రుణాలతో స్థలాలు

నగరంలో అవుటర్‌ రింగ్‌రోడ్డు నుంచి ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారి వరకు పెద్ద ఎత్తున లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్నారు.  మొదటి దశ వచ్చే ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ సందడి ఎక్కువగా కన్పిస్తోంది. మిగతా ప్రాంతాల్లోనూ కొత్త వెంచర్లు వస్తూనే ఉన్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం ఇక్కడ స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల వరకు

Updated : 27 Aug 2022 07:54 IST

ధరలు పెరగడంతో బ్యాంకులను ఆశ్రయిస్తున్న కొనుగోలుదారులు

ఈనాడు, హైదరాబాద్‌  

నగరంలో అవుటర్‌ రింగ్‌రోడ్డు నుంచి ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారి వరకు పెద్ద ఎత్తున లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్నారు.  మొదటి దశ వచ్చే ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ సందడి ఎక్కువగా కన్పిస్తోంది. మిగతా ప్రాంతాల్లోనూ కొత్త వెంచర్లు వస్తూనే ఉన్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం ఇక్కడ స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల వరకు పెరుగుతూ వచ్చిన ధరలు కొంతకాలంగా స్థిరంగా ఉన్నాయి. ఇప్పటివరకు కొనలేకపోయిన వారికి ఇప్పుడు మంచి అవకాశమని రియల్టర్లు అంటున్నారు. వాస్తవిక ధరల కంటే ఎక్కువే చెబుతున్నా నిజంగా కొనాలనుకునే వారు బేరమాడితే తగ్గిస్తున్నారు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ ఆమోదిత వెంచర్లలో స్థలం కొనుగోలు చేయాలంటే రూ.పది లక్షలపైనే కావాలి. రూ.పాతిక లక్షలు వెచ్చిస్తే తప్ప కోరుకున్న చోట కాస్త ఎక్కువ విస్తీర్ణంలో దొరకని పరిస్థితి. దీంతో బ్యాంకు రుణాలు తీసుకుని కొంటున్నారు.

ఇల్లు కట్టుకునేందుకు, కట్టిన ఇల్లు కొనేందుకు గృహరుణాలు మంజూరు చేస్తున్న బ్యాంకులు... స్థలాలు కొనేందుకూ రుణాలిస్తున్నాయి. ప్లాటు రిజిస్టర్‌ విలువపై 50 శాతం వరకు మంజూరు చేస్తున్నాయి. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి ఉన్న లేఅవుట్లలో కొంటే రుణం పొందడం సులువు. సిబిల్‌ స్కోర్‌ను బట్టి ఎస్‌బీఐ ప్లాట్లకు 8 నుంచి 8.45 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. గృహరుణం కంటే వడ్డీ ఎక్కువ. కొన్ని బ్యాంకులు 13 శాతం వరకూ తీసుకుంటున్నాయి. ఎక్కువ మంది రుణం తీసుకునే కొంటుండటంతో డెవలపర్లు సైతం బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో సులువుగా మంజూరవుతున్నాయి.  5 నుంచి 20 ఏళ్ల కాలవ్యవధికి  మంజూరు చేస్తున్నాయి. ఎక్కువగా ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలానికి తీసుకుంటున్నారు.  

ఇల్లు కట్టుకుంటే..

కొనుగోలు చేసిన స్థలంలో భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటే ప్లాట్‌ రుణాన్ని   గృహ రుణంగా మార్చుకోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. అప్పుడు వడ్డీ రేటు తగ్గుతుంది.

* ఇదివరకే గృహరుణం ఉంటే టాపప్‌ లోన్లు ఇస్తున్నారు. గరిష్ఠంగా 15 ఏళ్ల కాలవ్యవధికి ఇస్తామని హెచ్‌డీఎఫ్‌ బ్యాంకు చెబుతోంది. వస్తున్న ఆదాయం, ప్రస్తుతం చెల్లిస్తున్న ఈఎంఐని లెక్కలోకి తీసుకుని మంజూరు చేస్తామని ఆ బ్యాంకు అధికారి ఒకరు వివరించారు.

* ప్లాట్‌ లోన్‌ అయితే అనుమతి ఉన్న   లేఅవుట్‌ డ్రాయింగ్స్‌, ప్లాట్‌ వివరాలు    సమర్పించాలి.

* టాపప్‌ రుణానికి చిరునామా ధ్రువీకరణ, వ్యక్తిగత గుర్తింపు పత్రం, మూడునెలల పే స్లిప్స్‌, ఆరునెలల బ్యాంకు స్టేట్‌మెంట్‌, ఫాం16, ఫొటో, దరఖాస్తుతో సమర్పిస్తే సరిపోతుంది.

* గతంలో మాదిరిగా బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. విచారణ పూర్తిచేసి రోజుల వ్యవధిలోనే మంజూరు చేస్తారు.  

ఎక్కడెక్కడ స్థలాల వెంచర్లు?:  హైదరాబాద్‌ చుట్టుపక్కల ఎనిమిది జాతీయ, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వాటి వెంట సిటీ నుంచి 50 కి.మీ. వరకు వెంచర్లు వేశారు. ఫాంల్యాండ్స్‌ మినహా మిగతావాటిలో అత్యధికం డీటీసీపీ అనుమతి పొందినవే ఉన్నాయి.

* నగరం ఇప్పటికే విస్తరించిన... పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వరకు లేఅవుట్లలో స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ధరలు చదరపు గజం రూ.పాతికవేల పైనే చెబుతున్నారు.

* శంకర్‌పల్లి, చేవెళ్ల మార్గాల్లో రియల్‌ ఎస్టేట్‌ విస్తరించింది. ఇక్కడ గజం రూ.ఇరవై వేలపైనే పలుకుతోంది. టౌన్‌ నుంచి దూరం వెళ్లేకొద్ది రూ.పదివేల నుంచి రూ.పదిహేనువేల వరకు దొరుకుతున్నాయి.

* బెంగళూరు జాతీయ రహదారిలో జడ్చర్ల వరకు ప్లాట్లు వేశారు. ప్రాంతీయ వలయ రహదారికి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో రూ.5వేల లోపు కూడా డీటీసీపీ ఫాంల్యాండ్‌ ప్లాట్లను విక్రయిస్తున్నారు.

* శ్రీశైలం జాతీయ రహదారి.. ఫార్మాసిటీ చుట్టుపక్కల గజం రూ.పదివేలకు అటుఇటుగా దొరుకుతున్నాయి. ప్రధాన రహదారికి దగ్గరగా ఉంటే ఎక్కువగా, దూరంగా ఉంటే తక్కువగా ధరలు చెబుతున్నారు. అవుటర్‌కు దగ్గరలో రూ.పదిహేను వేలల్లో ప్లాట్ల లభ్యత ఉంది.

* విజయవాడ జాతీయ రహదారిలో ఫిలింసిటీ దాటి చౌటుప్పల్‌ వరకు ప్రాంతీయ వలయ రహదారిని దృష్టిలో పెట్టుకుని వెంచర్లు వస్తున్నాయి. వరంగల్‌ రహదారి  లో యాదగిరిగుట్ట దాటి ఆలేరు వరకు లేఅవుట్లు విస్తరించాయి. మేడ్చల్‌, శామీర్‌పేట నుంచి ప్రతిపాదిత ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు పెద్ద ఎత్తున వెలిశాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని