ఎక్కడ కొంటే లాభం?

ఇల్లయినా, ఇంటి స్థలమైనా.. కొనేముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. మధ్యవర్తి చెప్పారనో.. బంధువుల భరోసాతోనే.. గుడ్డిగా కొనేయొద్దు. అక్రమ లేఅవుట్లు, అనుమతి లేని నిర్మాణాల్లో ఆస్తి కొనుగోలు చేస్తే..

Updated : 06 Oct 2022 10:52 IST

కొనుగోళ్లల్లో అనాలోచితంగా అడుగేస్తే నష్టం

ఈనాడు, హైదరాబాద్‌: ఇల్లయినా, ఇంటి స్థలమైనా.. కొనేముందు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. మధ్యవర్తి చెప్పారనో.. బంధువుల భరోసాతోనే.. గుడ్డిగా కొనేయొద్దు. అక్రమ లేఅవుట్లు, అనుమతి లేని నిర్మాణాల్లో ఆస్తి కొనుగోలు చేస్తే.. తిప్పలు తప్పవు. భవిష్యత్తులో సమస్యలు వెంటాడతాయి. ఆదా చేసే సొమ్ము కంటే క్రమబద్ధీకరణ రుసుములు, నీరు, విద్యుత్తు, ఆస్తి పన్నులు మూడింతల జరిమానాల రూపంలో చెల్లించే డబ్బు ఎక్కువ అవుతుంది. అదనంగా ప్రతీ దశలోనూ మానసిక క్షోభ. అనుమతులు లేనివాటిలో ఇలాంటి మరిన్ని కష్టాలను కొనుగోలుదారులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే.. అన్ని అనుమతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో, నిబంధనల ప్రకారం నిర్మించిన భవన సముదాయాల్లో, అధికారిక ప్రాజెక్టుల్లోని వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేయాలని అధికారులు తెలియజేస్తున్నారు.

అక్రమ లేఅవుట్లలో ఇబ్బందులు ఇలా..
గ్రేటర్‌తోపాటు హెచ్‌ఎండీఏ పరిధిలో అనుమతిలేని లేఅవుట్లు చాలా ఉన్నాయి. అధికారిక లేఅవుట్‌తో పోలిస్తే.. అక్రమ లేఅవుట్లలో భూ విలువ 30శాతం నుంచి 50శాతం తక్కువగా ఉంటుంది. స్థోమత లేనివారు తక్కువకు వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. అలాంటి లేఅవుట్లలో స్థలం కొంటే కష్టాలు తప్పవు. ఇల్లు కట్టాలంటే అనుమతి రాదు. ప్లాటుకు ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించాలి. రోడ్డు కోసం కొంత స్థలాన్ని వదలాలి. ఎందుకంటే.. అక్రమ లేఅవుట్లలో రోడ్డు వెడల్పు తక్కువగా ఉంటుంది. వీటన్నింటినీ తప్పించుకోవాలని.. అనుమతి లేని లేఅవుట్లో స్థలం కొని, అనుమతి లేకుండా ఇల్లు నిర్మిస్తే.. దానికి బ్యాంకు రుణం మంజూరుకాదు. అయినా పర్వాలేదని సొంతంగా ఇల్లు నిర్మించుకుంటే.. జీహెచ్‌ఎంసీ లేదా హెచ్‌ఎండీఏ, స్థానిక మున్సిపాలిటీ అధికారులు ఎప్పుడైనా ఇల్లు కూల్చుతారు. కాపాడుకునేందుకు చాలామంది అవినీతి అధికారులకు లక్షల రూపాయల్లో లంచాలు చెల్లిస్తుంటారు. లంచాలతోపాటు.. ఆ ఇంటికి రెట్టింపు ఆస్తిపన్ను, తాగునీటి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ఇళ్లను కొనేందుకు చాలామంది నిరాసక్తత చూపిస్తారనే విషయాన్నీ కొనుగోలుదారులు గుర్తించాలి.

అధికార లేఅవుట్లతో ప్రయోజనాలు ఇలా..
ఖర్చు ఎక్కువైనా సరే.. అధికారిక లేఅవుట్లలో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేస్తే.. ఆస్తిని బ్యాంకు లాకర్లో దాచినట్లే. నిబంధనల ప్రకారం లేఅవుట్‌ తయారు చేసిన సంస్థనే.. రోడ్లు వేస్తుంది. వీధి లైట్లు, భూగర్భ మురుగునీటి పైపులైన్లు, తాగునీటి పైపులైన్ల వంటి సౌకర్యాలు కల్పిస్తుంది. పార్కును నిర్మిస్తారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్‌, ఇతరత్రా అవసరాల కోసం ఖాళీ స్థలాన్ని వదులుతారు. ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకులు రుణం ఇస్తాయి. సులువుగా ఇంటి అనుమతి లభిస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము ఉండదు. రోడ్డు కోసం భూమిని వదలక్కర్లేదు. సౌకర్యాలు బాగుంటే భూమి విలువ పెరుగుతుంది. రోడ్డు విస్తరణలో, మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేసేటప్పుడు ఇళ్లను తొలగిస్తారనే ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే.. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం రోడ్డుకు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు అడ్డురాకుంటేనే.. సంబంధిత సంస్థలు లేఅవుట్‌ను ఆమోదిస్తాయి. అవసరమైనప్పుడు ఇంటి స్థలాన్ని సులువుగా అమ్ముకోవచ్చు.

అపార్ట్‌మెంట్లో ..
గ్రేటర్‌ పరిధిలో వివాదాస్పద భూములు, ప్రభుత్వ స్థలాలు, నిషేధిత ప్రాంతాల్లో అక్రమంగా కొందరు అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. వేర్వేరు కారణాలతో అధికారులు వాటిపై చర్యలు తీసుకోరు. అయినప్పటికీ.. వాటిలో ఇల్లు కొనడం ఆమోదయోగ్యం కాదని అధికారులు గుర్తుచేస్తున్నారు. ఇంటి అనుమతి తీసుకుని నిర్మించే అపార్ట్‌మెంట్లలో ఫ్లాటు కొంటే.. ఆస్తి పన్నుపై, తాగునీటి రుసుముపై జరిమానా ఉండదు. బ్యాంకు రుణం అందుతుంది. ఇతరులకు సులువుగా అమ్ముకోవచ్చు. ప్రమాణాల ప్రకారం సెట్‌బ్యాక్‌లు ఉంటాయి. ఇంట్లోకి గాలి, వెలుతురు వస్తుంది. అక్రమంగా నిర్మించిన అపార్ట్‌మెంట్లో ఫ్లాటు కొంటే ఇవేవీ ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్నిసార్లు భవనం మొత్తాన్ని కూల్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.


వివరాలను సరిచూసుకోవాలి..

* అధికారిక లేఅవుట్లో స్థలం కొనే ముందు.. లేఅవుట్‌కు తుది ఆమోదం తెలిపిన సంస్థ(జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ లేదా ఇతర స్థానిక సంస్థ)లో విచారించుకోవడం మంచిది.
* రెరా అనుమతి తప్పనిసరి. రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. భూమికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, సేల్‌డీడ్‌, ఇతరత్రా దస్త్రాలను పరిశీలించుకోవడం మరీ ఉత్తమం.
* అపార్ట్‌మెంట్లో ఇల్లు కొనే ముందు.. అనుమతి పత్రాన్ని అధికారులకు చూపిస్తే మేలు. కొందరు అనుమతి తీసుకున్నప్పటికీ.. సెట్‌బ్యాక్‌ లేకుండా నిర్మాణం చేపడతారు. దానివల్ల భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ మంజూరుకాదు. ఇంటికి నాలుగు వైపులా నిబంధనల ప్రకారం స్థలాన్ని ఖాళీగా వదిలారా? లేదా? అని కొలిచి చూసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని