మున్ముందు మరింత పెరుగుతుందని!

దీర్ఘకాలానికి మంచి పెట్టుబడి సాధనం ఏది.. అధిక రాబడులు పొందేందుకు ఎక్కువ మంది రియల్‌ ఎస్టేట్‌ వైపే మొగ్గుతున్నారు. మార్కెట్‌ స్తబ్దుగా ఉన్నా..

Updated : 10 Sep 2022 08:15 IST

దీర్ఘకాలానికి ఎక్కువమంది ఎంపిక రియల్‌ ఎస్టేటే
ఈనాడు, హైదరాబాద్‌

దీర్ఘకాలానికి మంచి పెట్టుబడి సాధనం ఏది.. అధిక రాబడులు పొందేందుకు ఎక్కువ మంది రియల్‌ ఎస్టేట్‌ వైపే మొగ్గుతున్నారు. మార్కెట్‌ స్తబ్దుగా ఉన్నా.. కొంత ఆనిశ్చితి నెలకొన్నా ప్రతి నలుగురిలో ముగ్గురు స్థిరాస్తినే లాభసాటి అంటున్నారు. దీర్ఘకాలానికి స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడి మరిదేంట్లోనూ రాదని ట్రాక్‌2రియాలిటీ నిర్వహించిన తాజా సర్వేలో 76 శాతం మంది అభిప్రాయపడ్డారు.

సొంతిల్లు ఉన్నా.. మరో ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. బడ్జెట్‌ను బట్టి విల్లాలు, ఓపెన్‌ ఫ్లాట్లు, ఫామ్‌ల్యాండ్ల వరకు స్థిరాస్తులు కొంటున్నారు. అద్దెలు వస్తాయని కొందరు.. దాంతో పాటూ విలువ కూడా పెరుగుతుందని వీటిలో పెట్టుబడి పెడుతున్నారు. హైదరాబాద్‌లో అయితే సిటీలో ఇతర ప్రాంతాల్లో నివాసమున్నవారు సైతం.. పిల్లల కోసం ఐటీ కారిడార్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇళ్లు ఇక్కడ ఒకింత ఖరీదే అయినా ఆస్తి విలువ సైతం అదే స్థాయిలో పెరుగుతుందని కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు. 

మార్కెట్లో ఉన్న ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే స్థిరాస్తుల్లో దీర్ఘకాలానికి అత్యంత సురక్షితం. కళ్లముందే ఆస్తి ఉంటుందనే భరోసా ఎక్కువ మందిది. హైదరాబాద్‌ లాంటి మార్కెట్లో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఇప్పటివరకు లేదు. స్వల్పకాలంలోనూ ఒడిదొడుకులు తక్కువే ఉంటాయి. కొనుగోలుదారుల అభిప్రాయమూ ఇదే. ఆర్థిక మందగమనం వంటి క్లిష్టపరిస్థితుల్లో ఇబ్బందులు తక్కువ అని 82 శాతం మంది చెప్పారు.

ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా..
మన పెట్టుబడుల మీద వచ్చే రాబడులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా ఉండేలా నిపుణులు సూచిస్తుంటారు. ద్రవ్యోల్బణం 8 శాతం ఉంటే వచ్చే రాబడి అంతకంటే ఎక్కువ ఉండాలని చెబుతుంటారు. స్థిరాస్తుల్లో అయితే ఢోకా లేకుండా వస్తుందని కొనుగోలుదారులు 90 శాతం మంది విశ్వసిస్తున్నారు. ఏడాది, రెండేళ్లు కాకుండా ఐదు, పదేళ్ల పాటూ వేచి చూడగలిగితే తప్పకుండా అధిక రాబడే వస్తుందని చెబుతున్నారు. కొన్నిసార్లు ఒకటి రెండేళ్లలోనూ మంచి వృద్ధి కనిపించినా.. అన్నిసార్లు, అన్నిచోట్ల జరగదు కాబట్టి కనీసం ఐదేళ్ల వరకైనా ఎదురు చూడగలగాలి.

కొనకుండా ఆపుతున్నదేంటి?
పొదుపు చేసిన సొమ్ముతో పాటూ రుణం తీసుకుని స్థిరాస్తి కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తున్నా కొన్ని అంశాలు వారిని ముందడుగు వేయనీయడం లేదు. ఉద్యోగ భద్రతపై కొంత భయాందోళనలు ఉన్నాయి. 62 శాతం మందిలో ఈ భయాలు ఉన్నాయి. వడ్డీరేట్లు భారం సైతం పెరిగింది. అయినా సరే ధైర్యం చేసి చాలామంది కొనేందుకు ముందుకొస్తున్నారు. మిగతావారిలో విశ్వాసం పెరిగేందుకు ఇంకొంత కాలం వేచిచూసే ధోరణిలో ఉన్నారు.

ప్రాజెక్టులు ఆలస్యం..
ఆర్థికంగా కష్టమైనా సరే.. కొంతకాలం సరదాలకు దూరంగా ఉంటూ సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నవారి శాతమూ ఎక్కువే ఉంది. అయితే ప్రాజెక్టులు ఆలస్యం కావడం వీరిని పునరాలోచనలో పడేస్తోంది. వేర్వేరు కారణాలతో గడువు లోపల పూర్తి చేసి ఇస్తున్న సంస్థలు పరిమితంగా ఉంటున్నాయి. దీంతో ఒకవైపు ఇంటి అద్దె, మరోవైపు ఈఎంఐ భారంతో.. కనీస అవసరాలైన పిల్లల విద్య, ఆరోగ్యం వంటి విషయాల్లో ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇతరులు ఎదుర్కొంటున్న ఇలాంటి ఇబ్బందులను చూసి కొనడానికి వెనకంజ వేస్తున్న వారు 38 శాతంగా ఉన్నారు. గడువు లోపల ఇస్తాం అనే భరోసా ఇవ్వగలిగితే వీరంతా కొనడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట.


బీమాతో ధీమా కల్పిస్తే...

ఇల్లు కొనడం చాలామంది జీవితంలో అతిపెద్ద ఆర్థిక నిర్ణయం. అనుకోని కారణాలతో స్థిరాస్తి కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగం పోతే, వ్యాపారంలో నష్టమొచ్చి ఈఎంఐ చెల్లించలేని పరిస్థితులు ఎదురైతే? ఇవే భయాలు ఎక్కువ మందిని ఇల్లు కొనకుండా వాయిదా వేసేలా చేస్తున్నాయి. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తిరిగి మరో ఉద్యోగం పొందేవరకు, ఆర్థికంగా కుదురుకునే వరకు తాత్కాలికంగా ఒక రెండేళ్లపాటూ ఈఎంఐ చెల్లించక పోయినా ఎగవేతదారుగా భావించకుండా వెసులుబాటు ఉండాలని 94 శాతం మంది కోరుకుంటున్నారు. మార్కెట్లో కొన్ని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ‘పే చెక్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌’లను అందిస్తున్నాయి. గృహరుణ పాలసీల్లోనే వీటిని చేర్చాలంటున్నారు. కొవిడ్‌ సమయంలో ఈఎంఐ చెల్లించలేని వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహరుణ సంస్థలు వెసులుబాటు కల్పించినా పెద్దగా ప్రయోజనం కలగలేదని.. కేవలం ఇదో కంటితుడుపు చర్య అని 94 శాతం మంది అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని