కొత్త వాటిలో కొనాలా? పాతదైనా పర్వాలేదా?

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, పిల్లల పెళ్లికి, ఉన్నత విద్యాభ్యాసం కోసం స్థలాలను కొనుగోలు చేయడం నగరంలో ఎప్పటి నుంచో ఉన్నదే.  ఇటీవల ఇది బాగా పెరిగింది.

Published : 19 Nov 2022 01:28 IST

లేఅవుట్లలో ధరలెలా ఉన్నాయంటే..
ఈనాడు, హైదరాబాద్‌

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, పిల్లల పెళ్లికి, ఉన్నత విద్యాభ్యాసం కోసం స్థలాలను కొనుగోలు చేయడం నగరంలో ఎప్పటి నుంచో ఉన్నదే.  ఇటీవల ఇది బాగా పెరిగింది. ఇతర పెట్టుబడి సాధనాల్లో రాబడి అంతగా లేకపోవడం, ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మంచి రాబడి వచ్చే అవకాశం రియల్‌ ఎస్టేట్‌లో ఉండటంతో భూములు, స్థలాలపై  ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. పెరిగిన భూముల ధరలతో కొన్ని వర్గాలకు స్థలాల కొనుగోలు సైతం భారంగా మారింది.

ఇక్కడ భారంగా..

నగరంలో కొత్త లేఅవుట్లన్నీ బాహ్యవలయ రహదారి బయట వస్తున్నాయి. ప్రాంతీయ వలయ రహదారి వరకు ఎక్కువగా విస్తరించాయి. అక్కడితో ఆగలేదు. సిటీకి 80 నుంచి వంద కిలోమీటర్ల దూరం వరకు వెంచర్లు వెలిశాయి. అనుమతి పొందిన లేఅవుట్లలో చదరపు గజం పదివేల రూపాయలకు తక్కువ ఎక్కడ విక్రయించడం లేదు. ఇంత ధరలా అని కొనుగోలుదారులు అడిగితే... భూముల ధరలు పెరిగాయని ఎకరం కోటి రూపాయలపైనే  ఉందని.. ఆ ప్రభావం స్థలాలపై ఉంటుందని చెబుతున్నారు. శంకర్‌పల్లి నుంచి చేవెళ్ల, వికారాబాద్‌ వైపు, శ్రీశైలం, సాగర్‌ రహదారిలో ఫార్మాసిటీ పేరుతో... బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో, వరంగల్‌ రహదారి, విజయవాడ రహదారిలో పెద్ద ఎత్తున కొత్త వెంచర్లు వేశారు. కొత్తవి ఎక్కువగా ప్రాంతీయ వలయ రహదారికి చేరువలో ఉన్నాయి. కొవిడ్‌కు ముందు రూ.ఐదారువేలకు చదరపు గజం విక్రయించిన స్థలాలను సైతం ఇప్పుడు రూ.పదివేలపైనే చెబుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఉంటే చదరపు గజం రూ.15వేల నుంచి రూ.20వేల వరకు అమ్ముతున్నారు. సంగారెడ్డి మార్గంలో అవుటర్‌కు చేరువలో పాతికవేల వరకు చెబుతున్నారు. ఇవన్నీ హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లేఅవుట్లు. ఇంత ధరలు పెట్టి ఎక్కడ కొనగలమని సామాన్య, మధ్యతరగతి వాసులు వాపోతున్నారు. ఎగువ మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
* అనుమతులు లేకుండా ఫామ్‌ల్యాండ్ల పేరుతో విక్రయిస్తున్న స్థలాలు చదరపు గజం అవుటర్‌కు చేరువలో ఆరేడువేల రూపాయల నుంచి విక్రయిస్తున్నారు. దూరంగా ఉన్నవాటిలో నాలుగైదువేల వరకు చదరపు గజాన్ని విక్రయిస్తున్నారు. గుంటల లెక్కన కొనుగోలు చేయాల్సి ఉంటుందని రియల్టర్లు చెబుతున్నారు. అనుమతి ఉన్న లేఅవుట్‌లో కొనడం భారమైనా వారు వీటిలో కొనుగోలు చేస్తున్నారు. తమ దగ్గర ఉన్న బడ్జెట్‌లో ఎక్కువ స్థలం కొనుగోలు చేస్తున్నారు. 

కొత్తవాటిలో సానుకూలతలు

* హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులతో వస్తున్న లేఅవుట్లు.  
* కొన్ని ప్లాట్లను తనఖా పెట్టడం తప్పనిసరి కావడంతో లేవుట్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు.
* వచ్చే పది, ఇరవై ఏళ్ల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగకరం.
* దీర్ఘకాల పెట్టుబడికి అనుకూలం.  
* మార్కెటింగ్‌, ప్రచారం ఉంటుంది కాబట్టి కొత్త వాటి సమాచారం కొనుగోలుదారులకు చేరడం ఎక్కువ.

ప్రతికూలతలు

* కొనుగోలుదారులకు భారంగా ధరలు..  
* సిటీకి దూరంగా లేఅవుట్లు

పాతవాటిలో సానుకూలతలు

* కొత్తవాటితో పోలిస్తే సగం ధరల్లోనే కొనొచ్చు.
* సిటీకి దగ్గరలో ఎక్కువగా అందుబాటులో ఉన్నాయ్‌.
* జనావాసాలకు చేరువలో ఉండటం, భవిష్యత్తులో వేగంగా వృద్ధికి అవకాశం.

ప్రతికూలతలు

* అనుమతులు లేని లేఅవుట్లు ఎక్కువ.
* ఒక స్థలాన్ని ఎక్కువ మందికి విక్రయించే అవకాశం.
* మౌలిక వసతులు మసక బారి ఉంటాయి.

వీటిలో తక్కువగా ..

నగరంలో ఇరవై ఏళ్ల క్రితం ఓఆర్‌ఆర్‌, విమానాశ్రయం, ఐటీ సెజ్‌ల పేరుతో వాటి చుట్టుపక్కల, సాగర్‌ రోడ్డు, యాదాద్రి మార్గంలో పెద్ద ఎత్తున లేఅవుట్లు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయా లేఅవుట్లలో  ఇళ్లు వచ్చేశాయి. జనావాసాలకు దూరంగా వేసిన లేఅవుట్లు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వీటిలో ధరలు  ప్రాంతాలను బట్టి చదరపు గజం రూ.5వేల నుంచి దొరుకుతున్నాయి. కొత్త వెంచర్లతో పోలిస్తే సగం ధరలకే వీటిలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. పైగా కొత్త వెంచర్ల కంటే సిటీకి ఇవే దగ్గరలో ఉన్నాయి. వచ్చే ఐదారేళ్లలో ఈ ప్రాంతాలు సైతం జనావాసాల్లో కలిసిపోయే అవకాశం ఉంది. రూ.పదిలక్షల లోపే రెండు వందల గజాల ఇంటి స్థలం కోసం ఇలాంటి వెంచర్ల వైపు చూస్తున్నారు. ఇక్కడ కూడా కొద్దినెలలుగా పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అయితే  వీటిలో ఎక్కువగా గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ లేనివే ఎక్కువగా ఉంటున్నాయి.
* పాత వెంచర్లను తిరిగి అభివృద్ధి చేసి సైతం విక్రయిస్తున్నారు. అప్పట్లో సగంలో వదిలేసిన వాటిని, ఇతర కారణాలతో ఆపేసిన వాటిని సైతం విక్రయిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు విక్రయిస్తున్న వెంచర్లలో ధరలు తక్కువే ఉన్నాయి. పాతవాటినే కొత్తగా అభివృద్ధి చేస్తున్న వాటిలో మాత్రం ధరలు ఆ ప్రాంతంలో ఉన్న ధరలతో పోటీపడుతున్నాయి.
* పాతవాటిలోనూ హెచ్‌ఎండీఏ అనుమతులతో ఉన్న లేఅవుట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటి పక్కనే కొత్త లేఅవుట్లు వస్తున్నాయి. కొత్త వాటిలో కొనలేనివారు  ఆ పక్కనే ఉన్న పాతవాటిలో తక్కువ ధరకే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. 

కొత్తగా వేస్తున్న వెంచర్లలో స్థలం కొనుగోలు చేయడం మేలా? పాత లేఅవుట్‌లలో అందుబాటులో ఉంటే ప్లాట్‌ తీసుకోవడం ఉత్తమమా?  ఆర్థికంగా ఏది కలిసి వస్తుంది? వేటిలో వృద్ధి ఉంటుంది? చాలామంది కొనుగోలుదారులు ఎటూ తేల్చుకోలేక నిర్ణయాన్ని వాయిదా వేస్తుంటారు. రెండింటిలోనూ సానుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయని.. కొనుగోలుదారుల బడ్జెట్‌, అవసరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డెవలపర్లు అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని