెలల్లో గత ఏడాది కంటే ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఇళ్ల లావాదేవీలు నెలనెలా తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్లోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. కొన్ని పేరున్న సంస్థలు మినహాయిస్తే ఇతర సంస్థలు, చిన్న బిల్డర్లు నిర్మించిన అపార్ట్‌మెంట్లలో విక్రయాలు అంత ఆశాజనకంగా లేవు. ఏటా హైదరాబాద్‌ మార్కెట్లో కొన్నినెలల పాటు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. వర్షాకాలంలో, పిల్లలు పాఠశాలలు తెరిచిన సమయంలో, మంచి రోజులు లేని మాసాల్లో , సంవత్సరం ఆఖర్లో ఇళ్ల విక్రయాలు తగ్గుతుంటాయి. మొత్తంగా చూస్తే మార్కెట్‌ సానుకూలంగా కనిపిస్తుంటుంది.  ఈసారి కూడా అంతేనని కొందరు బిల్డర్లు అంటే.. మరికొందరు మాత్రం ఇప్పుడప్పుడే పుంజుకునేలా లేదని అంటున్నారు. అందుకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
ధరలు పెరగడం
భూముల ధరలు పెరిగి, నిర్మాణ వ్యయం పెరగడంతో ఇళ్ల ధరలు సైతం కొవిడ్‌ అనంతరం భారీగా పెరిగాయి. అయినా వడ్డీరేట్లు తక్కువ ఉండటంతో ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. అయితే ఇటీవల ఆర్‌బీఐ రెపో రేటు పెంచింది. దీంతో వడ్డీరేట్లు పెరిగాయి. ఫలితంగా ఇల్లు కొనే స్థోమత కొంత తగ్గింది. మున్ముందు మరింత పెరిగితే ఎలా అనే భయాలతోనూ కొంతమంది వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ప్రత్యేకించి రూ.50-80 లక్షల లోపు నివాసాల కొనుగోలుపై ప్రభావం పడింది. నగరంలో మొత్తం విక్రయాల్లో వీటి వాటానే అధికంగా ఉంటుంది.

వచ్చే ఏడాది దాకా...
ఈ పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుంది? అంటే వచ్చే ఏడాది దాకా అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల చర్చకు తెరలేచింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చాయి.   ఏ రకంగా చూసినా ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. గత చరిత్ర చూస్తే ఎన్నికల సంవత్సరంలో స్తిరాస్తి రంగం కొంత నెమ్మదిస్తుంది.  ఎంతోకాలంగా ఇదే సెంటిమెంట్‌ నడుస్తోంది. దీనికి భిన్నంగా గతసారి ఎన్నికల సమయంలో మార్కెట్‌ పోకడ కనిపించింది. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలు రావడం.. అప్పుడే వేర్వేరు సమస్యల నుంచి రియల్‌ ఎస్టేట్‌ కోలుకుని పరుగులు పెరుగుతుండటంతో పెద్దగా ప్రభావం కనిపించలేదు. రెండోసారి అంతక్రితం ఉన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే విశ్వాసం కారణంగా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడలేదు. ఈసారి హోరాహోరీ త్రిముఖ పోరు తప్పదనే అంచనాల నేపథ్యంలో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ఈ ప్రభావం కూడా అప్పుడే మార్కెట్‌పై కనిపిస్తోందని స్థిరాస్తి సంఘం ప్రతినిధి ఒకరు అన్నారు. 2023వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు.
సరఫరా సైతం..
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో సరఫరా, డిమాండ్‌ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీలాంచ్‌లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్‌ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తై అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉందని స్థిరాస్తి కన్సల్టెన్సీలు అంటున్నాయి.
పాత ఇళ్లవైపు మొగ్గు..
కొత్త ఇళ్ల ధరలు అందుకోలేనంతగా పెరగడంతో కొన్ని వర్గాలవారు పాత ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బడ్జెట్‌లో దొరికే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో ఈ తరహా లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ కొత్త ఇళ్ల లభ్యత సైతం తక్కువే.
ప్రవాస పెట్టుబడులతో ఊరట
మార్కెట్‌ స్తబ్ధుగా ఉన్న తరుణంలో ప్రవాస భారతీయుల పెట్టుబడులు కొంత ఊరట అనే చెప్పాలి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటంతో దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్‌ఆర్‌ఐలు ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వీరు ఎక్కువగా ప్రీమియం ఇళ్ల ప్రాజెక్టులు, తెలుగు రాష్ట్రాల్లో అయితే భూములపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. కార్యాలయ భవనాల లీజింగ్‌ పెరుగుతుండటాన్ని బట్టి కూడా ఇళ్ల మార్కెట్‌ మున్ముందు బాగుంటుందనేది సంకేతమని మరికొందరు బిల్డర్లు అంటున్నారు. కార్యాలయాల రాకతో ఉపాధి వస్తుందని.. తద్వారా ఇళ్లకు డిమాండ్‌ ఉంటుందని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని