గజాల నుంచి ఎకరాల వరకు

పెట్టుబడికి భరోసా ఉండాలి... వృద్ధికి ఢోకా ఉండకూడదు.. వారాంతాల్లో గడిపేందుకు అనువుగా ఉండాలి.. పొలం పనుల ముచ్చట తీరాలి..  వీటిన్నింటికి సమాధానంగా కొనుగోలుదారులకు ఫామ్‌ల్యాండ్స్‌ కనబడుతున్నాయి. హైదరాబాద్‌ ప్రాంతీయ వలయ రహదారి బయట ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టారు. శ్రీశైలం, యాదాద్రి, సాగర్‌, బెంగళూరు, వికారాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.

Published : 01 Oct 2022 03:49 IST

పెట్టుబడి పెట్టేముందు...
దీర్ఘకాలం దృష్ట్యా మాత్రమే ఫ్యామ్‌ ల్యాండ్స్‌ అనుకూలం.
ప్రాజెక్టు సందర్శించిన తర్వాతనే కొనుగోలు చేయాలి.  
డెవలపర్‌ గత ప్రాజెక్టుల చరిత్ర తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి.
ఒక్కరే కొనే స్తోమత లేకపోతే.. ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకోవచ్చు.  
ఈనాడు, హైదరాబాద్‌

పెట్టుబడికి భరోసా ఉండాలి... వృద్ధికి ఢోకా ఉండకూడదు.. వారాంతాల్లో గడిపేందుకు అనువుగా ఉండాలి.. పొలం పనుల ముచ్చట తీరాలి..  వీటిన్నింటికి సమాధానంగా కొనుగోలుదారులకు ఫామ్‌ల్యాండ్స్‌ కనబడుతున్నాయి. హైదరాబాద్‌ ప్రాంతీయ వలయ రహదారి బయట ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టారు. శ్రీశైలం, యాదాద్రి, సాగర్‌, బెంగళూరు, వికారాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.

* కొవిడ్‌ తర్వాత నగరవాసుల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. కొవిడ్‌ సమయంలో సిటీలో అపార్ట్‌మెంట్లలో, ఇరుకు ఇళ్లలో ఉంటున్న వారు.. ఇక్కడ సురక్షితం కాదని శివార్లలోని వ్యవసాయ క్షేత్రాలకు, సొంతూర్లకు మకాం మార్చారు. అక్కడ ఎలాంటి భయాలు లేకుండా ప్రకృతి నడుమ గడిపారు. ఉరుకులు పరుగులు లేకుండా ఆరోగ్యకర వాతావరణంలో నివసిస్తున్న అనుభూతి చెందారు. ప్రస్తుతం కొవిడ్‌ భయాలు తొలగి తిరిగి నగరానికి మకాం మార్చినా.. వారాంతాల్లో ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు ఫామ్‌ల్యాండ్‌ కొనుగోలు చేస్తున్నారు. కొంతకాలంగా సిటీ చుట్టుపక్కల జిల్లాల్లో ఫ్యామ్‌ల్యాండ్‌ రిజిస్ట్రేషన్ల లావాదేవీలు పెరగడం ఇందుకు నిదర్శనం.

కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని ఫ్యామ్‌ల్యాండ్స్‌లోనే భిన్నరకాలైన ప్రాజెక్టులను డెవలపర్లు చేస్తున్నారు. తక్కువలో తక్కువ నాలుగు గుంటల నుంచి విక్రయిస్తున్నారు. అదే వెంచర్‌లో పావు ఎకరం నుంచి ఎకరం వరకు భూములు ప్లాటింగ్‌ చేస్తున్నారు. ప్రతి స్థలంలో పండ్ల మొక్కలు, దీర్ఘకాలంలో ఆదాయాన్నిచ్చే ఎర్రచందనం, టేకు వంటి మొక్కలు పెంచుతున్నారు.  కొన్ని సంస్థలు పూర్తి స్థాయిలో మొక్కలు పెంచుతుంటే.. మరికొన్ని ప్రాజెక్టులో ఫామ్‌హౌజ్‌ కట్టుకునేందుకు, వీకెండ్‌ హోమ్స్‌ నిర్మించుకునేందుకు కొంత స్థలం వదిలి మొక్కలు నాటుతున్నారు. ప్రత్యేకంగా క్లబ్‌హౌజ్‌లు నిర్మిస్తున్నాయి. ఈ తరహా ప్రాజెక్టులు ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నాయి. శంకర్‌పల్లి, చేవేళ్ల, వికారాబాద్‌, షాద్‌నగర్‌, ఆమనగల్‌, సాగర్‌ రోడ్డు, భువనగిరి చుట్టుపక్కల ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపార బాధ్యతల నుంచి రిటైర్‌ అయ్యాక.. సిటీకి దూరంగా ప్రశాంత వాతావరణంలో నివసించొచ్చని ముందు చూపుతో కొందరు.. పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం మరికొందరు వీటిల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, పదవీ విరమణకు చేరువలో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా కొంటున్నట్లు స్థిరాస్తి సంస్థలు చెబుతున్నాయి.

ఉమ్మడిగా..
కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా వ్యవసాయ పొలాలనే పావు ఎకరం మొదలు ఎకరం వరకు విక్రయిస్తున్నాయి. పెట్టుబడి దృష్ట్యా చాలామంది ముందుకొస్తున్నా.. వ్యవసాయంపై మక్కువ ఉన్నవారికే అమ్ముతున్నారు. స్థలాలపై పెట్టుబడి పెట్టి ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచడం ఇష్టం లేనివారు.. పొలాల వైపు చూస్తున్నారు. పొలం కొని సొంతంగా వ్యవసాయం చేయలేని వారు.. అప్పుడప్పుడు వెళ్లి వ్యవసాయ పనుల్లో పాలుపంచుకోవాలనుకునేవారు ఈ తరహా ప్రాజెక్టుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ అందరి పొలాలను కలిపి ఉమ్మడి సాగు చేస్తారు. ఏడాది పొడవున ఏదో ఒక పంట చేతికొచ్చేలా పండిస్తారు. ఇక్కడ సేంద్రియ పద్దతిలో పండించిన కూరగాయలు, పాలు, పండ్లను వారాంతాల్లో వచ్చి తీసుకెళుతుంటారు. మిగిలినవి విక్రయించి ఎవరి వాటా వారికి అందజేస్తుంటారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో నివసించేలా ఏర్పాట్లు సైతం ఉంటున్నాయి. తమ పిల్లలకు వ్యవసాయం గురించి పరిచయం చేస్తున్నారు. మూడునాలుగేళ్లలో పొలాల ధరలు సైతం రెట్టింపు అవుతుండటంతో.. ఒకరి చూసి మరొకరు పెట్టుబడి పెడుతున్నారు. 

ప్రధాన రహదారికి దూరంగా..
సాధారణంగా ఫ్యామ్‌ల్యాండ్‌ ప్రాజెక్టులన్నీ ప్రధాన రహదారి నుంచి అర కిలోమీటర్‌ మొదలు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. రహదారి దగ్గర ఉన్నవాటిలో సహజంగానే భూముల ధరలు అధికంగా ఉంటాయి. దూరం వెళ్లే కొద్దీ తగ్గుతుంటాయి. నిర్వహణను బాధ్యతను ఆయా సంస్థలే పదేళ్ల పాటూ చూస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉచితంగా నిర్వహణ చేపడితే.. మరికొన్ని సంస్థలు కొంత వసూలు చేస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని