నిర్మాణంలో ఉండగా కొనడం మేలు

నిర్మాణంలో ఉన్న ఇళ్ల కోసం చూస్తున్నారా? అయితే మీకిది మంచి అవకాశం. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో  ఇన్వెంటరీ (విక్రయించని ఇళ్లు) 55 శాతానికి పెరిగాయని క్రెడాయ్‌ చెబుతోంది. ఇందులో 96 శాతం నిర్మాణంలో ఉన్నవని కొలీయర్స్,

Updated : 20 Aug 2022 06:56 IST

ఈనాడు, హైదరాబాద్‌

నిర్మాణంలో ఉన్న ఇళ్ల కోసం చూస్తున్నారా? అయితే మీకిది మంచి అవకాశం. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో  ఇన్వెంటరీ (విక్రయించని ఇళ్లు) 55 శాతానికి పెరిగాయని క్రెడాయ్‌ చెబుతోంది. ఇందులో 96 శాతం నిర్మాణంలో ఉన్నవని కొలీయర్స్, లీసెస్‌ ఫోరస్‌తో కలిసి రూపొందించిన నివేదికలో వెల్లడించింది. కొవిడ్‌ అనంతరం ఇళ్లకు డిమాండ్‌ పెరగడంతో కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఇవన్నీ చాలావరకు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని పునాదుల దశలో ఉంటే.. మరికొన్ని తుదిమెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. వీటిలో నచ్చిన ప్రాజెక్టును ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. 

ఆర్థికంగా కలిసి వస్తుంది

* నిర్మాణ ఆరంభంలో కొనుగోలుతో ఆర్థికంగా కలిసి వస్తుంది అంటారు మార్కెట్‌ నిపుణులు. ఇల్లు పూర్తయ్యేసరికి నగరంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా 30 శాతం వరకు ధరల్లో పెరుగుదల ఉంటుంది. ఆ మేరకు కొనుగోలు చేస్తే మొత్తం వ్యయం తగ్గినట్లే. 

* మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు మొదలవుతుంటాయి. కాబట్టి నచ్చిన ప్రాజెక్టు ఎంపికకు అవకాశాలు అధికంగా ఉంటాయి.

* ప్రాజెక్ట్‌ ప్రారంభంలో కాబట్టి నచ్చిన ఫ్లోర్, దిక్కుతో పాటూ మార్పులు చేర్పులు సూచించేందుకు అవకాశం ఉంటుంది. తమకు కావాల్సిన రీతిలో కట్టించుకోవచ్చు. 

* నిర్మాణదారుడు ఎంతకాలంలో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయగలడనేది కొనేముందు స్పష్టంగా తెలుసుకోవాలి. చెప్పిన సమయానికి ఇచ్చే చరిత్ర ఉందా లేదా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.  

* ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఏడాది నుంచి మూడేళ్ల వరకు సమయం పడుతుంది. కాబట్టి విడతల వారీగా సొమ్ము చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఆర్థిక భారం తగ్గుతుంది. మొదట్లో తమ వద్ద ఉన్న పొదుపు సొమ్ము చెల్లించి.. ఆఖరున గృహరుణానికి వెళ్లొచ్చు. 

వీటిని గమనంలోకి తీసుకోవాలి. 

* నిర్మాణ పనులు కాగితాలపై ఒకలా ఉంటే.. క్షేత్రస్థాయిలో మరోలా ఉంటాయి.  అనుకున్న సమయానికి కొన్నిసార్లు పూర్తికాకపోవచ్చు. కొన్ని సంస్థలు మినహా ఎక్కువ సంస్థల ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి. ఇందుకు సిద్ధపడాలి. మరీ ఆలస్యం అయితే రెరా ద్వారా న్యాయం పొందవచ్చు. 

* గృహరుణంతో ఇల్లు కొనుగోలు చేసిన వారికి ప్రాజెక్ట్‌ ఆలస్యమయ్యే కొద్దీ ఒకవైపు ఈఎంఐ, మరోవైపు ఇంటి అద్దె చెల్లించాల్సి రావడం ఆర్థికంగా ఇబ్బందే. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే తట్టుకోగలమా లేదా అనేది కూడా ముందుగానే సంసిద్ధం కావాలి. 

* కొందరు బిల్డర్లైతే కొనుగోలుదారుల్లో విశ్వాసం సంపాదించేందుకు నిర్మాణం పూర్తిచేసేవరకు ఈఎంల భారం తమది అంటున్నారు. గుడ్డిగా నమ్మకుండా  ఆఫర్లు ఇచ్చే సంస్థల చరిత్రను తెలుసుకోవాలి. 

* నిర్మాణంలోని ప్రాజెక్టులకు 5 శాతం జీఎస్‌టీ కట్టాల్సి రావడం ఒకింత భారం. పూర్తైన వాటికి ఉండదు. ఈ తేడా గుర్తించాలి. 

చెల్లించిన వడ్డీ కంటే అధికంగా విలువ 

- జి.రాంరెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు, క్రెడాయ్‌ 

ప్రాజెక్టు పూర్తయ్యాక మిగిలిపోయే ఇళ్లు 10 నుంచి 20 శాతం మాత్రమే ఉంటాయి. ఎక్కువ ప్రాజెక్టుల్లో నిర్మాణ సమయంలోనే 70 నుంచి 80 శాతం  ఇళ్లు అమ్ముడవుతుంటాయి. ఇదే చాలా మేలు కూడా. కట్టేటప్పుడు కొనుగోలు చేస్తే పూర్తయ్యే సమయానికి విలువ పెరుగుతుంది. ఈఎంఐ రూపంలో చెల్లించే వడ్డీతో పోలిస్తే అంతకంటే ఎక్కువ రెట్లు ఇంటి విలువ పెరుగుతుంది. కాకపోతే కొనేముందు నిర్మాణ సంస్థ, బిల్డర్‌ గురించి పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. గతంలో కట్టిన అనుభవం ఉందా? ఏ స్థాయి ప్రాజెక్టులు కట్టారనే వివరాలను తెలుసుకుని.. మెరుగైన ట్రాక్‌ రికార్డు ఉంటే కొనుగోలు చేయవచ్చు.


కొనేముందు చూడాల్సినవి

ఈనాడు, హైదరాబాద్‌: సొంతిల్లు కొనుగోలు చేసేముందు ప్రభుత్వం, స్థానిక సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్నాకే కొనడం మేలు. చాలా సంస్థలు అనుమతులు లేకుండా మొదలెడుతున్నాయి. తర్వాత అనుమతులు తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఏదైనా ఆటంకం ఏర్పడి.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అనుమతుల్లో తీవ్ర జాప్యంతో ప్రాజెక్ట్‌లో జాప్యం జరుగుతోంది. కాబట్టి రెరాలో నమోదైన వాటిలోనే కొనుగోలుతో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే రక్షణ ఉంటుంది. 

* నిర్మాణ సంస్థలు ప్రీలాంచ్‌ పేరుతో వినియోగదారులకు ఫ్లాట్లు అమ్ముతున్నాయి. భూ యజమానితో చర్చలు జరుగుతుండగానే ఇదిగో ఇక్కడ మన సైట్‌ అంటూ అమ్మకాలు మొదలెడుతున్నాయి. ప్రీలాంచ్‌ ఆఫర్‌ అంటూ తక్కువ ధరకే బుకింగ్స్‌ ప్రారంభిస్తున్నారు. నష్టభయం ఉన్నవాళ్లు వీటిజోలికి వెళ్లొద్దు.

* నిర్మాణం చేపట్టేది వ్యవసాయభూమి అయితే గృహ, వాణిజ్య నిర్మాణాల కోసం భూ మార్పిడి అయిందో లేదో నిర్ధారించుకోవాలి. 

* ఇతరుల భూమిని బిల్డర్‌ అభివృద్ధి చేస్తుంటారు కాబట్టి వారి పేరుమీద ఉన్న టైటిల్‌ డీడ్, రిజిస్టర్డ్‌ స్టాంప్‌ పేపర్‌ ఉందో లేదో చూడాలి. అది అసలో నకిలీనో తెలుసుకునేందుకు అవసరమైతే న్యాయవాది సహాయం తీసుకోండి.  

* జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, చుట్టుపక్కల కార్పొరేషన్లు, స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతి పొందారో లేదో చూడాలి. ః ఎంత ఎత్తు వరకు నిర్మాణం చేయవచ్చో ఫ్లోర్‌ ప్లాన్‌.. మెట్లు, లిఫ్ట్, కామన్‌ ఏరియా వంటివన్నీ స్పష్టంగా పరిశీలించాలి. 

* జలమండలి నుంచి మురుగుకి సంబంధించి నిరభ్యంతర ధృవీకరణ పత్రం, ప్రధాన రహదారిలో ఉంటే ట్రాఫిక్‌ పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ అనుమతులు ఉన్నాయో లేదో చూడాలి. అన్ని అపార్ట్‌మెంట్లకు ఇవన్నీ అవసరం లేకపోవచ్చు కానీ కట్టే ఎత్తు, విస్తీర్ణం, ప్రదేశాన్ని బట్టి వేర్వేరు అనుమతులు తప్పనిసరి.  

* నిబంధనల మేరకు నిర్మాణం పూర్తయ్యాక అన్నీ సక్రమంగా ఉంటే నివాస యోగ్య పత్రాన్ని స్థానిక సంస్థలు జారీ చేస్తాయి. మార్టగేజ్‌ ఆస్తులను విడుదల చేస్తాయి. ధృవీకరణ పత్రం వచ్చిందో లేదో చూడాలి. 

చెరువులు, నాలా పక్కన కట్టేటప్పుడు అభ్యంతరాలు ఏమైనా వచ్చాయా? అనేది చూడాలి. 

* తక్కువ ధరలో వస్తుందని నిబంధనల మేరకు లేనివాటిలో కొని ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని