వినియోగం తక్కువ.. ఉత్పాదకత ఎక్కువ

నగరంలో పెద్ద సంఖ్యలో ఐటీ కార్యాలయాలున్నాయి. వీటిలో కొన్ని చాలా ప్రత్యేకం. నీరు, విద్యుత్తు ఆదాతోపాటు సహజ సిద్ధ వెలుతురు, పచ్చదనంతో ఆహ్లాదకర పరిసరాల్లో ఉద్యోగులు పనిచేసే వాతావరణాన్ని ఆయా సంస్థలు కల్పిస్తున్నాయి.

Updated : 29 Oct 2022 10:44 IST

హరిత కట్టడాల ప్రత్యేకతలెన్నో

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పెద్ద సంఖ్యలో ఐటీ కార్యాలయాలున్నాయి. వీటిలో కొన్ని చాలా ప్రత్యేకం. నీరు, విద్యుత్తు ఆదాతోపాటు సహజ సిద్ధ వెలుతురు, పచ్చదనంతో ఆహ్లాదకర పరిసరాల్లో ఉద్యోగులు పనిచేసే వాతావరణాన్ని ఆయా సంస్థలు కల్పిస్తున్నాయి. హరిత భవనాలుగా గుర్తింపు పొందిన వీటిలో ఉద్యోగుల ఉత్పాదకత మెరుగ్గా ఉన్నట్లు  ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) నిపుణులు చెబుతున్నారు. సుస్థిరాభివృద్ధి దిశగా ఈ సంస్థల అడుగులు ఉండటంతో ఐజీబీసీ రూపొందించిన తాజా కాఫీ టేబుల్‌ బుక్‌లో వీటికి చోటు కల్పించారు. వీటి స్ఫూర్తితో సిటీలో పలు కార్యాలయాలు హరిత భవనాలుగా నిర్మిస్తున్నారు.

సగమే నీటి వినియోగం

నానక్‌రాంగూడలో 12.13 ఎకరాల విస్తీర్ణంలో వేవ్‌ రాక్‌ భవనాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. దాదాపు 2 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ స్థలంలో 25 కంపెనీలు ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయి. 24 గంటలు ఇక్కడ ఉద్యోగులు పనిచేస్తుంటారు. వర్షపు నీటిలో 83 శాతం ప్రాంగణంలోనే భూమిలోకి ఇంకేలా ఇంకుడుగుంతలు, రెయిన్‌ వాటర్‌ ట్రెంచ్‌, నిల్వ చేసుకునేందుకు భారీ ట్యాంకులు నిర్మించారు. నీటి పునర్వినియోగం కోసం మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు సత్ఫలితాలు ఇస్తోంది. 56 శాతం నీటి డిమాండ్‌ను ఇది తీరుస్తుంది. ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌(ఈసీబీసీ) పాటించడంతో 25 శాతం విద్యుత్తు ఆదా అవుతోంది. 20 కిలోవాట్‌ సౌర విద్యుత్తు ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ వెలువడే చెత్తనంతా రీసైక్లింగ్‌ చేస్తూ జీరో వృథా ట్యాగ్‌ పొందారు. భవనాల లోపల గాలి నాణ్యతను మెరుగు పర్చేందుకు వీవోసీ ఫిల్టర్లతో సహా వేర్వేరు చర్యలు చేపట్టారు. ఫలితంగా ఐజీబీసీ ప్లాటీనం రేటింగ్‌ పొందింది.

30 శాతం విద్యుత్తు ఆదా..

ఆదిభట్లలో 81 ఎకరాల స్థలంలో టీసీఎస్‌ అతిపెద్ద క్యాంపస్‌ను నిర్మించారు. 4 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం విస్తరించి ఉంది. ఐజీబీసీ గోల్డ్‌ రేటింగ్‌ మేరకు క్యాంపస్‌ను రూపకల్పన చేశారు. 16,385 మంది ఉద్యోగులు పనిచేసేలా తీర్చిదిద్దారు. గ్రిడ్‌ నుంచి విద్యుత్తు వినియోగం తగ్గించుకునేందుకు 280 కిలోవాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బయటి వేడి లోపలికి రాకుండా డబుల్‌ గ్లేజింగ్‌ గ్లాసులు ఉపయోగించారు. ఫలితంగా మొత్తం విద్యుత్తు అవసరాల్లో 30 శాతం ఆదా అవుతుంది. భవనంపై కురిసిన వర్షపు నీటిని సంరక్షించే ఏర్పాట్లు ఉన్నాయి. పచ్చదనం కోసం ఆటోమెటిక్‌గా నీరు అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. తక్కువ నీరు వినియోగించేలా ప్లంబింగ్‌లో జాగ్రత్తలు తీసుకున్నారు.


నెట్‌ జీరో లక్ష్యంగా..

హరిత భవనాలతో 40 నుంచి 50 శాతం విద్యుత్తు వినియోగం తగ్గుతుంది. 20 నుంచి 30 శాతం నీరు ఆదా అవుతుంది. ఈ లెక్కలు వేర్వేరు దేశాల్లో భిన్నంగా ఉన్నాయి. హరిత భవనాలతో నెట్‌ జీరో లక్ష్యాలను చేరుకోవచ్చు. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతుంది.

- విక్టోరియా, డైరెక్టర్‌, నెట్‌జీరో, వరల్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని