ఆలస్యమెందుకు.. పదండి సొంతింటి ముందుకు...

 ఇళ్లకు హైదరాబాద్‌ మార్కెట్‌లో డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతోంది. గత ఆరునెలల్లో విక్రయాలు 9 శాతం పెరగగా ధరల పరిస్థితీ అదే స్థాయిలో ఉంది. గత ఏడాదిలో తక్కువలో తక్కువ 4 నుంచి 10 శాతం వరకు పెరుగుదల ఉంది. కొత్త సంవత్సరంలో సొంతింట్లోకి అడుగు పెట్టాలనుకునేవారు మరింతగా ధరలు ఊపందుకోక ముందే నచ్చిన ప్రాజెక్ట్‌లో మెచ్చిన ప్రాంతంలో కొనుగోలు చేయడం ఉత్తమమని మార్కెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

Updated : 18 Aug 2022 12:18 IST

క్రితం ఏడాది సగటున పది శాతం పెరిగిన ధరలు

ఇళ్లకు హైదరాబాద్‌ మార్కెట్‌లో డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతోంది. గత ఆరునెలల్లో విక్రయాలు 9 శాతం పెరగగా ధరల పరిస్థితీ అదే స్థాయిలో ఉంది. గత ఏడాదిలో తక్కువలో తక్కువ 4 నుంచి 10 శాతం వరకు పెరుగుదల ఉంది. కొత్త సంవత్సరంలో సొంతింట్లోకి అడుగు పెట్టాలనుకునేవారు మరింతగా ధరలు ఊపందుకోక ముందే నచ్చిన ప్రాజెక్ట్‌లో మెచ్చిన ప్రాంతంలో కొనుగోలు చేయడం ఉత్తమమని మార్కెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌

కార్యాలయాల లీజింగ్‌లో హైదరాబాద్‌ దూసుకెళుతోంది. ఏటా కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేస్తోంది. ఈ సెంటిమెంట్‌ నివాస మార్కెట్‌లో డిమాండ్‌కు కారణమవుతోందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే మెరుగైన మౌలిక వసతులు, కంపెనీల రాకతో ఉద్యోగావకాశాలు.. వలసలు పెరగడంతో ఇళ్ల విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయని అంటున్నారు. స్థానికులే కాదు ఉపాధిరీత్యా నగరానికి వలస వచ్చినవారు ఇక్కడే స్థిర నివాసానికి మొగ్గు చూపుతున్నారు.

 

నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక ప్రకారం..
* 2018లో కొత్త ప్రాజెక్ట్‌లలో 5404 ఇళ్లు ప్రారంభం అయితే గతేడాది ఈ సంఖ్య 13,405 ఇళ్లకు పెరిగింది. ఏకంగా 150 శాతం పెరిగింది.
* 2018లో 15,591 ఇళ్లను కొనుగోలు చేయగా.. 2019లో 16,267 మంది కొత్త ఇంటివారయ్యారు.
* ఇళ్లకు డిమాండ్‌ ఉండటంతో మిగిలిన వాటి విక్రయం 14 త్రైమాసికాలకు తగ్గింది. ఇదివరకు 17 త్రైమాసికాలు పట్టేది.

ఆ నాలుగు నెలలు మాత్రం..
జులై నుంచి అక్టోబరు వరకు మార్కెట్‌లో కొంత మందగమనం కనిపించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల సంక్షోభ ప్రభావంతో గృహరుణాలు లభ్యం కాక, ఆ తర్వాత ఆషాఢ మాసం రావడంతో కొనుగోళ్లు తగ్గాయి. ఆర్థిక మాంద్యంతో ఉద్యోగ భద్రతపై సందేహాలతో కొందరు వెనకడుగు వేశారు. ఆ సమయంలో సాధారణం కంటే 20-25 శాతం ఇళ్ల విక్రయాలు తగ్గాయి. తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగవుతూ వచ్చింది. విక్రయాల్లో వార్షిక వృద్ధి 4 శాతం నమోదైంది.

క్రమంగా అందకుండా..?
నగరంలో ఇళ్ల ధరలు 2015 ద్వితీయార్ధం నుంచి పుంజుకుంటూనే ఉన్నాయి. గత ఏడాది సగటు పెరుగుదల అన్ని నగరాల కంటే అధికంగా 10 శాతం ఉండటం నిర్మాణదారులకు బాగానే ఉన్నా.. అందుబాటు ఇళ్లు దూరం అవుతున్నాయనే భావన కొనుగోలుదారులు వ్యక్తం చేస్తున్నారు.
* గతేడాది హైదరాబాద్‌లో సగటు చ.అ. రూ.4500 చేరుకోగా.. అంతక్రితం ఇది రూ.4,090 మాత్రమే. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో చ.అ.గరిష్ఠంగా 13వేలు పలుకుతోంది. మాదాపూర్‌లో గరిష్ఠంగా 8వేలు చెబుతున్నారు.
* కార్యాలయాల లీజులు పెరగడంతో ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని బడాసంస్థలన్నీ రూ.80లక్షలు-రూ.కోటి మధ్య ఇళ్లను నిర్మిస్తున్నాయి. ఉన్నతస్థాయి ఉద్యోగుల కోసం రూ.కోటి-రూ.కోటిన్నర మధ్య ఉండే ఆవాసాలను కడుతున్నాయి. పశ్చిమప్రాంతంలోనే అత్యధికం అమ్ముడయ్యాయి. కోకాపేట, గండిపేట, నార్సింగి, తెల్లాపూర్‌లో ఇళ్ల నిర్మాణాలు ఎక్కువగా వస్తున్నాయి.
* అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రూ.40-50 లక్షల లోపు ధరల ఇళ్ల లభ్యత తగ్గిపోయింది. శివార్లలోమాత్రమే కొనగలిగే ధరల్లో ఉన్నాయి.నిన్నటివరకు ప్లాటింగ్‌ వెంచర్లుగా ఉన్న ఆదిభట్ల, తుక్కుగూడ, కొల్లూరు వంటి చోట్ల అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. రూ.25 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు