గృహ రుణంతో ఇల్లు కొనుగోలు.. ఆదాయపు పన్ను ప్రయోజనాలు

సొంతిల్లు కొనడమంటే చాలామందికి ఒక పెద్ద కల నెరవేరినట్లే. అందుకు గృహరుణం ఎక్కువ మందికి ఊతం ఇస్తోంది.

Published : 18 Feb 2023 01:12 IST

సొంతిల్లు కొనడమంటే చాలామందికి ఒక పెద్ద కల నెరవేరినట్లే. అందుకు గృహరుణం ఎక్కువ మందికి ఊతం ఇస్తోంది. మీరు కొనే ఇంటి విలువపై గరిష్ఠంగా 85 శాతం వరకు గృహ రుణం పొందవచ్చు. గతంతో పోలిస్తే ఇంటి రుణాలు పొందడం సులభతరమైంది. రోజుల వ్యవధిలోనే బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు రుణాలు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం గృహరుణ వడ్డీరేట్లు 8.65 శాతం నుంచి 9.25 శాతం వరకు ఉన్నాయి. సిబిల్‌ స్కోరును బట్టి వడ్డీరేట్లను వసూలు చేస్తున్నాయి. ఇంటి రుణంతో ఆదాయ పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. మనకు అనుకూలమైన బ్యాంకు, ఆర్థిక సంస్థ నుంచి ఈ రుణాన్ని తీసుకోవచ్చు.

క్రెడిట్‌ స్కోరు ఆధారంగా

బ్యాంకులు/గృహరుణ సంస్థలు రుణగ్రహీతకు వడ్డీ రేటును నిర్ణయించడంలో ఎన్నో అంశాలను పరిశీలిస్తుంటాయి. ముఖ్యంగా రుణచరిత్ర, క్రెడిట్‌ స్కోరు వంటివి చూస్తాయి. ప్రస్తుతం బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రెపోకు అనుసంధానం చేశాయి. దీంతోపాటు రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరు ఆధారంగా వడ్డీని నిర్ణయిస్తున్నాయి. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉంటే.. వడ్డీ రేటు పెరిగే ఆస్కారం ఉంది. క్రెడిట్‌ స్కోరు 800పైన ఉంటే వడ్డీరేటు తక్కువగా ఉంటుంది.
* తక్కువ ఈఎంఐ ఉండేలా రుణ వ్యవధిని ఎంచుకోవడం, మీ స్తోమతకు అనుగుణంగానే రుణాన్ని తీసుకోవడం ఎప్పుడూ సురక్షితం.
* గృహ రుణం కోరుకున్నంతగా రావాలంటే అప్పటివరకు ఉన్న ఇతర రుణాలను తీర్చేయాలి. కొత్త రుణాలేవీ తీసుకోకూడదు. అప్పుడు ఎక్కువ రుణం మంజూరవుతుంది.

ముందస్తు చెల్లింపుల కోసం..

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి విలువపై 80 శాతం వరకే గృహరుణాలను అందజేస్తాయి. గరిష్ఠంగా 85 శాతం వరకే ఇచ్చే అవకాశం ఉంది. కోటి రూపాయలు ఉన్న స్థిరాస్తులకైతే 75 శాతమే ఇస్తున్నాయి. కాబట్టి,  ఇంటికోసం ముందు నుంచే మిగతా మొత్తాన్ని సమకూర్చుకోవాలి.

ఆదాయ పన్ను ప్రయోజనాలు

ఇంటి కోసం తీసుకునే గృహరుణంతో ఆదాయ పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.
* గృహరుణ అసలు చెల్లింపులపై ఆదాయ పన్ను సెక్షన్‌ 80సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
* వడ్డీ చెల్లింపుల కింద సెక్షన్‌ 24 ప్రకారం రూ.2లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది.

అత్యవసరంలో గృహరుణం టాపప్‌తో..

గృహరుణంపై టాపప్‌ తీసుకునే వీలుంది. కొత్తగా మరో ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే సులువుగా తీసుకోవచ్చు.

రుణం తీసుకునే మార్గం ఇదీ 

* టాపప్‌ రుణం తీసుకొని, దాన్ని ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు వాడినప్పుడు మాత్రమే ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి టాపప్‌ రుణం తీసుకున్నప్పుడు ఆ మొత్తాన్ని ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి ఉపయోగించినట్లు రుజువు చేయాలి. దీనికి సంబంధించిన రశీదులు, ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
* గృహరుణ వ్యవధి 20 ఏళ్లుంటే.. టాపప్‌ రుణానికీ అదే 20 ఏళ్ల వ్యవధి ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలంలో అప్పు తీర్చే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకు నిబంధనలను బట్టి, ఇది ఆధారపడి ఉంటుంది.
* మీకు అప్పుడప్పుడూ డబ్బు అవసరం అనుకుంటే.. ఒకేసారి రుణం తీసుకోవడం వల్ల ఫలితం ఉండదు. టాపప్‌లోనే ఉండే ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. కొన్ని బ్యాంకులు గృహరుణం టాపప్‌పైనా ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. దీనికి వర్తించే వడ్డీ గృహరుణంకన్నా కాస్త అధికంగానూ, వ్యక్తిగత రుణం కన్నా తక్కువగానూ ఉంటుంది.
* రుణగ్రహీతకు సంబంధించిన అన్ని వివరాలూ బ్యాంకు దగ్గర ఉంటాయి. రుణ వాయిదాలను ఎలా చెల్లిస్తున్నారనేది తెలుస్తుంది. రుణగ్రహీత వాయిదాలన్నీ సరిగ్గా చెల్లించిన వివరాలు, ఆదాయం ధ్రువీకరణ, ఇతర కొన్ని పత్రాలు అందిస్తే చాలు. టాపప్‌ రుణం ఎంతివ్వాలన్నది ఆదాయం, గృహరుణం మొత్తం, తనఖా పెట్టిన ఆస్తి మార్కెట్‌ విలువ తదితరాలను బట్టి ఆధారపడి ఉంటుంది.
* సాధారణంగా ఈ టాపప్‌ రుణాలపై వడ్డీ రేట్లు గృహరుణం వడ్డీకి కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ వడ్డీకి లభిస్తున్న రుణాలుగా వీటిని చెప్పుకోవచ్చు.

బదిలీ చేసుకోవచ్చు..

గృహరుణాన్ని ఒక సంస్థ నుంచి తక్కువ వడ్డీకి ఇచ్చే మరో దానికి బదిలీ చేసుకోవచ్చు.  రుణాన్ని బదిలీ చేసుకునేప్పుడు పరిశీలన, నిర్వహణ రుసుముల్లాంటివి ఉంటాయి. కొత్త రుణం మాదిరిగానే పత్రాలు సమర్పించాలి. డాక్యుమెంటేషన్‌ ఛార్జీలు, ఇతర ఖర్చులూ ఉంటాయి. వీటన్నింటినీ లెక్కించి చూసుకోవాలి. రుణాన్ని బదిలీ చేసుకున్నప్పుడు వచ్చిన ప్రయోజనాలకన్నా ఇవి అధికంగా ఉంటే మీ నిర్ణయం మానుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని