ఐదేళ్లలో రెరాతో విస్తృత మార్పులు

‘తెలంగాణ కొత్త రాష్ట్రమైనా ఎనిమిదేళ్లలోనే ఎంతో పురోగతి సాధించింది.. ఎన్నో అంశాల్లో అగ్రగామిగా నిలిచింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం పురోగతిలో ఉంది. పూర్తి స్థాయిలో రెరా అథారిటీ, అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయకపోవడం స్థిరాస్తి రంగానికి మంచిది కాదు, రెరా లేకుండానే ప్రాజెక్టు చేయవచ్చు అని డెవలపర్లు సంతోషంగానే ఉంటారు.

Updated : 24 Sep 2022 09:58 IST

పూర్తి స్థాయి అథారిటీ లేకపోవడం చట్ట స్ఫూర్తికి విఘాతం
అంతిమంగా కొనుగోలుదారులకు నష్టం
‘ఈనాడు’తో మహా రెరా మాజీ ఛైర్మన్‌ గౌతమ్‌ ఛటర్జీ
ఈనాడు, హైదరాబాద్‌

‘తెలంగాణ కొత్త రాష్ట్రమైనా ఎనిమిదేళ్లలోనే ఎంతో పురోగతి సాధించింది.. ఎన్నో అంశాల్లో అగ్రగామిగా నిలిచింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం పురోగతిలో ఉంది. పూర్తి స్థాయిలో రెరా అథారిటీ, అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయకపోవడం స్థిరాస్తి రంగానికి మంచిది కాదు, రెరా లేకుండానే ప్రాజెక్టు చేయవచ్చు అని డెవలపర్లు సంతోషంగానే ఉంటారు.. అంతిమంగా నష్టపోయేది కొనుగోలుదారులే. డెవలపర్లు సైతం కొనుగోలుదారు కేంద్రంగా ప్రాజెక్టులు చేపట్టి విశ్వాసం పొందితేనే మనుగడ’ అని మహా రెరా మాజీ ఛైర్మన్‌ గౌతమ్‌ ఛటర్జీ పేర్కొన్నారు. స్థిరాస్తి రంగంలో పారదర్శకత పెంపొందించి కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ఐదేళ్ల కిందట రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టానికి అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెరా అథారిటీ ఏర్పాటు చేసి తొలి ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి గౌతమ్‌ ఛటర్జీని నియమించింది. ఆయన నేతృత్వంలో రెరా ఎంతో సమర్థంగా పని చేసిందనే ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో) సలహాదారుగా ఉన్న ఆయన నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి...

* రెరా వచ్చి ఐదేళ్లవుతోంది. పలు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అథారిటీ ఏర్పాటు కాలేదు. తెలంగాణ కూడా అందులో ఒకటి. దేశవ్యాప్త అనుభవాలెలా ఉన్నాయి?
రెరా వచ్చాక రియల్‌ ఎస్టేట్‌ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. 2017 తర్వాత కొత్త శకం మొదలైంది. సరైన దిశలో వెళుతోంది. అంతకుముందు కొనుగోలుదారులకు ఏమైనా సమస్యలుంటే వినియోగదారుల ఫోరం, సివిల్‌ కోర్టుకు వెళ్లేవారు. అక్కడ చాలా జాప్యమయ్యేది. రెరా చట్టం వచ్చాక ప్రతి ప్రాజెక్ట్‌ రెరాలో నమోదు చేసుకున్నాకే విక్రయించాలి. ప్రాజెక్టు పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. కొనుగోలుదారులకు ఎవైనా ఇబ్బందులు ఎదురైతే రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. వీటిని రెండు నెలల్లో పరిష్కరించాలని చట్టం చెబుతుంది. మహా రెరా దేశంలోని మిగతా రెరాలకు ఆదర్శంగా నిల్చింది. 31 వేల ప్రాజెక్టులు రిజిస్టరయ్యాయి. పాతవి కూడా రిజిస్టర్‌ చేసుకునేలా చేశాం. పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యాణ, ఉత్తరప్రదేశ్‌ రెరా బాగా పనిచేస్తున్నాయి. బిహార్‌ ఇదే బాటలో ఉంది. దక్షిణాదిలో కర్టాటక, కేరళలో మొదలైంది. చట్టం వచ్చిన కొత్తలోనే తెలంగాణ అధికారులు మా వద్ద అధ్యయనానికి వచ్చారు. మహా రెరా ఆన్‌లైన్‌ విధానాన్నే ఇక్కడ చేపట్టారు.పూర్తి స్థాయి అథారిటీ మాత్రం ఎందుకో ఏర్పాటు కాలేదు. పశ్చిమ బెంగాల్‌లోనూ సరిగా లేదు.

* తెలంగాణలో ప్రీలాంచ్‌ పేరుతో అక్రమాలు పెరిగాయి? వీటి నియంత్రణకు మీరు ఇచ్చే సూచనలు?
రెరా సమర్థంగా పనిచేయాలంటే పూర్తి స్థాయి అథారిటీ ఉండాలి. ఒక ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులు ఉండాలని చట్టం చెబుతోంది. ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్‌ మొదలు.. సెక్షన్‌ 3 ఉల్లంఘించి రిజిస్ట్రేషన్‌ చేయకుండా విక్రయాలు, మార్కెటింగ్‌ చేస్తున్న వారిపై కొరడా ఝలిపించేందుకు  పూర్తి స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. బిల్డర్‌ నుంచి సమస్యలు ఎదురైతే సెక్షన్‌ 31 ప్రకారం కొనుగోలుదారులు ఫిర్యాదు చేయవచ్చు. చట్టం రెండు నెలల్లో సమస్యను పరిష్కరించాలని చెబుతుంది. పూర్తి అథారిటీ లేకపోతే ఇవన్నీ చేయడం అసాధ్యం. ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులు, అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం అనేది చట్టం స్ఫూర్తికే విఘాతం. దీంతో కొనుగోలుదారులు నష్టపోతారు. వెంటనే ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

* డెవలపర్లలో వచ్చిన మార్పులు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?  
పారదర్శకత పాటించి పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి  ఉండేలా చూడాలి. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఏ ప్రాజెక్టు కోసమైతే కొనుగోలుదారుల వద్ద, బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకుంటారో వాటికే వ్యయం చేయాలి. జవాబుదారీతనం కూడా ఉండాలి. చట్టం ప్రకారం బిల్డర్‌ ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదు అనేది స్పష్టంగా పేర్కొంది. ఈ ప్రకారం నడుచుకుంటున్నారో లేదో చూసుకోవాలి. ఒప్పందం ప్రకారం పనులు పూర్తిచేసేలా చూడాలి. తప్పుడు విధానాలు అనుసరించవద్దు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు అథారిటీ ఎలాగూ ఉంది. అన్నింటి కంటే ప్రధానమైంది కొనుగోలుదారు కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహించడం. భరోసా కల్పించడం. ఈ రోజు బిల్డర్‌ యాజమానిగా ఉంటే అతన్నుంచి కొంటున్న వ్యక్తి రేపటినుంచి యాజమాని అవుతాడు. అంటే యాజమాన్య హక్కులు బదలాయిస్తున్నావు, సమానంగా చూడాలనే భావన అలవాటు చేసుకోవాలి. వినియోగదారుడే  మొదలు అనే సూత్రం అనుసరిస్తే సమస్యలు ఉండవు. ఇవన్నీ చేశాక కూడా ఏమైనా సమస్యలు ఎదురైతే కొనుగోలుదారు సైతం అర్థం చేసుకుంటాడు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు తోడ్పాటు అందిస్తాడు.

* కొనుగోలుదారులకు మీరు ఇచ్చే సూచన?
వినియోగదారులు అవగాహన పెంపొందించుకోవాలి. ఎవరో చెప్పారని వెళ్లి కొనుగోలు చేసే ముందు రెరా వెబ్‌సైట్‌లో ప్రాజెక్టులన్నింటి సమాచారం తెలుసుకోవాలి. పురోగతి గమనించాలి. తర్వాత నిర్ణయం తీసుకోవాలి. రెరాలో రిజిస్టరయిందని గుడ్డిగా నమ్మాల్సిన పనిలేదు. బిల్డర్‌ విశ్వసనీయత చూడాలి. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేశారా లేదో కనుక్కోవాలి. రెరా సైతం సెక్షన్‌ 34 ప్రకారం వినియోగదారులకు అవగాహన కల్పించాలి.

* మహా రెరా బాగా చేసిందనే ప్రశంసలున్నాయి. ఫిర్యాదుల పరిష్కారానికి మీరున్నప్పుడు అనుసరించిన విధానం?
ఫిర్యాదుల పరిష్కారానికి మొదట కన్సాలియేషన్‌ ఫోరం ఏర్పాటుచేశాం. ఇందులో డెవలపర్ల నుంచి ప్రతినిధులు, వినియోగదారుల ఫోరం నుంచి ప్రతినిధులు ఉంటారు. సమస్యను వీరు విని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. డెవలపర్‌ అంటే ఎక్కువ, కొనుగోలుదారు అంటే తక్కువ అనే భావన లేకుండా ఇద్దర్ని ఇక్కడ సమాన స్థాయిలో ఫోరం చూస్తుంది. ప్రతి 10 ఫిర్యాదుల్లో 8 ఇలా పరిష్కారమవుతున్నాయి. అప్పటికీ పరిష్కారం కాకపోతే రెరాకు ఫిర్యాదు చేసేలా ఏర్పాటుచేశాం. ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసే ఏర్పాటుచేశాం. పెద్దన్న చూస్తున్నాడనే స్పృహ డెవలపర్లలో కల్పించాం. మొత్తం 18వేల ఫిర్యాదులు వస్తే 12వేల ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాం. కొవిడ్‌తో ముడిపడిన ఫిర్యాదులు మిగిలిపోయాయి.

* రెరాతో నియంత్రణ తప్ప అభివృద్ధి పట్టించుకోవడం లేదని బిల్డర్లు వాపోతున్నారు కదా?
రిజిస్టరయిన ప్రాజెక్టులు పూర్తి చేశాక అగ్నిమాపక సంస్థలు, స్థానిక కార్పొరేషన్‌ నుంచి నివాస ధ్రువీకరణ పత్రం(ఓసీ) పొందాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో ఎక్కువగా వీటిని ఆపుతుంటారు. బిల్డర్‌కు ఆరు నెలలైనా ఓసీ మంజూరు చేయకపోతే సంబంధిత అధికారులను ఎందుకు ఆపుతున్నారని నోటీసు జారీచేశాం. తక్షణం మంజూరు చేశారు. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగంతో రెరా మాట్లాడుతుంది. ఈ తరహా డెవలపర్‌ అభివృద్ధికి కూడా రెరా పాటుపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని