కట్టగానే సరిపోదు.. నాణ్యతా చూడండి!

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దశాబ్ద కాలంలో అనేక నిర్మాణాత్మక మార్పులు, సంస్కరణలు వచ్చినా గృహ కొనుగోలుదారుల్లో భరోసా నింపలేకపోయాయి. ఇప్పటికీ ఎక్కువ మంది అసంతృప్తితో ఉన్నారు. పారదర్శకత పెంచేందుకు ఇటీవల కాలంలో రెరా చట్టం వంటివి వచ్చినా ఆశించిన ప్రయోజనం దక్కడం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు.

Updated : 30 Jul 2022 09:28 IST

ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దశాబ్ద కాలంలో అనేక నిర్మాణాత్మక మార్పులు, సంస్కరణలు వచ్చినా గృహ కొనుగోలుదారుల్లో భరోసా నింపలేకపోయాయి. ఇప్పటికీ ఎక్కువ మంది అసంతృప్తితో ఉన్నారు. పారదర్శకత పెంచేందుకు ఇటీవల కాలంలో రెరా చట్టం వంటివి వచ్చినా ఆశించిన ప్రయోజనం దక్కడం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. నియంత్రణ సంస్థలు చేవ లేకుండా ఉండటంతో  తప్పుడు వ్యాపార విధానాలు స్థిరాస్తి రంగంలో ఇటీవల పెరిగిపోయాయి. ట్రాక్‌ టూ రియాలిటీ సంస్థ దేశవ్యాప్తంగా కొనుగోలుదారుల సంతృప్తి తెలుసుకునేందుకు సర్వే చేపట్టగా వారి సంతృప్త స్థాయి వందకు 18 మాత్రమే ఉంది. పది సంవత్సరాల కిందట రియల్‌ ఎస్టేట్‌ను నియంత్రించే చట్టాలు లేకున్నా ప్రస్తుత స్కోర్‌ తక్కువగా ఉండటం ఆశ్చర్యం కల్గించినా.. గృహ నిర్మాణ మార్కెట్‌, నిర్మాణ సంస్థలకు ఇదో హెచ్చరిక.

భారతీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఇప్పటికీ అపరిపక్వంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన ప్రమాణాలు దిగదుడుపే. ఆయా దేశాల్లో వినియోగదారుల సంతృప్తి స్థాయి స్కోరు 60 ఉంటే.. మనం అందులో ఇప్పటికీ సగానికి కూడా చేరుకోలేకపోయాం. నగరాలవారీగా చూస్తే పూణెలో 34 శాతంతో అందరి కంటే మెరుగ్గా ఉండగా.. నోయిడా 6 శాతంతో అట్టడుగున నిల్చింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇళ్లు అమ్ముడు పోకుండా ఉండటానికి ఇదో కారణంగా చెబుతున్నారు.

సర్వేలో పరిశీలించిన అంశాలు

ఇప్పుడు కొన్న బిల్డర్‌తో తదుపరి ఇంటిని కొనుగోలు చేస్తారా? నిర్మాణం పూర్తి చేసి అందజేసిన ఇంటితో సంతృప్తి చెందారా? గడువులోగా పూర్తిచేశారా?  ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నారా? స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మీ బిల్డర్‌ పేరును సూచిస్తారా? విక్రయం అనంతరం బిల్డర్‌,  ఉద్యోగులు ప్రతిస్పందిస్తున్నారా? వంటి ప్రశ్నలను అడిగినప్పుడు ఎక్కువ మంది కొనుగోలుదారులు పెదవి విరిచారు.

జాప్యం

చెప్పిన గడువులోపల ఎక్కువ మంది డెవలపర్లు నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారని కొనుగోలుదారులు చెప్పారు. వీరి జాప్యం కారణంగా ఒకవైపు గృహ రుణం, మరోవైపు ఇంటి అద్దెతో సతమతమవుతున్నారు. ఇదే తమకు ఎక్కువ ఇబ్బందికి గురిచేస్తోందని చెబుతున్నారు. కేవలం 14శాతం మంది మాత్రమే తమకు సకాలంలో ఇల్లు పూర్తిచేసి అందించారని చెప్పారు. ఆ ప్రకారం 86 శాతం కొనుగోలుదారులకు తిప్పలు తప్పలేదు. ‘గర్భిణిగా ఉన్న సమయంలో ఆసుపత్రి కంటే.. మంచి ప్రాజెక్టు సైట్‌ కోసం  ఎక్కువ ఆత్రుతగా ఎదురుచూశాను’ అని ఘజియాబాద్‌లోని గృహ కొనుగోలుదారు ప్రేమలత అన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టిన మధ్యతరగతి కొనుగోలుదారులు ఇంటికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో బిల్డర్లు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.  

అద్దె ఇళ్లు నయం

సొంత ఇంటి కోసం ఎన్నో కలలు కని.. తమ కష్టార్జితాన్ని ధారపోసి కొంటే.. వారి ముచ్చట మున్నాళ్లుగా ఉంటోంది. అసంపూర్తి, నాణ్యతలేని నిర్మాణాలతో సొంతింటి కంటే అద్దె ఇల్లే నయమని ఎక్కువ మంది భావిస్తున్న దాఖలాలు ఉంటున్నాయి. సగానికి కంటే ఎక్కువ 54 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

నాణ్యతలో రాజీ

* నిర్మాణంలో కొందరు మినహా ఎక్కువ సంస్థలు నాణ్యత గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ ప్రాజెక్టులో ఎంత లాభం వచ్చిందనే ధ్యాసే తప్ప కొనుగోలుదారుడికి నాణ్యమైన నిర్మాణం కట్టిద్దామని భావించేవారు కొద్దిమందే ఉంటున్నారు. కట్టిన ఏడాదికే పగుళ్లు, లీకేజీ వంటి సమస్యలు వస్తున్నాయి. ఇళ్లు అన్నాక పగుళ్లు, లీకేజీలు సహజం అన్నరీతిలో చులకన చేస్తున్నారు. ఇలాంటి లోపాలపై కొనుగోలుదారులకు ఇప్పటికీ ఎలాంటి భరోసా లభించడం లేదు. రెరా వచ్చినా మోసం చేసేవారు చేస్తూనే ఉన్నారు.

* అనుమతి పొందిన ప్రాజెక్టులో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే కొనుగోలుదారుల సమ్మతి తీసుకోవాలి. దీనికి కొందరు బిల్డర్లు ముందస్తు తేదీతో కొనుగోలుదారులతో బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారు. అప్పటికే సగానికి కంటే ఎక్కువ సొమ్ములు చెల్లించిన కొనుగోలుదారులు గత్యంతరం లేక సంతకాలు చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 34 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

* రెరా చట్టం ప్రకారం కార్పెట్‌ ఏరియా కాకుండా సూపర్‌ బిల్టప్‌ ఏరియాతో విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

* రెరాతో ఎలాంటి భరోసా కల్గలేదని ఇది మరో వ్యాజ్యం మాత్రమే అని ఎక్కువ మంది చెప్పారు. రెరా ఆర్డర్లు ఇచ్చినా బిల్డర్లు పాటించడం లేదన్నారు.

విశ్వాసం పెరగాలంటే..

* ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కొనుగోలుదారుల సంతృప్త స్థాయి మధ్యస్థంగా ఉంది. మెరుగుపడాలని ఇక్కడివారు కోరుకుంటున్నారు.

నాణ్యత పరంగా పెద్ద సంస్థలు థర్ట్‌పార్టీ ఏజెన్సీలతో ఆడిటింగ్‌ చేయిస్తున్నాయి. మిగతావారు అందిపుచ్చుకోవాలి.

* విక్రయించిన తర్వాత లోపాలు ఉంటే కనీసం ఐదేళ్ల వరకు సరిదిద్దే బాధ్యత తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని