నగర కాలుష్యంలో.. నిర్మాణాల వాటా ఎంత?

విలాసవంతమైన విల్లాలు.. ఆకాశమే హద్దుగా నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు.. ప్రపంచ స్థాయి కార్యాలయాల భవనాలు.. నిర్మాణ రంగంలో ఏటేటా విస్తీర్ణం పెంచుకుంటూ కొంగొత్త భవంతులు వెలుస్తున్నాయి. స్థానిక, జాతీయ సంస్థలు పోటీపడి కడుతున్నాయి.

Updated : 20 Aug 2022 10:56 IST

40 శాతం అంటున్న జేఎల్‌ఎల్‌ అధ్యయనం

నెట్‌జీరో హరిత భవనాలతోనే సాధ్యం 

తెలంగాణలో 35 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు ఐజీబీసీలో నమోదు 

ఈనాడు, హైదరాబాద్‌ 

విలాసవంతమైన విల్లాలు.. ఆకాశమే హద్దుగా నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు.. ప్రపంచ స్థాయి కార్యాలయాల భవనాలు.. నిర్మాణ రంగంలో ఏటేటా విస్తీర్ణం పెంచుకుంటూ కొంగొత్త భవంతులు వెలుస్తున్నాయి. స్థానిక, జాతీయ సంస్థలు పోటీపడి కడుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కార్యాలయాల, గృహ అవసరాలను తీరుస్తున్నాయి. వీటిని చూసుకుని జనం మురిసిపోతున్నారు. భవనాలు పూర్తయ్యాక అద్భుతంగా కనిపిస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతోంది. కానీ నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున కాలుష్య ఉద్గారాలు వెదజల్లుతున్నాయి. నగరాల్లో 40 శాతం కాలుష్యం రియల్‌ ఎస్టేట్, ఇన్‌ఫ్రా నుంచే వస్తోందని జేఎల్‌ఎల్‌ వంటి సంస్థల నివేదికలు చెబుతున్నాయి. వీటికి పరిష్కారంగా ప్రపంచవ్యాప్తంగా నెట్‌జీరో విధానం తెర మీదకు తెస్తున్నారు. 

కాలుష్యకారక అతి సూక్ష్మ కణాలు(పీఎం 2.5) అత్యంత తీవ్రస్థాయికి చేరిన ప్రపంచంలోని 20 నగరాల్లో 18 భారత్‌లోనే ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌ నగరం సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో వచ్చిన సమస్యలివి. ప్రజల అవసరాలు తీర్చేందుకు కట్టే నిర్మాణాల నుంచి వెలువడుతున్న 40 శాతం కాలుష్య ఉద్గారాలను ఎలా తగ్గించాలనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద సవాల్‌. నిర్మాణ సమయంలో ఒకరకమైన కాలుష్యం వెదజల్లుతుంటే.. పూర్తయి వినియోగంలోకి వచ్చాక ముఖ్యంగా ఏసీలు, విద్యుత్తు వాడకం పెరుగుదలతో మరోరకమైన కాలుష్య  ఉద్గారాలు వెలువడుతున్నాయి. వీటిని తగ్గించడం ద్వారా ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసుకోవచ్చు. 

నిర్మాణ సమయంలో..

పనులు చేపట్టే ప్రదేశంలో గతంతో పోలిస్తే కొంతవరకు కాలుష్యం తగ్గినా.. ఇంకా తగ్గించేందుకు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నిబంధనలను కచ్చితంగా పాటిస్తే గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. 

* పాత భవనాలు కూల్చి కొత్తవి కడుతున్నారు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పోస్తున్నారు. కూల్చివేత సమయంలో కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలి. 

కూల్చిన సామగ్రిని పునర్వినియోగంలోకి తీసుకురావాలి. సిటీలో ఇటుకల వంటివి తయారు చేస్తున్నారు. అన్ని చోట్ల అందుబాటులో ఉంటే వ్యర్థాల పారబోత తగ్గుతుంది. 

* సైట్‌లో పనితో ఎక్కువ కాలుష్యానికి కారణం అవుతోంది. కిటికీలు, తలుపులు మాదిరి స్ట్రక్చర్‌ పరంగా ప్రీకాస్టింగ్‌ విధానంలోకి మారాల్సి  ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పోకడ నడుస్తోంది. నిర్మాణ సామగ్రి ఫ్యాక్టరీలో తయారవుతాయి కాబట్టి కాలుష్యం పెద్దగా ఉండదు. 

ల్యాండ్‌స్కేపింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. పచ్చదనంలో స్థానిక మొక్కలకు ప్రాధాన్యంతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది. 

రేడియేషన్‌ తగ్గించేందుకు కూల్‌ రూఫ్‌ వంటివి అనుసరించాల్సి ఉంటుంది. ఫలితంగా చల్లదనం కోసం కరెంట్‌ వినియోగం తగ్గించుకోవచ్చు. 

* ఒక్కోటిగా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే వాయు, నీటి కాలుష్యం తగ్గుతుంది. శబ్ధకాలుష్యం సైతం తగ్గించవచ్చు. 

* ఇటుకల దగ్గర్నుంచి రంగుల వరకు హరిత ఉత్పత్తులతో కాలుష్యం తగ్గించవచ్చు.  వీటన్నింటిని పాటిస్తే గ్రీన్‌ బిల్డింగ్‌ రేటింగ్‌ పొందవచ్చు. ఫలితంగా అందులో నివసించేవారి ఆరోగ్యంతో పాటూ ఉత్పాదకత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆ దిశగా వేగంగా అడుగులు  

- సి.శేఖర్‌రెడ్డి,  అధ్యక్షుడు, ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్, హైదరాబాద్‌ ఛాప్టర్‌ 

నిర్మాణంలో ఉపయోగించే సామగ్రి తయారీ సమయంలో వెలువడే కాలుష్యాన్ని సైతం నిర్మాణ కాలుష్యంలోకే తీసుకుంటారు. అందుకే భవనాలు, సామగ్రితో పాటూ సామగ్రి తయారయ్యే విధానానికి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) రేటింగ్‌ ఇస్తున్నాం. 500కు పైగా ఉత్పత్తులు గ్రీన్‌ప్రో ధృవీకరణ పొందాయి. వీటి వాడకంతో పర్యావరణహితంగా ఉంటాయి. రేటింగ్‌ పొందిన కమ్యూనిటీల్లో నెట్‌ జీరోను అవలంబిస్తున్నారు. భవనాల్లో వెలువడే ముడి వ్యర్థాలు. కమ్యూనిటీలోనే కంపోస్టు చేసి వాడుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నీటిని రీసైక్లింగ్‌తో మొక్కలకు, ఫ్లషింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ఈ రెండూ కూడా నెట్‌ సాలిడ్‌ వేస్ట్, లిక్విడ్‌ కిందకు వస్తాయి. సౌర పలకల ఏర్పాటుతో వందశాతం కరెంట్‌ అవసరాలను తీర్చుకోగలిగితే నెట్‌జీరో ఎనర్జీ అవుతుంది. క్యాప్‌ జెమినీ వంటి ఐటీ కార్యాలయంలో ఇప్పటికే నెట్‌జీరో ఎనర్జీని సాధించాయి. మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి.  ఇవన్నీ సాధిస్తే కార్బన్‌ న్యూట్రల్‌ అవుతాం. ప్రస్తుతం తెలంగాణలో 35 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐజీబీసీ రేటింగ్‌ కోసం రిజిస్టర్‌ అయ్యాయి. గత 20  ఏళ్లలో ఒక్కోటి జత కలుస్తూ వచ్చాయి. కాలుష్యం తగ్గించుకోవాలన్నా అవగాహన పెరగడంతో రాబోయే సంవత్సరాల్లో హరిత భవనాలు రెట్టింపు అవుతాయి. 
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని