టీఎస్‌-బీపాస్‌తో అనుమతులు సులభతరం

నగరం, పట్టణాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు, పూర్తి పారదర్శకంగా, స్వీయ ధృవీకరణ ద్వారా నిర్మాణ అనుమతులను జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌-బీపాస్‌ విధానం తీసుకొచ్చింది.

Published : 18 Feb 2023 01:17 IST

నగరం, పట్టణాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు, పూర్తి పారదర్శకంగా, స్వీయ ధృవీకరణ ద్వారా నిర్మాణ అనుమతులను జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌-బీపాస్‌ విధానం తీసుకొచ్చింది.

వన నిర్మాణ అనుమతులు ఇదివరకు మాన్యువల్‌గా ఇచ్చే విధానం అమల్లో ఉండేది.  ఆ తర్వాత ఆన్‌లైన్‌లో డీపీఎంఎస్‌ విధానాన్ని తీసుకొచ్చారు. అనుమతుల జారీ కొంత సులభతరం అయినా డీపీఎంఎస్‌కు చట్టబద్ధత లేకపోవడం,  పారదర్శకత లోపించడం, అధికారుల విచక్షణపై ఆధారపడి ఉండటం వంటి లోపాలను సర్కారు గుర్తించింది. సులువుగా అనుమతులు పొందేలా తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతుల ఆమోదం, స్వీయధృవీకరణ విధానం(టీఎస్‌- బీపాస్‌) చట్టం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలి.. లేదంటే నిరాకరించాలి. లేదంటే డీమ్డ్‌ అప్రూవల్‌ అనుమతి వచ్చినట్లుగా భావించి నిర్మాణం చేసుకోవచ్చు.

ఇలా పనిచేస్తుంది..

* 75 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన స్థలంలో గ్రౌండ్‌+1 వరకు 7 మీటర్ల  ఎత్తు వరకు నివాస భవనానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. నమోదు కోసం రూ.1 చెల్లించి నిర్మాణ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు.

* 76 చదరపు గజాల నుంచి 239.20 చ.గజాలు(200 చదరపు మీటర్లు) వరకు విస్తీర్ణం కలిగిన స్థలంలో జి+1 (7మీటర్ల ఎత్తు వరకు) నివాస భవనాలకు తక్షణం అనుమతి ఇస్తారు.

*  239.21 చదరపు గజాల నుంచి 598 చదరపు గజాలు(500 చ.మీ) వరకు కలిగిన ప్లాట్‌లో జీ+2 (10 మీటర్ల ఎత్తు వరకు) గృహ నిర్మాణానికి స్వీయ ధృవీకరణ ఆధారంగా తక్షణ అనుమతి ఇస్తారు.

* 598 చదరపు గజాల(500 చ.మీ) కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన స్థలంలో జీ+2 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మించే గృహ నిర్మాణాలు, నివాసేతర భవనాలకు ఏకగవాక్ష విధానం ద్వారా టీఎస్‌బీపాస్‌ నుంచి అనుమతులు పొందవచ్చు.

* టీఎస్‌-బీపాస్‌లో ఒకే దరఖాస్తుతో నిరభ్యంతర ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. ఇతర శాఖలను సంప్రదించాల్సి అవసరం లేదని చట్టం చెబుతోంది.

*  భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల దరఖాస్తులను పరిశీలించి 21 రోజుల లోపల అనుమతులు ఇవ్వాలి. పూర్తి పత్రాలు సమర్పించకపోతే తెలియజేయాలి. నిబంధనల మేరకు లేకపోతే తిరస్కరించాలి. ఇవన్నీ కూడా 21రోజుల్లో చేయాలి. ఏమీ చెప్పకుండా ఫైల్‌ అధికారుల వద్ద ఉంటే 22వ రోజున ఆన్‌లైన్‌లో అనుమతి పత్రం ఆటోమేటిక్‌గా దరఖాస్తుదారు తీసుకోవచ్చు.

*  తాత్కాలిక లేఅవుట్‌ ప్లాన్‌ అనుమతిని స్వీయ ధృవీకరణ ఆధారంగా టీఎస్‌-బీపాస్‌లో 21 రోజుల్లో ఇస్తారు. లేఅవుట్‌ నిబంధనల మేరకు పూర్తి చేసి ఆధార పత్రాలన్నీ సమర్పిస్తే తుది అనుమతి జారీ చేస్తారు.

లేఅవుట్‌ తుది అనుమతి జారీ చేసిన అనంతరం 21 రోజుల కాలవ్యవధిలో తనఖా పెట్టిన ఫ్లాట్‌లను విడుదల చేస్తారు.

నిబంధనలు తప్పితే...

జీ+2 అంతస్తులకు అనుమతి తీసుకుని అదనంగా మరో అంతస్తు వేస్తే ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేస్తామని అధికారులు అంటున్నారు.

దరఖాస్తుదారు సమర్పించిన ఒప్పంద పత్రం ప్రకారం అనుమతించిన ప్లాన్‌ను అతిక్రమించి నిర్మించే కట్టడాలను కూల్చే అధికారం అధికారులకు ఉంటుంది.

భూమి అభివృద్ధికి అవసరమైన అనుమతులు తీసుకోకుండా అనధికారికంగా అభివృద్ధి చేసి ఉపయోగించే డెవలపర్‌పై  రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ధారించిన భూవిలువలో పాతికశాతం అపరాధ రుసుం విధిస్తారని అధికారులు చెబుతున్నారు.

హెచ్‌ఎండీఏ పరిధిలో అనుమతులు ఇలా...

హెచ్‌ఎండీఏ పరిధిలోని పంచాయతీలకు గరిష్ఠంగా వెయ్యి చదరపు మీటర్ల స్థలంలో 10 మీటర్ల ఎత్తు (స్టిల్ట్‌ ప్లస్‌ 3 అంతస్తుల)వరకు అనుమతులు ఇచ్చే అధికారం ఉంది.

మున్సిపాలిటీల్లో గరిష్ఠంగా వెయ్యి చదరపు మీటర్ల స్థలంలో స్టిల్ట్‌ ప్లస్‌ 4 అంతస్తులు 12 మీటర్ల ఎత్తు వరకు అనుమతులు జారీ చేయవచ్చు.

కార్పొరేషన్లు వెయ్యి చదరపు మీటర్ల వరకు స్టిల్ట్‌ ప్లస్‌ 5 అంతస్తులు 15 మీటర్ల ఎత్తు వరకు అనుమతులు ఇస్తాయి.

అంతకుమించి దాటితే హెచ్‌ఎండీఏ అనుమతులు జారీ చేస్తుంది.

రోడ్లు, సెట్బ్యాక్‌లు ఇలా...

* 8 అంతస్తుల భవనమైతే 40 అడుగుల అప్రోచ్‌ రహదారి.. 8 మీటర్ల వెడల్పు సెట్‌బ్యాక్‌లు ఉండాలి.

10 అంతస్తులు నిర్మాణమైతే 60 అడుగుల అప్రోచ్‌ రహదారి.. 10 మీటర్ల వెడల్పు సెట్‌ బ్యాక్‌లు తప్పనిసరి.

12 అంతస్తులైతే 80 అడుగుల అప్రోచ్‌ రోడ్డు...13 మీటర్ల వెడల్పుతో సెట్‌ బ్యాక్‌లు ఉండాలి.

ఆపైన అంతస్తులైతే 100 అడుగుల అప్రోచ్‌ రోడ్డు...20 మీటర్ల వెడల్పుతో సెట్‌ బ్యాక్‌లు తప్పనిసరి.

సెట్‌బ్యాక్‌లు ఇతర నిర్మాణంలో 10 శాతం ఉల్లంఘనలకు అనుమతి ఇస్తారు. అయితే నిర్ణీత ఫీజులు చెల్లించాలి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని