స్థిరాస్తిలోకి విదేశీ పెట్టుబడులు మూడింతలు

దేశీయ స్థిరాస్తి రంగంలోకి 2017-22 మధ్య కాలంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 26.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.18 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టారు.

Published : 13 May 2023 03:57 IST

కొలియర్స్‌ నివేదిక

దిల్లీ: దేశీయ స్థిరాస్తి రంగంలోకి 2017-22 మధ్య కాలంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 26.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.18 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టారు. గత ఆరేళ్లతో పోలిస్తే ఇది 3 రెట్లు అధికమని కొలియర్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. విదేశీ పెట్టుబడుల్లో 70% వరకు అమెరికా, కెనడా నుంచే వచ్చాయి. అంతర్జాతీయ మదుపరుల పెట్టుబడులకు భారత్‌ కీలక గమ్యస్థానంగా మారిందని తెలిపింది. పారదర్శకత, వ్యాపారాలకు ప్రోత్సాహం, విధానపరమైన సంస్కరణలు, పరిశ్రమలో వచ్చిన మార్పుల ఫలితంగా దేశంలో గత కొన్నేళ్లుగా విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయని పేర్కొంది. స్థిరాస్తి రంగంలోకి మొత్తం సంస్థాగత పెట్టుబడులు 2017-22లో 32.9 బిలియన్‌ డాలర్ల మేర వచ్చాయి. 2011-16 మధ్య 25.8 బిలియన్‌ డాలర్లే వచ్చాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు 8.2 బిలియన్‌ డాలర్ల నుంచి 26.6 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. అదే సమయంలో దేశీయ పెట్టుబడులు 17.6 బిలియన్‌ డాలర్ల నుంచి 6.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అమెరికా నుంచి 11.1 బిలియన్‌ డాలర్లు, కెనడా నుంచి 7.5 బిలియన్‌ డాలర్లు, సింగపూర్‌ నుంచి 6 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. దేశంలో ప్రభుత్వ అభివృద్ధి విధానాలు, జనాభా, మౌలిక సదుపాయాల కల్పన తదితర కారణాలతో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని కొలియర్స్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంకి ప్రసాద్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు