మొదటిసారి ఇల్లు కొనేవారికి.. 7.5 శాతం వడ్డీకే గృహ రుణమివ్వాలి

మొదటిసారి ఇల్లు కొనుక్కునేవారికి ఏడున్నర శాతం వడ్డీకే గృహరుణం అందేలా చర్యలు చేపట్టాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) కోరింది. నిర్మాణ రంగం కష్టకాలంలో

Published : 10 Aug 2019 01:57 IST

కేంద్రాన్ని అభ్యర్థించిన క్రెడాయ్‌
ఈనాడు, హైదరాబాద్‌

మొదటిసారి ఇల్లు కొనుక్కునేవారికి ఏడున్నర శాతం వడ్డీకే గృహరుణం అందేలా చర్యలు చేపట్టాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) కోరింది. నిర్మాణ రంగం కష్టకాలంలో ఉందని, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థించింది. లేకపోతే ఈ రంగంపై ఆధారపడిన 150కి పైగా పరిశ్రమలు దెబ్బతింటాయని.. ఇప్పటికే ఉక్కు పరిశ్రమలు వారంలో రెండు మూడు రోజులు ఉత్పత్తి నిలిపివేస్తున్నాయని గుర్తు చేసింది. జీడీపీలో సుమారు 6.7 శాతం నిర్మాణ రంగం నుంచి వస్తుందని.. వ్యవసాయం తర్వాత అధికశాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తుందని తెలిపింది. నిర్మాణరంగం ఎదుర్కొంటున్న నిధుల కొరతను పరిష్కరించేలా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇజ్రాయెల్‌లో ఈనెల 5,6,7 తేదీల్లో క్రెడాయ్‌ 19వ వార్షికోత్సవ సదస్సు ‘న్యాట్‌కాన్‌-2019’ జరిగింది. ఏటా ఒక ప్రదేశంలో వార్షికోత్సవం నిర్వహిస్తుంటారు. చిన్నదేశమైనా.. వనరులు తక్కువగా ఉన్నా అభివృద్ధిలో, సాంకేతికతలో దూసుకెళుతున్న ఇజ్రాయెల్‌ను ఈసారి ఎంపిక చేసుకున్నారు.  తెలంగాణ క్రెడాయ్‌ ఆధ్వర్యంలో అక్కడ సదస్సు విజయవంతంగా జరిగిందని కన్వీనర్‌ జి.రాంరెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా 1197 మంది ప్రతినిధులు దేశంలోని వేర్వేరు నగరాల నుంచి సదస్సుకు హాజరయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం నుంచి 220 మంది ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. నిర్మాణరంగంలో సాంకేతికత వినియోగం, నీటి పొదుపు చర్యలు, సమస్యల్లో ఉన్న ప్రాజెక్ట్‌ నిర్వహణ, మిలీనియల్స్‌ ఇంటి ఆకాంక్షలపై ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు. అంతర్జాతీయ వక్తలు ఆయా అంశాలపై మాట్లాడారని తెలిపారు. ఇజ్రాయెల్‌లో శుద్ధిచేసిన 80 శాతం నీటిని వ్యవసాయం, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని చెప్పారు. సముద్ర ఉప్పునీటిని తాగునీటిగా మారుస్తున్నారని.. రక్షణ ఉత్పత్తులతో పాటు అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయన్నారు. సమావేశం విజయవంతం చేయడంలో కో కన్వీనర్‌ రాంచంద్రారెడ్డి, యువ విభాగం ప్రతినిధి జగన్నాథరావు తదితరులు కృషిచేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని