రెరాలో లక్షకు పైగా వివాదాల పరిష్కారం

తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(టీఎస్‌ రెరా)లో 5,148 ప్రాజెక్టులు, 2,448 మంది ఏజెంట్లు ఇప్పటివరకు రిజిస్టర్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా 2022 అక్టోబరు 8 నాటికి 94,513 ప్రాజెక్టులు రెరాలో నమోదయ్యాయి.

Published : 22 Oct 2022 02:05 IST

తెలంగాణలో మాత్రం రెండే కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(టీఎస్‌ రెరా)లో 5,148 ప్రాజెక్టులు, 2,448 మంది ఏజెంట్లు ఇప్పటివరకు రిజిస్టర్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా 2022 అక్టోబరు 8 నాటికి 94,513 ప్రాజెక్టులు రెరాలో నమోదయ్యాయి. మూడేళ్లలో రిజిస్టర్‌ చేసుకున్న ప్రాజెక్టులు రెండింతలయ్యాయి. 2019 అక్టోబరు 8 నాటికి 45,307 మాత్రమే నమోదయ్యాయి. మూడేళ్లలో 109 శాతం పెరిగాయి. రిజిస్టర్డ్‌ ఏజెంట్లు 95 శాతం పెరగగా.. వీరి సంఖ్య 69,766కు చేరింది. దేశవ్యాప్తంగా రెరాలో నమోదైన ఫిర్యాదుల్లో లక్ష పరిష్కారం కాగా.. తెలంగాణలో రెండు మాత్రమే అని అనరాక్‌ తాజా నివేదికలో వెల్లడించింది.

* మహారాష్ట్రలో ఇప్పటివరకు 38,229 ప్రాజెక్టులు, 38,969 మంది ఏజెంట్లు మహా రెరాలో రిజిస్టర్‌ అయ్యారు. తమిళనాడులో 10,771 ప్రాజెక్టులు, కర్ణాటకలో 6,313, ఉత్తరప్రదేశ్‌లో 3,304 ప్రాజెక్టులు నమోదయ్యాయి.

* మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రెరాలో నమోదైన ప్రాజెక్టుల వాటానే 83 శాతంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో 78,258 ప్రాజెక్టులు ఇప్పటివరకు రిజిస్టర్‌ అయ్యాయి.

కేసుల పరిష్కారం ఇలా.. కొనుగోలుదారులు, బిల్డర్ల మధ్య తలెత్తిన వివాదాలను రెరా పరిష్కరిస్తుంది. దేశవ్యాప్తంగా ఒక లక్షా 949 వివాదాలను రెరా వచ్చినప్పటి నుంచి పరిష్కారం కాగా.. గడిచిన మూడేళ్లలో 72 శాతం కేసులు 72,979 పరిష్కారం అయ్యాయి. యూపీరెరా ఏకంగా 40,559 కేసులను, హర్యానాలో 20,539 కేసులు, మహారెరా 12,507 కేసులను విచారించి కొనుగోలుదారులకు న్యాయం చేశాయి. తెలంగాణలో రెండంటే రెండు కేసులు పరిష్కారం అయినట్లు అనరాక్‌ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో రెరా అథారిటీ లేకపోవడంతో ఫిర్యాదులు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు