ఆస్తి కొంటున్నారా..?

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. జీవితంలో ఈ రెండూ అంత ముఖ్యమైనవి. కలల సౌధాలు నిర్మించుకోవడానికి ఇంటి స్థలం కొన్నప్పుడు కాని.. అపార్టుమెంటులో ఫ్లాట్‌ సొంతం చేసుకోవాలనుకున్నా.. మీరు ఒకటికి రెండు సార్లు అన్ని ధ్రువపత్రాలను సరి చూసుకుంటే అవస్థల పాలవ్వాల్సిన పనిలేదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చెబుతోంది.

Updated : 07 Jan 2023 08:12 IST

అన్ని పత్రాలు సరిచూసుకోవాలి
కొనుగోలుదారులకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సూచనలు
ఈనాడు - హైదరాబాద్‌

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. జీవితంలో ఈ రెండూ అంత ముఖ్యమైనవి. కలల సౌధాలు నిర్మించుకోవడానికి ఇంటి స్థలం కొన్నప్పుడు కాని.. అపార్టుమెంటులో ఫ్లాట్‌ సొంతం చేసుకోవాలనుకున్నా.. మీరు ఒకటికి రెండు సార్లు అన్ని ధ్రువపత్రాలను సరి చూసుకుంటే అవస్థల పాలవ్వాల్సిన పనిలేదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చెబుతోంది. అంతేకాదు ప్రతిసారి అందరి మదిలో మెదిలే అనేక ప్రశ్నలకు తెలంగాణ సబ్‌ రిజిస్ట్రార్ల సంఘం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.

ఇవిగో మార్గదర్శకాలు

* ఇంటి స్థలం, అపార్టుమెంట్లో ఫ్లాట్‌ విక్రయించేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చెప్పే మాటలపై నమ్మకం ఉంచుతూనే.. ప్రతి అంశానికి సంబంధించిన అసలు ధ్రువపత్రాలు ఉన్నాయో లేవో సరి చూసుకోండి.
* టైటిల్‌ డీడ్స్‌/ఆస్తి యాజమాన్య పత్రాలను సంబంధిత ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన ధ్రువీకరణ కాపీలతో సరి చూసుకోవాలి.
* కొనదల్చిన భూమి రిజిస్ట్రేషన్‌ చట్టం 1908 సెక్షన్‌ 22(ఎ), ప్రభుత్వం చేసిన ఇతర చట్టాల కిందకు, నిషేధిత ఆస్తుల కిందకు రాదని నిర్ధారించుకోవాలి.
* లే అవుట్‌ నిర్మాణానికి నగరపాలక, పురపాలక/డీటీసీపీ/అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సంస్థల ఆమోదం ఉందో లేదో చూసుకోవాలి.
* కొనదల్చిన ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ అయిన అమ్మకపు దస్తావేజు లేకుండా, నోటరీ అయిన డాక్యుమెంట్లపై ఆధారపడవద్దు.
* వాస్తవ యజమాని మొదలుకొని ప్రస్తుత విక్రయదారు వరకు లింకు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.
* అన్ని లింకు డాక్యుమెంట్లులోనూ ఆస్తి సర్వే నంబరు/ఆవరణల సంఖ్య, సరిహద్దుల పరంగా ఒకేలా ఉందని నిర్ధారించుకోవాలి.

ప్రత్యక్షంగా చూశాకనే...

* వ్యక్తిగతంగా ఆస్తిని చూడకుండా.. ఆ ప్రాంతంలో దాని ఉనికి తనిఖీ చేయకుండా, స్థలాన్ని అభివృద్ధి చేస్తున్న సంస్థ గురించి క్షుణ్నంగా తెలుసుకోకుండా అడుగు వేయవద్దు. ఆ సంస్థ గురించి, వ్యక్తి గురించి తెలియకుండా కొనుగోలు చేయవద్దు.
* ఆస్తి కొనుగోలు సందర్భంగా దానిపై హక్కు గల చట్టబద్ధ వారసులు/ప్రతినిధులు అంతా సమ్మతించి ముందుకు వచ్చిందీ లేనిదీ నిర్ధారించుకోవాలి.
* ముందుగా కుదుర్చుకున్న విక్రయ ఒప్పందాలు / తాకట్టు (మార్టగేజ్‌)లాంటివి లేవనే అంశాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం జారీ చేసిన ఎన్‌కంబ్రెన్స్‌ సర్టిఫికేట్‌(ఈసీ)ద్వారా నిర్ధారించుకోవాలి.
* చిరునామా ధ్రువీకరణ పత్రంతో పాటు కొనుగోలుదారులు, విక్రయదారుల ఫొటోలు, వేలిముద్రలు డాక్యుమెంట్‌కు అతికించినట్టుగా నిర్ధారించుకోవాలి. సాక్షుల ధ్రువీకరణ పత్రం, ఐడీ కార్డులు కూడా చూడాలి.
* జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ వంటి డాక్యుమెంట్లు సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద రిజస్టర్‌ అయ్యాయా? వాటి చెల్లుబాటు ఎలాంటిది అనే అంశాలు చూసుకోవాలి.
* అనుమతి పొందిన ప్లాన్‌ ప్రకారం సైట్‌ ప్లాన్‌/లోకేషన్‌ హద్దులు ఉన్నాయా అని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి.

కొన్న తర్వాత..

* హద్దు రాళ్లను పాతడం ద్వారా ఆస్తి భౌతికంగా మీ స్వాధీనంలో ఉండేటట్లు చూసుకోండి.
* ఆస్తిని కొని వదిలేయడం కాకుండా.. క్రమం తప్పకుండా సందర్శిస్తూ, దాని ఉనికి హద్దులను సరి చూసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని