Real Estate: చలో చేవెళ్ల

ఔటర్‌ నుంచి అరగంట ప్రయాణం.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఐటీ కారిడార్‌కు చేరువ..  విస్తరిస్తున్న అంతర్రాష్ట్ర రహదారితో అనుసంధానం.. ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్‌ రోడ్డు వస్తుండటం.. డాటా కేంద్రాల ఏర్పాటు.. ఆహ్లాదకర పరిసరాలు.. ప్రముఖుల వ్యవసాయ క్షేత్రాలుండటం.. పరిశ్రమల స్థాపనతో చేవెళ్ల వైపు హైదరాబాద్‌ రియాల్టీ  వడివడిగా పరుగులు తీస్తోంది.

Updated : 28 Feb 2023 11:19 IST

రియల్‌ సమీక్ష
చేవెళ్ల, న్యూస్‌టుడే

ఔటర్‌ నుంచి అరగంట ప్రయాణం.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఐటీ కారిడార్‌కు చేరువ..  విస్తరిస్తున్న అంతర్రాష్ట్ర రహదారితో అనుసంధానం.. ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్‌ రోడ్డు వస్తుండటం.. డాటా కేంద్రాల ఏర్పాటు.. ఆహ్లాదకర పరిసరాలు.. ప్రముఖుల వ్యవసాయ క్షేత్రాలుండటం.. పరిశ్రమల స్థాపనతో చేవెళ్ల వైపు హైదరాబాద్‌ రియాల్టీ  వడివడిగా పరుగులు తీస్తోంది. కొనుగోలుదారులు చలో చేవెళ్ల అంటున్నారు.

జంట నగరాలతో పాటు శివారు మండలాలకే పరిమితమైన స్థిరాస్తి వ్యాపారం ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారితో సిటీకి చేరువలో ఉన్న పట్టణాలవైపు విస్తరిస్తోంది. అవుటర్‌ నుంచి 29 కి.మీ. దూరంలో ఉన్న చేవెళ్ల వైపు మళ్లింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీజాపూర్‌ రహదారి విస్తరణ పనులు ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పోలీస్‌ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిని నాలుగేళ్ల క్రితమే కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించింది. 2018లోనే ఈ రోడ్డును నాలుగు వరసలుగా మార్చేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడంతో అవసరమైన భూ సేకరణను అధికార యంత్రాంగం దాదాపు పూర్తి చేసింది. మరో నెల రోజుల్లో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. రెండేళ్లలో రహదారి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో  భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు.

బడా కంపెనీల దృష్టి

నగరానికి ఆనుకుని ఉన్న శంకర్‌పల్లి మండలంలో విల్లాల సంస్కృతి పెరిగింది. అనేక మంది ప్రముఖులు వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. మొయినాబాద్‌ మండలంలో ఇప్పటికే వందల సంఖ్యలో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. అక్కడ ధరలు ఆకాశాన్నంటడంతో పక్కనే ఉన్న చేవెళ్ల, షాబాద్‌ మండలాల వైపు వ్యాపారులు, కొనుగోలుదారుల దృష్టి మళ్లింది. ఆయా మండలాల్లోని భూముల విలువతో పోలిస్తే ఇక్కడ సగం, అంతకంటే తక్కువ ధరకు భూముల లభ్యత ఉండటంతో పెట్టుబడులకు అనుకూలంగా మారింది. ఇప్పటికే చేవెళ్ల మండలంలోని అంతారంలో ఓ ప్రైవేటు సంస్థ పెద్ద ఎత్తున విల్లాలు నిర్మించింది. కందవాడ, చేవెళ్ల, దామరగిద్ద గ్రామాలు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో రెసిడెన్షియల్‌ జోన్‌లుగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో విల్లాల నిర్మాణానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పది వరకు నిర్మాణ సంస్థలు భూములు సేకరించి పెట్టుకున్నాయి.

160 ఎకరాల్లో ప్రభుత్వ వెంచర్‌

షాబాద్‌ మండలంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో ప్రభుత్వం 160 ఎకరాల్లో భారీ వెంచర్‌ ఏర్పాటు చేసి ప్లాట్‌లు విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కుమ్మరిగూడ, షాబాద్‌ పట్టణ కేంద్రాలకు మధ్య ఉన్న భూములను రైతుల నుంచి సేకరించారు. త్వరలో అభివృద్ధి పనులు చేపట్టి ప్లాట్‌లను విక్రయించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

వ్యవసాయ భూములకు డిమాండ్‌

పంచాయతీ అనుమతులతో వెంచర్‌లు ఏర్పాటు చేసి ప్లాట్‌లు విక్రయించకుండా ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు వ్యవసాయ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ దగ్గర ఉన్న తక్కువ బడ్జెట్‌తో 5-10 గుంటల చొప్పున భూములను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని నెలలుగా ప్లాట్‌ల క్రయ విక్రయాల్లో స్తబ్ధత నెలకొనగా తక్కువ విస్తీర్ణంలో భూముల కొనుగోలుకు ఆసక్తి పెరిగింది. చేవెళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో గతంలో కనీసం 150-200 ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌లు జరిగేవి. ప్రస్తుతం 40-50  జరుగుతున్నాయి. ఇక ధరణి ద్వారా నిత్యం 25-30 రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం 5 నుంచి 10 గుంటల భూముల విక్రయాలకు సంబంధించినవే ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఐదారుగురు కలిసి ఎకరం భూమి కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు.

ధరల్లో పెరుగుదల

చేవెళ్ల, షాబాద్‌ మండలాల్లో ఈ మధ్య కాలంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. గతేడాది ఎకరా రూ.కోటిలోపు ఉన్న భూములు ఇప్పుడు రూ.కోటిన్నరపైనే చెపుతున్నారు. రోడ్ల పక్కన ఉన్న భూములకు డిమాండ్‌ ఉంది. ప్రధాన రహదారుల పక్కన ఉండే పొలాలు ఎకరా రూ.2.50కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతున్నాయి. చేవెళ్ల మండలంలో ఓ ప్రముఖ సంస్థ విల్లాల నిర్మాణానికి పూనుకుంది. ఒక్కో విల్లా రూ.1.60కోట్ల ధర చెబుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో నిర్మిస్తున్న విల్లాకు రూ.9 కోట్లు చెబుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి.

* ప్రధానంగా చేవెళ్ల పట్టణంతో పాటు కందవాడ, ఆలూరు, గుండాల, షాబాద్‌ మండలాల్లో నాగర్‌గూడ, చందన్‌వెళ్లి, హైతాబాద్‌ ప్రాంతాల్లో భూములకు డిమాండ్‌ ఏర్పడింది. గుంటల్లో భూమిని కొందరు గజాల చొప్పున విక్రయిస్తున్నారు. ఎకరా భూమి కొనేంత స్థోమత లేని వారు 5-10 గుంటలు కొనుగోలు చేస్తున్నారు.

* హెచ్‌ఎండీఏ అనుమతులతో చేసిన వెంచర్‌లలో ప్లాట్‌లకు డిమాండ్‌ ఉంది. వీటిని కొనుగోలు చేసేందుకు  ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ గజం సగటున రూ.13వేల పైనే ఉంటోంది. గతంలో పంచాయతీ అనుమతులతో చేసిన లే అవుట్‌లలో ప్లాట్‌లు సైతం గజం రూ.10వేల పైనే ధర పలుకుతున్నాయి. నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో  అనుమతులున్న వెంచర్‌లలోనే ప్లాట్‌లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

* ప్రభుత్వం భూసేకరణ చేసి ప్లాట్‌లు చేసి విక్రయాలు చేపట్టాలని ఆలోచనలో ఉంది. 50 ఎకరాలు ఆపైన భూముల లభ్యత ఉండే వాటిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే షాబాద్‌ మండలంలోని కుమ్మరిగూడ, శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ప్రాంతాల్లో లేఅవుట్‌లు చేసేందుకు రైతుల నుంచి భూములు సేకరించింది. పరిహారానికి బదులు ఎకరా భూమి ఇచ్చే రైతులకు 650 నుంచి 750 గజాల అభివృద్ధి చేసిన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధమైంది. ఇందుకు రైతులు సమ్మతం తెలపడంతో భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు.

పెద్ద ఎత్తున పరిశ్రమలు

చేవెళ్ల పట్టణ కేంద్రానికి 10-12 కి.మీ దూరంలో షాబాద్‌ మండలంలోని చందన్‌వెళ్లిలో సుమారు 1650 ఎకరాలను ప్రభుత్వం పలు కంపెనీలకు కేటాయించింది. ఇప్పటికే పదికి పైగా కంపెనీలు ప్రారంభమయ్యాయి. సీతారాంపూర్‌లో 1100 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం ఆ భూములను ప్రతిష్ఠాత్మక కంపెనీలకు కేటాయించింది. రాబోయే నాలుగైదేళ్లలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. సుమారు 50వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల, షాబాద్‌ మండలాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని