ఇంటి కోసం ముందునుంచి ఎలా సన్నద్ధం కావాలంటే?
కలల గృహాన్ని కొందరు చిన్న వయసులోనే సొంతం చేసుకుంటుంటే... మరికొందరు పదవీ విరమణ వయసునాటికి గానీ సమకూర్చుకోలేరు.
కలల గృహాన్ని కొందరు చిన్న వయసులోనే సొంతం చేసుకుంటుంటే... మరికొందరు పదవీ విరమణ వయసునాటికి గానీ సమకూర్చుకోలేరు. ఇంకొందరైతే తీరని కలగానే భావిస్తున్నారు. అలా అనుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడం ఒక కారణమైతే... ఇంటి కోసం సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే అధికశాతం మంది గృహప్రవేశానికి దూరంగా ఉంటున్నారని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్లు అంటున్నారు. పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తే సొంతింట్లో అడుగుపెట్టడం సాధ్యమేనని సూచిస్తున్నారు.
ఉపాధిరీత్యా నగరాలు, పట్టణాలకు వలస వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు సొంతింటి కోసం అన్వేషిస్తున్నారు. అధిక ఆదాయం కలిగిన వాళ్లే తప్ప అల్పాదాయ వర్గాలు కొనగలిగే స్థాయిలో ఇళ్ల ధరలు లేవనేది వాస్తవమే.. అయినా హైదరాబాద్ లాంటి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అన్ని వర్గాలకు తగ్గ గృహ నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని అందుకోవాలంటే..
* కాలం కలిసి వస్తే ఇల్లు కొంటాను అనే ధోరణిలోనే మనలో చాలామంది ఉంటారు. వీరంతా సమయం కోసం ఎదురుచూస్తుంటారు. తీరా వచ్చినప్పుడు చేతిలో సరైన మొత్తం లేక అవకాశాన్ని జారవిడుచుకుంటుంటారు. ఈ పొరపాటు మీరూ చేయకూడదంటే సంపాదన ఆరంభించిన తొలినాళ్ల నుంచే ఇంటి కోసం మదుపు ప్రారంభించాలి.
* ప్రారంభంలో కుటుంబ వ్యయం పరిమితంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తం పొదుపు చేసేందుకు వీలవుతుంది. అందుకే ముందస్తు ప్రణాళిక ఉండాలనేది. ఎన్నేళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రతి నెలా సంపాదనలో కొంత మొత్తం మదుపు చేయాలి. నెలకు రూ.10వేల నుంచి ఎంత వీలైతే అంత మొత్తం మదుపు చేయాలి. ఇక్కడ కావాల్సిన మొత్తం సమకూరే వరకు మధ్యలో సొమ్ము తీయకుండా ఉండే వాటిలో జమ చేయాలి. గృహరుణం తీసుకుంటే నెలనెలా ఎలా ఈఎంఐ చెల్లిస్తారో అలా ఇంటి కోసం మొదటి నుంచి పొదుపు ఈఎంఐ చెల్లించండి. డౌన్‌పేమెంట్‌కు అవసరమయ్యే 20 శాతం నిధులను సమకూర్చుకుంటే మిగతా మొత్తాన్ని గృహ రుణం తీసుకోవచ్చు.
* పొదుపు చేసిన మొత్తాన్ని అధిక రాబడి ఇచ్చే పెట్టుబడి సాధనాల్లో మదుపు చేయాలి. ఉద్యోగులైతే వీపీఎఫ్‌లో మదుపు చేసుకోవచ్చు. బంగారం కొనుగోలు మొదలు.. నమ్మకమైన సంస్థలో చిట్టీ వేయడం.. మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయడం.. బ్యాంకులు, తపాలా ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అసలుకు హామీ ఉండి అధిక రాబడి వచ్చే వాటిలో మదుపు చేయవచ్చు. చిన్నమొత్తంతో మొదలు పెట్టినా వేతనం పెరిగే కొద్దీ పెంచుతూ వెళ్లాలి. ఇదే పెద్ద మొత్తంగా ఇంటి కొనుగోలుకు అక్కరకు వస్తుంది. ఎక్కువ మొత్తం సమకూరితే దాన్ని నిర్మాణ సంస్థకు చెల్లించి ఆఖర్లో రుణానికి వెళ్లవచ్చు. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది.
* మీ దగ్గర కొంత సొమ్ము జమైతే.. ఇల్లు అత్యవసరమని భావించకపోతే తొలుత స్థలం కొనుగోలును పరిశీలించవచ్చు. మీ దగ్గర ఉన్న డబ్బులకు ఎక్కడ స్థలం వస్తుందో అక్కడ కొనుగోలు చేయవచ్చు. సిటీకి దగ్గరలో ఉంటే భవిష్యత్తులో అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. నివాసం ఉండలేని ప్రదేశమైతే విక్రయించి ఆ సొమ్ముతో మరోచోట ఇల్లు కొనుగోలు చేయవచ్చు. ఇల్లు కట్టుకునేందుకు సొమ్ములు లేకపోతే సగం స్థలం విక్రయించి మిగతా స్థలంలో కట్టుకోవచ్చు. పూర్తిగా విక్రయించి కాస్త దూరంగా తక్కువ ధరలో స్థలం కొని కట్టుకోవచ్చు. చాలామంది ఈ పద్ధతులను అనుసరిస్తున్నారు. వారిని మీరూ అనుకరించవచ్చు.
* ఇంటి కోసం మీ బడ్జెట్ ఎంత అనేది ముందుగా అంచనాకు రావాలి. ఆ ధరల్లోనే ఇల్లు కొనే ప్రయత్నం చేయాలి. చాలామంది తమ బడ్జెట్‌ను మించిన ఇళ్లను చూస్తుంటారు. ధర ఎక్కువ కాబట్టి సహజంగానే నచ్చుతాయి. కానీ అంత మొత్తం వెచ్చించే స్థోమత లేక ఆగిపోతుంటారు. అదే తమ బడ్జెట్‌లో నిర్మించే ప్రాజెక్ట్‌లలో చూస్తే ఒకటి కాకపోతే మరొకటి నచ్చుతుంది. ఎక్కువ అప్పులు చేయాల్సిన పనిలేకుండా ఇల్లు సొంతం అవుతుంది. ఈఎంఐ కూడా భారం కాదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!