రెండేళ్లలో భారీగా నిర్మాణాలు

నిర్మాణ రంగం నగరం నలుమూలలకు విస్తరిస్తోంది. ప్రధాన నగరం, పశ్చిమ నగరం అనే తేడా లేకుండా భవంతులు కొలువుదీరుతున్నాయి.

Published : 26 Nov 2022 01:39 IST

ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా వేగంగా విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగం నగరం నలుమూలలకు విస్తరిస్తోంది. ప్రధాన నగరం, పశ్చిమ నగరం అనే తేడా లేకుండా భవంతులు కొలువుదీరుతున్నాయి. రెండేళ్ల కాలంలో టీఎస్‌బీపాస్‌ ద్వారా జారీ అయిన అనుమతులు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనుమతి పొందిన అపార్ట్‌మెంట్లు, భారీ భవంతుల సంఖ్యను పరిశీలిస్తే.. రింగు రోడ్డు చుట్టూ జరుగుతోన్న అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా.. అమీన్‌పూర్‌, నిజాంపేట, దుండిగల్‌, మణికొండ, బండ్లగూడ జాగీర్‌, నార్సింగి ప్రాంతాల్లో ఎత్తైన నిర్మాణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో..

గచ్చిబౌలి, మాదాపూర్‌ పరిధిలోని ఐటీ కారిడార్‌లో కొత్తగా 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధిలో ఆయా భవనాల్లో సేవలు మొదలవుతాయి. సుమారు నాలుగు లక్షల మంది ఐటీ కారిడార్‌లో ఉపాధి పొందనున్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో జరుగుతోన్న విస్తరణతో మరింత మందికి ఉపాధి లభించనుంది. దాని ప్రభావంతో ఐటీ కారిడార్‌తోపాటు శంషాబాద్‌ నుంచి అమీన్‌పుర్‌ వరకు.. రింగు రోడ్డుకు ఇరువైపులా స్థిరాస్థి రంగం ఊపందుకుంది. వ్యక్తిగత గృహాలు, నివాస సముదాయాలకు డిమాండ్‌ పెరిగింది.

స్వల్పంగా లేఅవుట్లు అభివృద్ధి అయ్యాయి. ఫలితంగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శివారు సర్కిళ్లలో నిర్మాణ అనుమతులు జోరందుకున్నాయి. జూబ్లీహిల్స్‌, శేరిలింగంపల్లి, చందానగర్‌, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, గాజులరామారం, కుత్బుల్లాపూర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌ సర్కిళ్లలో అపార్ట్‌మెంట్లు ఊపందుకున్నాయి.

గ్రేటర్‌ వెలుపల..

గ్రేటర్‌ పరిధి వెలుపల ఉండే శివారు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోనూ నిర్మాణ రంగం జోరందుకుంది. చిన్నపాటి నిర్మాణాల నుంచి 600 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో జారీ అయిన నిర్మాణ అనుమతులను పరిశీలిస్తే.. బడంగ్‌పేట, బోడుప్పల్‌, తుర్కయాంజల్‌, పెద్దఅంబర్‌పేట, పీర్జాదిగూడ, దమ్మాయిగూడ, దుండిగల్‌ ప్రాంతాల్లో ఎక్కువ అనుమతులు మంజూరయ్యాయి. 600 చదరపు గజాల విస్తీర్ణానికి మించిన అనుమతుల సంఖ్యలో మాత్రం అమీన్‌పూర్‌ ముందుంది. అంటే.. ఎత్తైన నిర్మాణాలకు అమీన్‌పూర్‌, మణికొండ, నిజాంపేట, నార్సింగి, బండ్లగూడజాగీర్‌, దుండిగల్‌, పీర్జాదిగూడ, పెద్దఅంబర్‌పేట ప్రాంతాల్లో ఎక్కువ ఆదరణ ఉన్నట్లు. ఐటీ కారిడార్‌కు చేరువలో.. జంట జలాశయాల చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనూ నిర్మాణాలు అధికంగానే ఉన్నాయి. అవన్నీ 111 జీవో పరిధిలో ఉన్న ప్రాంతాలవడంతో గణాంకాల్లో అట్టడుగున కనిపిస్తున్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని