జీఎస్‌టీని 3 శాతానికి తగ్గించాలి

అపార్ట్‌మెంట్లపై విధిస్తున్న 5 శాతం జీఎస్‌టీని తగ్గించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను క్రెడాయ్‌ తెలంగాణ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.

Published : 14 Jan 2023 01:07 IST

కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసిన క్రెడాయ్‌ తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌: అపార్ట్‌మెంట్లపై విధిస్తున్న 5 శాతం జీఎస్‌టీని తగ్గించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను క్రెడాయ్‌ తెలంగాణ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. జీఎస్‌టీతో కొనుగోలుదారులకు సొంతిల్లు భారంగా మారుతోందని అంకెలతో సహా వివరించింది. 3 శాతానికి తగ్గించాలని కోరింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తొలగించడంతో బిల్డర్లకు సైతం భారంగా మారిందని.. ఈ వ్యయాన్ని అంతిమంగా కొనుగోలుదారులకు బదలాయించాల్సి వస్తోందని తెలిపింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఇస్తూ 8 శాతం జీఎస్‌టీ చెల్లించేందుకు బిల్డర్లకు ఆప్షన్‌ ఇవ్వాలని ఆర్థిక మంత్రితో పాటూ జీఎస్‌టీ కౌన్సిల్‌ను కలిసి వినపతిపత్రం ఇచ్చామని క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ సీహెచ్‌ రాంచంద్రారెడ్డి తెలిపారు.

* రూ.కోటి విలువైన ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే కన్‌స్ట్రక్షన్‌ సర్వీసు కింద 5 శాతం జీఎస్‌టీ రూ.5 లక్షలు అవుతోంది.

* నిర్మాణ సామగ్రి కొనుగోళ్లకు ఒక్కో ఫ్లాట్‌పై రూ.50లక్షల వరకు వ్యయం అవుతోంది. వీటిపై 18 శాతం వరకు ఉన్న జీఎస్‌టీతో రూ.7.2 లక్షలు అవుతుంది. బిల్డర్‌ చెల్లించినా.. అంతిమంగా ఈ వ్యయాలను భరించేది కొనుగోలుదారుడే.

* రెండూ కలిపితే జీఎస్‌టీకి చెల్లించిన మొత్తం రూ.12.2 లక్షలు అవుతుంది. అంటే 12.2 శాతం జీఎస్‌టీ చెల్లిస్తున్నట్లు.

* భూ యాజమాని కూడా జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది అదనం.

స్పష్టత ఇవ్వాలి

2019 తర్వాత జీఎస్‌టీలో చాలా మార్పులు చేశారు. భూ యాజమాని చెల్లించాల్సిన జీఎస్‌టీని సైతం డెవలపర్‌ చెల్లించాలని అధికారులు అంటున్నారు. ఈ విధానం కొంత గందరగోళంగా ఉంది. దీనిపైన కూడా స్పష్టత ఇవ్వాలని మంత్రిని క్రెడాయ్‌ తెలంగాణ కార్యవర్గం కోరింది.

* ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు, తర్వాత జీఎస్‌టీలో డెవలపర్‌ వాటా ఎంత? సంయుక్తంగా ప్రాజెక్ట్‌ను చేపట్టినప్పుడు భూ యాజమాని వాటా ఎంత? డెవలపర్‌ వాటా ఎంతో స్పష్టం చేయాలి. దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని