గృహ నిర్మాణ ప్రాజెక్టు తీరు మారాలి

గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను నిర్మించే విధానం మారాలని.. స్వయం సమృద్ధిగా ఉండేలా అభివృద్ధి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల అదనపు కార్యదర్శి డి.తారా డెవలపర్లకు సూచించారు.

Published : 15 Jun 2024 01:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను నిర్మించే విధానం మారాలని.. స్వయం సమృద్ధిగా ఉండేలా అభివృద్ధి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల అదనపు కార్యదర్శి డి.తారా డెవలపర్లకు సూచించారు. నీరు, విద్యుత్తు కోసం బయటి నుంచి సరఫరా చేసే సంస్థలపై ఆధారపడకుండా డెవలపర్లు తమ ప్రాజెక్టుల్లో వర్షపు నీటి సంరక్షణ, సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే వ్యవస్థల్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలకు ఆట స్థలాలను కల్పించాలన్నారు. దిల్లీలో శుక్రవారం జరిగిన ‘నరెడ్కో మహి’ 3వ సదస్సులో ఆయన మాట్లాడారు. వాన నీటి సంరక్షణ అనుబంధంగా కాకుండా మౌలిక సదుపాయాల్లో ఇదొక ప్రధాన భాగం కావాలన్నారు. నడక మార్గాల్లోని పైకప్పులపై సౌర పలకల ఏర్పాటు వంటి మార్గాలను అన్వేషించాలన్నారు.


మహిళల భాగస్వామ్యం 8-10 శాతమే 

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలు ఎక్కువగా లేరని.. మహిళల భాగస్వామ్యం 8 నుంచి 10 శాతం మాత్రమే ఉందని నరెడ్కో అధ్యక్షుడు జి.హరిబాబు అన్నారు. వైద్య, నర్సింగ్, ఇతర వృత్తుల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 40 శాతానికి చేరుకుందని తెలిపారు. స్థిరాస్తి రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు పరిశ్రమలోని భాగస్వాములు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల గృహ నిర్మాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కొత్త దిశను ఇస్తుందని నరెడ్కో ఛైర్మన్‌ హీరానందని వెల్లడించారు.  కేంద్రం నిర్ణయాన్ని నరెడ్కో వైస్‌ ఛైర్మన్‌ రాజన్‌ బండేల్కర్‌ అభినందించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అధిక వృద్ధిని నమోదు చేయడానికి ఇది మరో మైలురాయి అని అన్నారు. స్థిరాస్తి రంగంలో మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి అసోసియేషన్‌ కృషి చేస్తోందని నరెడ్కో మహి అధ్యక్షులు అనంత సింగ్‌ రఘువంశీ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని