రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులకు జీఎస్‌టీ ఏల?

కోటి రూపాయల విలువ చేసే ఇల్లు కొనుగోలు చేస్తే... వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రూ.5 లక్షలు చెల్లించాలి. అందుబాటు ధరల ఇళ్లకు మినహా మిగతావాటిపై కేంద్రం 5 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తోంది. పాత ఇళ్లను పడగొట్టి వాటి స్థానంలో కొత్తవి నిర్మించి ఇచ్చేందుకు బిల్డర్‌కు డెవలప్‌మెంట్‌కు ఇచ్చినా జీఎస్‌టీ కట్టాల్సిందే.

Updated : 03 Jun 2023 07:58 IST

తొలగించాలని ఆర్థిక శాఖకు క్రెడాయ్‌ విజ్ఞప్తి

కోటి రూపాయల విలువ చేసే ఇల్లు కొనుగోలు చేస్తే... వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రూ.5 లక్షలు చెల్లించాలి. అందుబాటు ధరల ఇళ్లకు మినహా మిగతావాటిపై కేంద్రం 5 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తోంది. పాత ఇళ్లను పడగొట్టి వాటి స్థానంలో కొత్తవి నిర్మించి ఇచ్చేందుకు బిల్డర్‌కు డెవలప్‌మెంట్‌కు ఇచ్చినా జీఎస్‌టీ కట్టాల్సిందే. ఈ తరహా అభివృద్ధికి ఇచ్చే ఫ్లాట్లకు జీఎస్‌టీ నుంచి మినహాయించాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) ప్రతినిధులు కేంద్ర ఆర్థిక మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. వీటిపై జీఎస్‌టీ తొలగిస్తే ప్రత్యేకించి ముంబయిలాంటి నగరాల్లో రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.

ఈనాడు, హైదరాబాద్‌

నగరాలు అభివృద్ధి చెందే కొద్దీ నివాసాలకు డిమాండ్‌ పెరుగుతోంది. శివార్లకు విస్తరిస్తూ వెళుతోంది. అప్పటికే ఉన్న నగరం కాస్తా రీ డెవలప్‌మెంట్‌ జరుగుతుంది. పాత ఇళ్లను, అపార్ట్‌మెంట్లను కూల్చేసి వాటి స్థానంలో మరింత పెద్దవి నిర్మిస్తారు. హైదరాబాద్‌లో చూస్తే ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌, బేగంపేట, సనత్‌నగర్‌, ఈఎస్‌ఐ, బంజారాహిల్స్‌లాంటి ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లను కూల్చేసి వాటి స్థానంలో ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. ముంబయి లాంటి నగరాల్లో ఇప్పటికే ఉన్న పాత ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్లు కూల్చి వాటి స్థానంలో పది, అంతకంటే ఎక్కువ ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు. స్లమ్స్‌ స్థానంలో కొత్తవి కట్టి ఇస్తున్నారు. ఇందుకోసం ఆయా గృహ, ఫ్లాట్‌ యజమానులతో బిల్డర్‌ డెవలప్‌మెంట్‌ ఒప్పందం చేసుకుంటారు. ఉచితంగా అభివృద్ధి చేసి ఇస్తామనేది దీని సారాంశం. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 శాతం, 40 శాతం.. ప్రాంతాన్నిబట్టి 60 శాతం ఫ్లాట్లను భూ యజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలినవాటినే బిల్డర్‌ విక్రయిస్తారు. కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో నిర్మించినా.. పూర్తయిన ఇళ్లకు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే చాలాకాలంపాటు భూ యజమానులు, బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. బిల్డరే చెల్లించాలని భూ యజమాని, భూ యజమాని నుంచి తీసుకోవాలని బిల్డర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. జీఎస్‌టీ చెల్లించాలని బిల్డర్లకే నోటీసులు వచ్చేవి. దీంతో వీటిపై స్పష్టత ఇవ్వాలని గతంలో రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు ఆర్థిక శాఖను కోరాయి. ముంబయిలో రిహబిటేషన్‌ ప్రాజెక్టుల్లో రెండుసార్లు పన్ను పడుతోందని అక్కడి క్రెడాయ్‌ వాదన. దీంతో ఉచితంగా అభివృద్ధి చేసి ఇచ్చే యూనిట్లకు జీఎస్‌టీ నుంచి మినహాయించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌కు వారు విజ్ఞప్తి చేశారు.


సిమెంట్‌పై తగ్గిస్తారని ఆశాభావం..

ప్రస్తుతం సిమెంట్‌పై జీఎస్‌టీ అత్యధికంగా ఉంది. 28 శాతం వసూలు చేస్తున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడానికి జీఎస్‌టీ కూడా ఒక కారణం. ఎంతోకాలంగా జీఎస్‌టీని తగ్గించాలని సిమెంట్‌, నిర్మాణ రంగం కోరుతున్నాయి. దీన్ని ఈసారి 18 శాతానికి తగ్గిస్తారని క్రెడాయ్‌ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని