ఖర్చు పెరుగుతుందనేది అపోహ మాత్రమే

‘వాహన కాలుష్యం తర్వాత అత్యంత ఎక్కువ కర్బన ఉద్గారాలు భవనాల నుంచి వెలువడుతున్నాయి. వాహన కాలుష్యం తగ్గించేందుకు క్రమంగా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వైపు మళ్లుతున్నాం. మరీ భవనాల సంగతి ఎంటి? కొత్తవి, పాతవన్నీ హరిత భవనాలుగా మారితేనే మనకు మనుగడ.

Updated : 22 Oct 2022 02:11 IST

ఏటా 2 బిలియన్‌ చ.అ. హరిత భవనాలే లక్ష్యం

‘ఈనాడు’తో ఐజీబీసీ ఛైర్మన్‌ గుర్మిత్‌ సింగ్‌ అరోరా

ఈనాడు, హైదరాబాద్‌

‘వాహన కాలుష్యం తర్వాత అత్యంత ఎక్కువ కర్బన ఉద్గారాలు భవనాల నుంచి వెలువడుతున్నాయి. వాహన కాలుష్యం తగ్గించేందుకు క్రమంగా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వైపు మళ్లుతున్నాం. మరీ భవనాల సంగతి ఎంటి? కొత్తవి, పాతవన్నీ హరిత భవనాలుగా మారితేనే మనకు మనుగడ. ఇందుకోసం 2030 నాటికి దేశంలోని కొత్త భవనాలన్నీ నీరు, కరెంట్‌ ఆదాతో పాటూ వృథాని, కర్బన ఉద్గారాలను తగ్గించే నెట్‌ జీరోలోకి మారిపోవాలి. ఈ తరహాలో హరిత భవనాల నిర్మాణాలకు ఖర్చు ఎక్కువ అవుతుందని కొందరు బిల్డర్లు భావిస్తున్నారు. ఇది అపోహ మాత్రమే’ అని సీఐఐ-ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) ఛైర్మన్‌ గుర్మిత్‌ సింగ్‌ అరోరా అన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న మూడు రోజుల గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఈనాడు’ ముఖాముఖీలో పలు విషయాలు వెల్లడించారు.

హరిత భవనాల నిర్మాణంలో ప్రస్తుతం మనం ఏ దశలో ఉన్నాం? భవిష్యత్తు లక్ష్యాలేంటి?

2001లో దేశంలో హరిత భవనాల ఉద్యమం హైదరాబాద్‌ నుంచే మొదలైంది. మాదాపూర్‌లో సీఐఐ గోద్రెజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ను తొలి హరిత భవనంగా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాం. అక్కడి నుంచి మొదలై ప్రస్తుతం 9.75 బిలియన్‌ చదరపు అడుగులకు చేరుకున్నాం. డిసెంబరు నాటికి 10 బిలియన్ల మార్క్‌ను చేరుతాం. ప్రస్తుతం యూఎస్‌ఏ తర్వాత మనం రెండో స్థానంలో ఉన్నాం. 2050 నాటికి 50 బిలియన్‌ చదరపు అడుగులకు చేరుకోవాలనేది భారత్‌ లక్ష్యం. ఇందుకోసం మరో 27 ఏళ్లు మాత్రమే ఉంది. వేగం పెరగాల్సి ఉంది. మొదట్లో ఏటా ఒక బిలియన్‌ చ.అ. హరిత భవనాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ఐజీబీసీ.. వ్యూహం మార్చింది. ఏటా 2 కోట్ల చ.అ. లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

పెద్ద సంస్థలు చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులు మినహా ఎక్కువ మంది బిల్డర్లు హరిత భవనాలను కట్టేందుకు ముందుకు రావడం లేదెందుకని?

హరిత భవనాల నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవుతుందని బిల్డర్లు భావిస్తున్నారు. 20 ఏళ్ల క్రితమైతే నిజమే. 2003లో హరిత భవనం నిర్మాణానికి 80 శాతం ఖర్చు ఎక్కువ అయ్యేది. అప్పట్లో నిర్మాణ ఉత్పత్తులు అందుబాటు లేవు. ప్రస్తుతం గ్రీన్‌ప్రో కౌన్సిల్‌ ధృవీకరించిన 5400 గ్రీన్‌ ఉత్పత్తులు ఉన్నాయి. కన్సల్టెంట్లు, అర్కిటెక్చర్లు, టెక్నాలజిస్టుల వంటి వృత్తి నిపుణులు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం సంప్రదాయ నిర్మాణ వ్యయంతో సమానంగానే హరిత భవనాలకు ఖర్చు అవుతుంది. ఎక్కువ వ్యయం అవుతుందని, పెట్టుబడి పెరుగుతుందని బిల్డర్లు అపోహ పడుతున్నారు. అదనంగా ఖర్చు చేయకుండానే డిజైనింగ్‌ దశలోనే జాగ్రత్తలతో 40 నుంచి 50 శాతం నీటిని ఆదా చేయవచ్చు. 30 శాతం వరకు విద్యుత్తు ఆదా అవుతుంది. నిర్మాణ సమయంలో వృథాని గణనీయంగా తగ్గించవచ్చు. వీటిపై బిల్డర్లు, కొనుగోలుదారుల్లో అవగాహన రావాల్సి ఉంది. ఆ దిశగా ఐజీబీసీ ప్రయత్నాలు చేస్తోంది. మార్కెట్లో అప్పటిదాకా ఉపయోగించిన ఒక వస్తువు కనిపించకపోతే క్రమంగా కొనుగోలుదారులు మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే నిరంతరం బ్రాండింగ్‌ చేస్తుంటారు. ఐజీబీసీ కూడా ఇదే తరహా హరిత భవనాల ప్రాధాన్యతపై భవిష్యత్తులో మార్కెటింగ్‌ చేయబోతుంది.

దేశంలో హరిత భవనాల నిర్మాణ పరంగా ఆచరణలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? అధిగమించడానికి ఐజీబీసీ చేసే సూచనలు?

ఇటీవల కాలంలో నెట్‌ జీరో ఎనర్జీ భవనాలు ఎక్కువగా వస్తున్నాయి. భవనాలపైన సౌర విద్యుత్తుతో కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అదనంగా ఉన్న కరెంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానిస్తున్నాయి. భవనాలే పర్యావరణహిత కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. దీన్ని మరింతగా ప్రోత్సహించాల్సి ఉంది. కానీ కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక 40 అంతస్తుల టవర్‌ తీసుకుంటే ఆ భవనంపై ఎక్కువ విస్తీర్ణం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సంస్థలు 100 కిలోమీటర్ల దూరంలో క్యాప్టివ్‌ అవసరాల కోసం సౌర విద్యుత్తు ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడ గ్రిడ్‌కు అనుసంధానించి ఇక్కడ వాడుకుంటారు. ఇందుకోసం విద్యుత్తు సంస్థలు భారీగా వీలింగ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. వీలింగ్‌ ఛార్జీలు రద్దు చేయాలి.

ఇళ్ల కొనుగోలుదారులకు మీరు చేసే సూచన?

ఇల్లు కొనేటప్పుడు ఐజీబీసీ రేటింగ్‌ ఉందా లేదా అని కొనుగోలుదారులు అడిగే రోజు వస్తుంది. మున్ముందు వాటికే డిమాండ్‌ ఉంటుంది. రేటింగ్‌ కలిగిన ఇళ్లలో నీరు, కరెంట్‌ ఆదాతో పాటూ ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటారు. నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ఇంటి కొనుగోలులో ఇల్లాలి నిర్ణయం కీలకం. ఐజీబీసీ రేటింగ్‌ ఉన్న ఇంటినే గృహిణులు కొనే రోజు రావాలని ఆశిస్తున్నాను. ఐజీబీసీ 31 రకాల విభాగాల్లో రేటింగ్‌ ఇస్తోంది. ఇళ్లు, కార్యాలయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లతోపాటూ పెట్రోల్‌ పంప్‌లు, పోలీసుస్టేషన్లు, ఆసుపత్రులకు హరిత భవనాల రేటింగ్‌ ఇస్తోంది. మనదేశంలో వ్యక్తిగత గృహాలు ఎక్కువ కాబట్టి వీటిని సైతం హరితంగా తీర్చిదిద్దుకునేందుకు ‘నెస్ట్‌’ రేటింగ్‌ తీసుకొచ్చాం.

ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలను ఆశిస్తున్నారు?

దేశంలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఇళ్లకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. మున్ముందు 2/3వ వంతు నిర్మాణాలు రాబోతున్నాయి. నీటి కొరత వేధిస్తుంది. వనరులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీన్నుంచి కాపాడుకోవాలంటే హరిత భవనాలే శరణ్యం. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు అందితే మరింత వేగంగా వీటిపై అడుగులు పడతాయి. పలు రాష్ట్రాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ముంబయిలో తప్ప మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో పుణెలో హరిత భవనాలకు రేటింగ్‌ ఆధారంగా అదనపు ఎఫ్‌ఎస్‌ఏ ఇస్తున్నారు. దీంతో ఎక్కువ మంది బిల్డర్లు ముందుకొస్తున్నారు. స్టాంప్‌ డ్యూటీలో రాయితీలు ఇస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. 18 రాష్ట్రాల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని