5వేల ప్రాజెక్ట్‌లు ‘రెరా’లోకి 

తెలంగాణ రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) పరిధిలోకి సుమారు 5వేల ప్రాజెక్ట్‌లు రానున్నాయని అధికారులు తెలిపారు...

Updated : 16 Oct 2018 01:06 IST

ఈనాడు, హైదరాబాద్‌

5వేల 

ప్రాజెక్ట్‌లు ‘రెరా’లోకి 

తెలంగాణ రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) పరిధిలోకి సుమారు 5వేల ప్రాజెక్ట్‌లు రానున్నాయని అధికారులు తెలిపారు. 2017 జనవరి 1 తర్వాత అనుమతి తీసుకున్న ప్రతి ప్రాజెక్ట్‌కి రెరా వర్తిస్తుందని.. ఈ తేదీ తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, నగర పంచాయతీలు, ఇతర విభాగాల నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్ట్‌లన్నీ రెరాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని బిల్డర్లకు అధికారులు సూచించారు. తెలంగాణ క్రెడాయ్‌ ఆధ్వర్వంలో రెరా అవగాహన సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. 
* దేశంలో రెరా చట్టం 2016 మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చింది. 
* తెలంగాణలో  నిబంధనల్లో మార్పులు చేర్పులతో 2017 జులై 31న నోటిఫై చేశారు.  అదే ఏడాది జనవరి 1 నుంచి నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతి తీసుకున్న ప్రాజెక్ట్‌లకు రెరా వర్తిస్తుంది.  ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రాజెక్ట్‌ పురోగతి వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయాలి. 

 

నాలుగు స్థాయిల్లో పరిశీలన 

- కె.విద్యాధర్‌రావు, కార్యదర్శి, రెరా 

8 ఫ్లాట్‌లు ఆపైన.. 500 చ.మీ., ఆపై విస్తీర్ణం కలిగిన స్థలంలో నిర్మించే ప్రతి ప్రాజెక్ట్‌కు, లేఅవుట్లకు రెరా వర్తిస్తుంది. నాలుగు స్థాయిల్లో ప్రతి ప్రాజెక్టు పరిశీలన ఉంటుంది. మొదటి దశలో పత్రాలన్నీ అప్‌లోడ్‌ చేశారా లేదా అనేది లెవల్‌-1 అధికారి చూస్తారు. రెండో దశలో సక్రమంగా ఉన్నాయా లేవా అనేది లెవెల్‌-2 అధికారి పరిశీలిస్తారు. మూడో దశలో కార్యదర్శి, నాలుగో దశలో ఛైర్మన్‌ పరిశీలించి ఆమోదం తెలుపుతారు. ఫైల్స్‌ అప్‌లోడ్‌లో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు టీఎస్‌ఆన్‌లైన్‌ తోడ్పాటు తీసుకుంటున్నాం. కార్యాలయంలో వీరు అందుబాటులో ఉంటారు. అప్‌లోడ్‌లో ఇబ్బందులంటే వీరిని సంప్రదించవచ్చు. 

మూడు నెలల గడువు

 - ఎస్‌.బాలకృష్ణ, డైరెక్టర్‌, పురపాలక శాఖ 
రెరా అంటే నిర్మాణదారులు భయపడాల్సిన పనిలేదు. కొనుగోలుదారుల ప్రయోజనాల దృష్ట్యా నిర్మాణరంగంలో పారదర్శకతను పెంపొందించేందుకు నమోదు ప్రక్రియ మాత్రమే ఇది. కొనుగోలుదారులు, నిర్మాణదారుల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు తమ వద్ద ఉన్న సమాచారంతో పరిష్కరించేందుకు దోహదం చేస్తుంది. అంతే తప్ప బిల్డర్లను వేధించే మరో సంస్థ అనే భావన వద్దు. మహా రెరా అమలును పరిశీలించి.. స్థానికంగా నిర్మాణదారుల సూచనలతో మన అవసరాలకు తగ్గట్టుగా ‘తెలంగాణ రెరా’ను తీసుకొచ్చాం. వేర్వేరు ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్ట్‌లు 5వేల వరకు ఉన్నాయి. రెరా వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నెల రోజుల్లో ప్రతి ప్రాజెక్ట్‌ నమోదు చేసుకోవాలి. సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మూడునెలల గడువు ఇచ్చే అవకాశం ఉంది. నమోదు చేసుకోని ప్రాజెక్ట్‌లకు సంబంధించి తమ వద్ద సమాచారం, స్థానిక సిబ్బంది నుంచి సేకరించిన వివరాలతో నోటీసులు రెరా ఇస్తుంది. నమోదు చేసుకోకపోతే ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా విధించే అధికారం రెరా ఛైర్మన్‌కు ఉంది. తప్పుడు సమాచారంతో నమోదు చేస్తే 5 శాతం జరిమానా ఉంటుంది. ఆగస్టు 15 నుంచి వెబ్‌సైట్‌ ప్రారంభించే సన్నాహాలు చేస్తున్నాం. ఏసీగార్డ్స్‌లోని డీటీసీపీ కార్యాలయంలోనే ఒక అంతస్తులో పూర్తిగా రెరా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయి. 
సమస్యల్లేకుండా చూడండి.. 
- సీహెచ్‌ రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ క్రెడాయ్‌ 

కొత్తగా ఏదైనా ప్రవేశపెట్టినప్పుడు నిర్మాణదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో డీపీఎంఎస్‌ వచ్చినప్పుడు ఫైల్స్‌ అప్‌లోడ్‌ కాక ఇబ్బందులు పడ్డారు. అన్ని ఫైల్స్‌ అప్‌లోడ్‌ అయినా ఫీజు చెల్లింపు దగ్గర మొరాయింపు సమస్యలు వచ్చేవి. రెరా వెబ్‌సైట్‌ ప్రారంభం నుంచి ఆన్‌లైన్‌లో నమోదులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. మహా రెరా విధానాన్నే ఇక్కడా అమలు చేస్తున్నారు. మనకు అనుకూలంగా ఉండేవిధంగా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. 

నిర్మాణదారులకు మంచి అవకాశం 
- జి.రాంరెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ తెలంగాణ 

నిర్మాణదారులు ఎవరూ చెడ్డపేరు తెచ్చుకోవాలని ప్రాజెక్ట్‌ను ఆలస్యం చేయరు. ఆర్థిక మాంద్యం, ఇతరత్రా కారణాలతో కొన్ని ప్రాజెక్టుల్లో జాప్యం జరిగితే జరిగి ఉండొచ్చు. వీటి శాతం చాలా తక్కువ. ఇలాంటి నిర్మాణాలు తెలంగాణలో బహు స్వల్పం. అయినా బిల్డర్లపై ఇది ఒక మచ్చలాగే ఉంది. దీనిని పోగొట్టేందుకు రెరా రూపంలో నిర్మాణదారులకు మంచి అవకాశం. అమలులో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఆచరణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో అధికారుల సహకారం కావాలి. అవగాహన సదస్సు ద్వారా నిర్మాణదారుల్లో ఉన్న భయాలు తొలగిపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని