సెప్టెంబరుపైనే రియల్‌ ఆశలు

స్థిరాస్తి వ్యాపారానికి సుస్థిర చిరునామాగా నిలిచిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఇటీవల ఒడిదొడుకులకు గురవుతోంది. గత నెల ఆషాఢం కావడంతో కాస్త తగ్గినా.. శ్రావణంలో పుంజుకుంటుందని అందరూ భావించారు. అయినా అంతంత మాత్రంగానే స్థిరాస్తి

Published : 20 Aug 2022 02:11 IST

శ్రావణంలోనూ నెమ్మదించిన రిజిస్ట్రేషన్లు

ఈనాడు - హైదరాబాద్‌: స్థిరాస్తి వ్యాపారానికి సుస్థిర చిరునామాగా నిలిచిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఇటీవల ఒడిదొడుకులకు గురవుతోంది. గత నెల ఆషాఢం కావడంతో కాస్త తగ్గినా.. శ్రావణంలో పుంజుకుంటుందని అందరూ భావించారు. అయినా అంతంత మాత్రంగానే స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. వడ్డీ రేట్లు 8 శాతానికి చేరుకోవడంతో కొనుగోలుదారులు ఆచితూచి అడుగులేస్తున్నారు. జులైలో మాదిరే ఆగస్టులోనూ మందకొడిగా మారిందని జిల్లా రిజిస్ట్రార్లు చెబుతున్నారు. గతంలో ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 60 వరకూ స్థిరాస్తి లావాదేవీలు జరగగా.. 20 నుంచి 30 శాతం తగ్గినట్టు చెప్పారు. శ్రావణమాసంలో ఎప్పుడూలేని విధంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. 

పెద్ద తేడా లేదు 

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో జులైలో 3950 ఫ్లాట్‌లు రిజిస్టర్‌ అయ్యాయి. ఆగస్టులో 15వ తేదీ వరకూ 2 వేల వరకూ అపార్టుమెంట్లలో ఫ్లాట్‌లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. గతంతో పోల్చితే 30 నుంచి 40 శాతం తక్కువ అని సబ్‌ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. గత శ్రావణమాసంలో రోజులో ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 40-60 వరకూ ఇంటి రిజిస్ట్రేషన్లు జరగగా ఈ ఏడాది ఇదే నెలలో రోజుకు 25 నుంచి 30 వరకూ జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. గతంలో రూ.50 లక్షల వరకూ లోను వస్తే.. ప్రస్తుతం వడ్డీ రేట్లు పెరగడంతో అది రూ.45 లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. 

పుంజుకుంటున్న తరుణంలో..

కరోనాతో రెండేళ్లు రిజిస్ట్రేషన్లు అనుకున్న లక్ష్యం మేరకు జరగలేదు. తర్వాత పుంజుకుంటుంది అనుకున్న సమయంలో స్థిరాస్తి విలువలు భారీగా పెరగడంతో సన్నగిల్లాయి. తర్వాత 111 జీవో ఎత్తివేస్తున్నట్టు వచ్చిన వార్తలతో మళ్లీ కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. అపార్టుమెంటు కొనుక్కునే బదులు.. 111 జీవో పరిధిలో ఎక్కడైనా విల్లా కొనుక్కుంటే మేలు కదా.. అక్కడ అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇక్కడికంటే తక్కువ ధరకు నివాసం దొరికే అవకాశం ఉంటుందని యోచించారు. ఈ విషయమై ఇంకా స్పష్టత రాకపోవడంతో నెమ్మదిగా నగరంలోని అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లోని విల్లాలు, ఫ్లాట్‌లు కొనడం ప్రారంభించారు. ఇంతలో ఆషాఢం వచ్చింది. ఆ తర్వాత శ్రావణం జోరుగా సాగుతుందనుకుంటే.. వడ్డీరేట్లు పెరగడంతో మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. సెప్టెంబరుపైనే పరిశ్రమ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. అప్పటివరకు వడ్డీరేట్లలో స్థిరత్వం వస్తుందని విక్రయాలు పెరుగుతాయని జాతీయ క్రెడాయ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని