ఎస్టీపీలకు ప్రత్యేకంగా విద్యుత్తు టారిఫ్?
నగరంలో వంద ఫ్లాట్లు, ఇళ్లు ఉండే అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మురుగు శుద్ధి కేంద్రం(ఎస్టీపీ) తప్పనిసరి. ఇటీవల అపార్ట్‌మెంట్లలో వంద ఫ్లాట్లు అనేది సహజంగా మారింది.
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బిల్డర్లు
కరెంట్ ఛార్జీల భారంతో హౌసింగ్ ప్రాజెక్టుల్లో వినియోగానికి దూరం
ఈనాడు, హైదరాబాద్
నగరంలో వంద ఫ్లాట్లు, ఇళ్లు ఉండే అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మురుగు శుద్ధి కేంద్రం(ఎస్టీపీ) తప్పనిసరి. ఇటీవల అపార్ట్‌మెంట్లలో వంద ఫ్లాట్లు అనేది సహజంగా మారింది. అయినా చాలా వాటిలో వీటి ఏర్పాట్లే ఉండటం లేదు. ఐదొందల నుంచి వెయ్యి, రెండువేలు, మూడువేల యూనిట్లు నిర్మిస్తున్న చోట మాత్రం బిల్డర్లు అనివార్యంగా ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక అసోసియేషన్‌కు అప్పగిస్తున్నారు. వీరు మొదట కొన్నాళ్ల పాటు సక్రమంగానే నిర్వహిస్తున్నా.. ఆర్థిక భారంతో ఆ తర్వాత ఉపయోగించడం లేదు. కరెంట్ ఛార్జీల భారం అధికంగా ఉందని.. బిల్లు రూ.లక్షల్లో వస్తోందని అసోసియేషన్లు అంటున్నాయని బిల్డర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎస్టీపీల కోసం తక్కువ ఛార్జీలు ఉండేలా ప్రత్యేకంగా విద్యుత్తు టారిఫ్ ఉండాలని అభ్యర్థించారు. జులై తర్వాత వందశాతం మురుగు శుద్ధి చేస్తున్న నగరంగా మారాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి రోజు 2000 మిలియన్ లీటర్ల(ఎంఎల్‌డీ) మురుగు నీటిని శుద్ధి చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం పలు కొత్త ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. నగరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాలే కాకుండా 700 వరకు ప్రైవేటు ఎస్టీపీలు ఉంటాయని అంచనా. వీటిలో చాలావరకు గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నాయి. పనిచేస్తున్నాయా? లేవా? తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 2021లో ఒకసారి ఆడిట్ చేయించారు. ఇటీవలే ఎన్విరాన్‌మెంటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్(ఈఈసీ) ప్రైవేటు ఎస్టీపీల పనితీరుపై మదింపు చేపట్టింది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు పలుచోట్ల పనిచేయడం లేదని గుర్తించారు. దీర్ఘకాలంలో వీటి నిర్వహణ భారం కావడమే ఇందుకు కారణమని.. ముఖ్యంగా కరెంట్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని నిర్మాణదారులు అంటున్నారు.
ప్రత్యేక ధర ఉంటే..
మురుగు నీటి శుద్ధితో హౌసింగ్ సొసైటీలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శుద్ధి చేసిన నీటిని మొక్కలకు, ఫ్లషింగ్, ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలను అధికంగా తోడాల్సిన అవసరం ఉండదు. ఆస్తి పన్నులో రాయితీ ఉంటుంది. అయినా సరే ఉన్న ఎస్టీపీలను ఉపయోగించడం లేదంటే శుద్ధి చేయడం కంటే భూగర్భ జలాలను తోడినా, జలమండలి నీళ్లకు బిల్లు చెల్లించినా తక్కువ వ్యయం అవుతోందని లెక్కలు వేసి ఎస్టీపీలను పక్కన పడేస్తున్నారు. వీటి లక్ష్యం నెరవేరాలంటే ప్రత్యేక టారిఫ్ ఉండేలా చూడాలని ఇటీవల బిల్డర్లు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. సామాజిక ప్రయోజనం దృష్ట్యా పరిశీలించాలని కోరారు.
ప్రత్యామ్నాయాలు సైతం..
టారిఫ్ తగ్గించడం ఒక్కటే కాకుండా విద్యుత్తు వ్యయం తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలపైన బిల్డర్లు, అధికార్ల మధ్య చర్చకు వచ్చింది. సౌర విద్యుత్తు ఏర్పాటుతో దీర్ఘకాల ప్రయోజనం ఉంటుందని ఇరువురు అభిప్రాయపడ్డారు. ఎస్టీపీ నడిపేందుకు అవసరమైన విద్యుత్తును పూర్తిగా సౌరశక్తి ద్వారా ఆయా కమ్యూనిటీలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నిర్మాణ సమయంలోనే సోలార్ ప్లాంటు సైతం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
యూనిట్ ఖర్చు భారం
గేటెడ్ కమ్యూనిటీల్లో గ్రూప్ హౌసింగ్ కింద సింగిల్ పాయింట్ విద్యుత్తు కనెక్షన్ ఇస్తారు. అక్కడి నుంచి అంతర్గతంగా ప్రతి ఫ్లాట్‌కు, ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇస్తారు. ఈ విధానంలో శ్లాబులు ఉండవు. ఒకటే టారిఫ్ ఉంటుంది. ప్రస్తుతం యూనిట్‌కు రూ.8.50 వసూలు చేస్తున్నారు. అంతర్గతంగా సరఫరా, పంపిణీ నష్టాలు లెక్కలోకి తీసుకుంటే సగటున యూనిట్ రూ.10 దాకా అవుతోందని హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు అంటున్నారు. మురుగు నీటి శుద్ధి యంత్రానికి సైతం ఇదే వర్తిస్తుంది. ఈ ఖర్చును భరించలేక చాలా కమ్యూనిటీల్లో మురుగును నేరుగా డ్రైన్లలోకి వదిలేస్తున్నారు. దుర్వాసన కూడా ప్రధాన కారణంగా కనబడుతోంది. కొన్ని సొసైటీలు మాత్రమే వీటిని పక్కాగా నిర్వహిస్తున్నాయి.
వంద శాతం పునర్వినియోగం అయ్యేలా చూడాలంటే...
ఎం.విజయసాయి, ప్రధాన కార్యదర్శి, నరెడ్కో, తెలంగాణ
గేటెడ్ కమ్యూనిటీల్లో ఇదివరకు శుద్ధి చేసిన నీటి పునర్వినియోగ అవసరం ఎంత ఉందనే దాన్ని బట్టి ఎస్టీపీలను నిర్మించేవారు. ఇప్పుడు వందశాతం మురుగునీటిని శుద్ధి చేయాలంటున్నారు. వాస్తవానికి ఆయా కమ్యూనిటీల్లో శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం అంతగా ఉండటం లేదు. ఫ్లషింగ్, మొక్కలు, కార్ల శుభత్రకు వాడిన తర్వాత కూడా చాలా నీరు మిగిలిపోతోంది. దీన్ని ఏం చేయాలో తెలియక డ్రైన్లలోకి కలిపేస్తున్నారు. ఎంతో ఖర్చుతో శుద్ధిచేసిన నీటిని అలా డ్రైన్లలో కలపడం ఆయా కమ్యూనిటీలకు చాలా బాధగా, భారంగా ఉంటోంది. ఇలా శుద్ధి చేసిన నీటిని ఇతరులకు విక్రయించడం ద్వారా కొంత ఆదాయం ఆయా కమ్యూనిటీలకు వచ్చేలా చేయగలిగితే నిర్వహణకు ఉపయోగపడుతుంది. దీన్ని పరిశీలించాలని కోరాం. విద్యుత్తు బిల్లులు సైతం క్లబ్‌హౌస్‌లో భాగంగా చాలావాటిలో ఎస్టీపీలకు కమర్షియల్ టారిఫ్ వేస్తున్నారు. వీటికి రాయితీ ఇస్తూ ప్రత్యేక టారిఫ్ ఉండాలని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఇటీవల కలిసినప్పుడు విన్నవించాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
MS Dhoni: ‘కెప్టెన్ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు