నిర్మాణ రంగం కొత్త ఎత్తులకు

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో గృహ నిర్మాణాల సంఖ్య పెరిగింది. గతంలో వార్షికంగా 25వేల నుంచి 30వేల ఇళ్ల నిర్మాణాలు జరిగేవి. కాస్త ఎక్కువ తక్కువగా క్రయ విక్రయాలు అదే స్థాయిలో ఉండేవి. ఇటీవల చూస్తే వీటి సంఖ్య రెండింతలు పెరిగింది. వరసగా రెండేళ్ల పాటూ మూడో త్రైమాసికం ముగింపు నాటికే 50వేల ఇళ్ల విక్రయాలు జరిగాయి.

Published : 15 Oct 2022 02:32 IST

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో గృహ నిర్మాణాల సంఖ్య పెరిగింది. గతంలో వార్షికంగా 25వేల నుంచి 30వేల ఇళ్ల నిర్మాణాలు జరిగేవి. కాస్త ఎక్కువ తక్కువగా క్రయ విక్రయాలు అదే స్థాయిలో ఉండేవి. ఇటీవల చూస్తే వీటి సంఖ్య రెండింతలు పెరిగింది. వరసగా రెండేళ్ల పాటూ మూడో త్రైమాసికం ముగింపు నాటికే 50వేల ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఏడాది ముగిసే నాటికి 60వేల యూనిట్లు దాటే అవకాశం ఉంది.

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో ఎక్కడ చూసినా ఐదు అంతస్తుల భవనాల స్థానంలో పది అంతస్తుల రెసిడెన్షియల్‌ టవర్లు వస్తున్నాయి. 20 అంతస్తులు కట్టిన చోటనే ఇప్పుడు 45 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారు. 20 ఇళ్లు కట్టే బిల్డర్‌ వంద ఇళ్లు కడుతుంటే... వంద ఇళ్లు కట్టే సంస్థ ఐదు వందలు కడుతోంది. వెయ్యి కట్టేవాళ్లు ఏకంగా రెండుమూడువేల యూనిట్లతో మినీ టౌన్‌షిష్‌లను నిర్మిస్తున్నారు. మూడు దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థలే కాదు మూడేళ్ల క్రితం మొదలైన అంకుర సంస్థలు సైతం వెయ్యి ఇళ్లను సునాయాసంగా కట్టేస్తున్నాయి. చిన్న ప్రాజెక్టులు తగ్గి పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీల సంఖ్య పెరిగింది. దీంతో చిన్న బిల్డర్లు ద్వితీయ శ్రేణి నగరాల వైపు చూస్తుండగా...పెద్ద బిల్డర్లు మరిన్ని చోట్ల మరిన్ని భారీ ప్రాజెక్ట్‌లు మొదలెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక ప్రముఖ సంస్థ రాబోయే నెలల్లో సిటీలోనే అత్యంత ఎత్తైన ప్రాజెక్టును మొదలెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికతను వినియోగించడంతో నిర్మాణ వేగం సైతం పెరిగింది. కొవిడ్‌ వంటి అవరోధాలు ఎదురైనా ఆలస్యం అయిన ప్రాజెక్టులు సిటీలో తక్కువే ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్‌ మార్కెట్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయి.

రెండేళ్లుగా చూస్తే..

హైదరాబాద్‌ రాజధాని ప్రాంతం నాలుగు జిల్లాల పరిధిలో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 50,953 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాది ఈ సంఖ్య 62,052గా ఉందని ఏజెన్సీ నివేదికలు చెబుతున్నాయి. కొవిడ్‌ కారణంగా 2020లో వాయిదా పడిన విక్రయాల్లో అధికశాతం 2021లో జరిగాయి. దీంతో అనూహ్య పెరుగుదల కనిపించింది. ప్రస్తుత ఏడాది విక్రయాలు నిలకడగా ఉన్నాయి. ఇదే స్థిరపడవచ్చునని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. సగటున వార్షికంగా 60వేల వరకు విక్రయాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులో 5 నుంచి 10 శాతం అంటే దాదాపుగా 10వేల పైన పాత ఇళ్లు, పెట్టుబడి దృష్టా కొని వెంటనే అమ్మే ఇళ్లు ఉంటాయని...కొత్త ఇళ్లు 50వేల వరకు ఉంటాయని చెబుతున్నారు.

అంత డిమాండ్‌ ఉందా?

నగరంలో ఐటీ రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. పలు సంస్థలు తమ ప్రాంగణాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. గత ఏడాది ఏకంగా 1.55 లక్షల కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలో వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటూ ఫార్మా, పరిశ్రమలు, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలను పెరిగాయని చెబుతున్నారు. సహజంగానే తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. కొందరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏ రకంగా చూసినా లక్ష ఇళ్లకు డిమాండ్‌ ఉంటుందని బిల్డర్లు చెబుతున్నారు. ఇందులో తాము 50వేల వరకు మాత్రమే కట్టగలుగుతున్నామని బిల్డర్లు అంటున్నారు.

ధరలు పెరుగుతూనే ఉన్నాయ్‌..

ఇళ్లకు ఇంకా ఎక్కువే డిమాండ్‌ ఉన్నా.. అందుబాటులో ధరలు లేకపోవడంతో కొన్ని వర్గాలు కొనలేకపోతున్నాయి. కొన్నవాళ్లు ధరల వృద్ధి చూస్తే తమ స్థిరాస్తి విలువ పెరిగిందని సంతోషిస్తుంటే... రోజురోజుకు ధరల పెరుగుదలతో నగరంలో అసలు ఇళ్లు కొనగలమో లేదోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విలాసవంతమైన ఇళ్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. దీంతో పెద్ద బిల్డర్లు వీటినే కడుతున్నారు.

* హైదరాబాద్‌ రాజధాని ప్రాంతంలోని నాలుగు జిల్లాల పరిధిలో ఏడాది వ్యవధిలో సగటున 15 శాతం ఇళ్ల ధరలు పెరినట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.

* హైదరాబాద్‌లో చదరపు అడుగు సగటు ధర రూ.4179గా ఉంది. వార్షికంగా 10 శాతం ధర పెరిగింది.

* మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో సగటు చదరపు అడుగు ధర రూ.2992గా ఉంది. ఇక్కడ ధరల వృద్ధి 21 శాతంగా ఉంది.

* రంగారెడ్డి జిల్లాలో సగటు చ.అ. ధర రూ.4096గా ఉంది. ధరల్లో వృద్ధి 8 శాతం నమోదైంది.

* సంగారెడ్డి జిల్లాలో సగటు చ.అ. ధర రూ.2387 ఉంది. ఇక్కడ ధర నిలకడగా ఉంది.


సంఖ్య బాగా పెరిగింది

- పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

2014 వరకు వార్షికంగా 25వేల నుంచి 30వేల ఇళ్లు హైదరాబాద్‌లో కట్టేవారు. 2016-17 నుంచి నిర్మాణాల సంఖ్య భారీగా పెరిగింది. వార్షికంగా 50వేల ఇళ్ల వరకు విక్రయిస్తున్నారు. ఉపాధి అవకాశాలను బట్టి ఇందులో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఐటీ మెరుగ్గా ఉంది. ఫార్మాసిటీ రాబోతోంది. వచ్చే రెండేళ్ల వరకు ఇళ్ల డిమాండ్‌కు ఢోకా లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని