వడ్డీరేట్లు తగ్గిస్తేనే సరసమైన గృహ నిర్మాణానికి తోడ్పాటు

‘సరసమైన ఇళ్ల నిర్మాణాల సరఫరా పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే పన్ను ప్రోత్సాహకాలతో పాటు గృహ రుణ వడ్డీరేట్లలో తగ్గింపు వంటి చర్యలు దోహదం చేస్తాయి.

Updated : 20 Jan 2024 04:40 IST

2024లో కొనుగోలుదారుల స్థోమత మెరుగుపడే అవకాశం
‘ఈనాడు’తో నైట్‌ఫ్రాంక్‌ ఇండియా- నేషనల్‌ డైరెక్టర్‌ (రీసెర్చ్‌) వివేక్‌ రాఠి

ఈనాడు, హైదరాబాద్‌: ‘సరసమైన ఇళ్ల నిర్మాణాల సరఫరా పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే పన్ను ప్రోత్సాహకాలతో పాటు గృహ రుణ వడ్డీరేట్లలో తగ్గింపు వంటి చర్యలు దోహదం చేస్తాయి. 2023 రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ గృహ, వాణిజ్య విభాగాల్లో మంచి పనితీరు కనబర్చింది.. 2024లోనూ ఇది కొనసాగుతుందనే ఆశాభావం ఉంది. నివాస మార్కెట్లపై స్థానిక పరిస్థితులే తప్ప అంతర్జాతీయ పరిణామాలు పెద్దగా ప్రభావితం చేయవు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు మందగించినా స్వల్పకాలానికే’నని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్‌ ఇండియా- నేషనల్‌ డైరెక్టర్‌ (రీసెర్చ్‌) వివేక్‌ రాఠి ‘ఈనాడు’తో అన్నారు.


 • 2024లో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ భవిష్యత్తు ఎలా ఉంటుంది?
 • ఇక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, అత్యాధునిక మౌలిక వసతులు, వ్యాపార అనుకూల విధానాలతో హైదరాబాద్‌ మార్కెట్‌ విస్తరణకు మద్దతుగా ఉన్నాయి. వీటన్నింటితో డిమాండ్‌ కొనసాగుతూనే ఉంటుంది. ఇల్లు కావాలనే బలమైన ఆకాంక్ష కొనుగోలుదారుల దృక్పథాన్ని... ఇంటి చదరపు అడుగుల సగటు ధరలో పెరుగుదల ఆశావాదాన్ని వెల్లడిస్తోంది.


 • విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ ఉండటంతో నిర్మాణదారులు వాటినే నిర్మిస్తున్నారు. సరసమైన ధరల గృహాలు తగ్గిపోతున్నాయి? ఇల్లు కలగానే మిగిలిపోకూడదంటే.. సాధారణ, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వ మద్దతు ఎలా ఉండాలి?
 • 2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.4 శాతానికి పరిమితం అవుతుందని.. జీడీపీ వృద్ధి 7 శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా కొనుగోలుదారుల స్థోమత మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. గృహరుణ వడ్డీరేట్ల తగ్గింపుతో ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందించవచ్చు. సరసమైన గృహాలకు వడ్డీరేట్లు తగ్గింపు, ఆర్థిక ప్రోత్సాహకంతో వీటిని కట్టేవారు పెరిగి మార్కెట్లో సరఫరా పెరుగుతుంది. బడ్జెట్‌లో పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించాలి.

 • ఏప్రిల్‌, మే నెలల్లో పార్లమెంట్‌ ఎన్నికలు రాబోతున్నాయి. దీని ప్రభావం రియాల్టీపై ఏమైనా ఉంటుందా?
 • రాబోయే ఎన్నికలతో స్వల్పకాలానికి కొత్త ప్రాజెక్టు ప్రారంభ కార్యకలాపాలు మందగించవచ్చు. గృహ కొనుగోలుదారుల కార్యాచరణ అలాగే ఉంటుందని భావిస్తున్నాను.

 

 • హైదరాబాద్‌లో గత ఏడాది నివాస, వాణిజ్య స్థిరాస్తి మార్కెట్‌ పనితీరు ఎలా ఉంది?
 • నివాస విభాగంలో వార్షిక అమ్మకాలు 6 శాతం పెరిగాయి. 32,880 యూనిట్లు విక్రయించారు. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గృహ కొనుగోలుదారులు ఇంటి అప్‌గ్రేడ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో అమ్మకాలు పెరిగాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాలు, మెరుగైన సౌకర్యాలున్న కమ్యూనిటీలకు ప్రాధాన్యమిచ్చారు. కార్యాలయాల లీజింగ్‌లో 32 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. 8.8 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో లావాదేవీలు జరిగాయి. ఈ వృద్ధికి ప్రాథమికంగా ఆఫీసు పెరుగుదల కారణమని చెప్పొచ్చు. 2023 ద్వితీయార్థంలో లీజింగ్‌ కార్యకలాపాలు 68 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. గ్లోబల్‌ క్యాపబులిటీ సెంటర్స్‌(జీసీసీ) గణనీయంగా రావడంతో వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఐటీ రంగం కోలుకోవడంతో వృద్ధికి మరింత దోహదపడింది.

 • ఆర్థిక మాంద్యం ప్రభావం అమెరికాలో కనిపిస్తోంది. తాజాగా చైనా కూడా ప్రకటించింది. రానున్న రోజుల్లో మనపై ప్రభావం చూపుతుందా?
 • నివాస మార్కెట్‌ను దేశవాళీ పరిస్థితులు నడిపిస్తుంటాయి. ప్రపంచ పరిణామాల ప్రభావం చాలా తక్కువ పాత్రను కలిగి ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ వ్యయాలు, ఆర్థిక మందగమన ఆందోళనలు విక్రయాలను తీవ్రంగా ఏమీ ప్రభావితం చేయలేదు. కొవిడ్‌ మహమ్మారి అనంతరం నివాస మార్కెట్‌ బలమైన డెవలపర్ల చేతిలోకి మారింది. జీడీపీతో ఆర్థిక ఊపు బలంగా కొనసాగుతోంది. గృహ కొనుగోలుదారుల సెంటిమెంట్‌ 2024లోనూ కొనసాగే అవకాశం ఉంది. సానుకూల వ్యాపార వాతావరణమే ఉంటుంది.

 • నిర్మాణ సంఘాలు, ఇతర ఏజెన్సీలు, మీ సంస్థ నెలనెలా విడుదల చేస్తున్న రిజిస్ట్రేషన్ల గణాంకాల ప్రకారం చూస్తే వార్షిక విక్రయాలు 70వేల వరకు ఉన్నట్లు చూపుతున్నారు. కానీ, ఇటీవల మీరు 32,880 యూనిట్ల విక్రయాలే అంటున్నారు.. మీ డేటాకు ఉన్న ప్రాతిపదిక ఏంటి?
 • మా వార్షిక నివేదిక హైదరాబాద్‌లోని ప్రాథమిక విక్రయాల(ప్రైమరీ మార్కెట్‌)పైనే దృష్టి సారిస్తుంది. నెలవారీ విడుదల చేసే రిజిస్ట్రేషన్ల డేటాలో సెకండరీ సేల్‌ కూడా ఉంటుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలు కలిపి ఇందులో ఉంటాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని