పండగ తర్వాత పరుగు

సంక్రాంతి పండగ తర్వాత నుంచి స్థిరాస్తి మార్కెట్‌ మరింత పుంజుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొవిడ్‌ టీకాలు వస్తే మార్కెట్‌లో సానుకూలత పెరుగుతుందని అంటున్నారు. గత ఏడాది కరోనా తీవ్ర ప్రభావం చూపినా...

Published : 09 Jan 2021 02:27 IST

మార్కెట్‌ వర్గాల అంచనా
కొవిడ్‌ టీకా రాకతో బలపడనున్న సెంటిమెంట్‌
ఈనాడు, హైదరాబాద్‌

సంక్రాంతి పండగ తర్వాత నుంచి స్థిరాస్తి మార్కెట్‌ మరింత పుంజుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొవిడ్‌ టీకాలు వస్తే మార్కెట్‌లో సానుకూలత పెరుగుతుందని అంటున్నారు. గత ఏడాది కరోనా తీవ్ర ప్రభావం చూపినా ఆఖరి త్రైమాసికంలో విక్రయాలు పెరగడంతో రియల్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే నమ్మకంతో కొత్త ప్రాజెక్ట్‌లను పెద్ద సంఖ్యలో ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ల ఇబ్బందులు తొలగడంతో క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. వారం, పది రోజులుగా స్థిరాస్తుల విచారణలు పెరిగాయని.. పండగ తర్వాత లావాదేవీలు జరిగే అవకాశం ఉందని బిల్డర్లు అంటున్నారు. .

హైదరాబాద్‌ వ్యవస్థీకృత ఇళ్ల నిర్మాణ మార్కెట్‌లో ఏటా పదహారు వేల ఇళ్లపైనే విక్రయిస్తుంటారు. ఒక సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2018, 2019  మార్కెట్‌ మంచి దూకుడు మీద ఉంది. 2018లో 15,591 ఇళ్లు విక్రయం కాగా.. 2019లో రికార్డు స్థాయిలో 16,267 ఇళ్లను విక్రయించారు. గత ఏడాది కరోనా కారణంగా రెండు, మూడు త్రైమాసికాల్లో విక్రయాలు మందగించినా.. నాలుగో త్రైమాసికంలో పుంజుకున్నాయి. దీంతో కొత్త ప్రాజక్ట్‌ల్లో 12,826 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. 10,442 ఇళ్లు విక్రయం అయ్యాయి. క్రితం సంవత్సరం కంటే తగ్గినా ఆఖరి త్రైమాసికంలో అనూహ్యంగా పుంజుకోవడంతో 2021పైనే మార్కెట్‌ వర్గాలు మరిన్ని ఆశలు పెట్టుకున్నాయి.
ఏయే ధరల్లో కొన్నారంటే..
క్రితం ఏడాది విక్రయాల పరంగా చూస్తే రూ.50 లక్షల ధరల లోపల ఉన్న ఇళ్లు పెద్ద సంఖ్యలో విక్రయం అయినా.. ఇవన్నీ చాలావరకు ఆవ్యవస్థీకృత మార్కెట్‌లో ఉన్నాయి. వ్యవస్థీకృత మార్కెట్‌లో చూస్తే 2019 ద్వితీయార్ధంలో 18 శాతం ఉండగా.. 2020 ద్వితీయార్ధంలో 24 శాతానికి పెరగడం విశేషం. ఇదే సమయంలో రూ.50 లక్షలపైన ఇళ్ల విక్రయాల వాటా 85 నుంచి 76 శాతానికి తగ్గింది.
కొత్త వెంచర్లు సిద్ధం
భూములు, నిర్మాణాలతో పాటూ స్థలాల వెంచర్లు కొత్తగా వస్తున్నాయి. గతంలో అనుమతులు తీసుకుని ఆపేసిన వాటిని పూర్తి చేస్తున్నారు. మరికొన్ని అనుమతుల దశలో ఉన్నాయి. ఈలోపు భూములను చదును చేస్తున్నారు. పండగ తర్వాత మార్కెటింగ్‌పై దృష్టి పెట్టబోతున్నారు. ఎక్కువగా అవుటర్‌ చుట్టుపక్కల ఈ వెంచర్లు వస్తున్నాయి. గేటెడ్‌ వెంచర్ల పోకడ ఇటీవల పెరిగింది. ఎల్‌ఆర్‌ఎస్‌ లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో స్థలాల లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. కొవిడ్‌ ముందున్న పరిస్థితి ఇంకా రానప్పటికీ మార్కెట్‌పై ఆశాభావంతో ప్రాజెక్ట్‌లు మొదలు పెడుతున్నారు. కొవిడ్‌ భయాలతో ఉద్యోగ అభద్రత కారణంగా స్థలాలపై పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ టీకా పంపిణీ మొదలైతే మార్కెట్‌లో సానుకూల సెంటిమెంట్‌ పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరిగి కొనుగోళ్లు పెరుగుతాయని స్థిరాస్తి వ్యాపారి ఒకరు అన్నారు.  


భూములు దొరకడం లేదు
- ప్రభాకరరావు, అధ్యక్షుడు, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌

మార్కెట్‌ కొద్ది రోజులుగా బాగా పంజుకుంది. డిమాండ్‌ పెరగడంతో నగరం చుట్టుపక్కల భూములు దొరకడం లేదు. ధరలు పెరగడం కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయి. పక్క రాష్ట్రం వాళ్లు హైదరాబాద్‌ వైపే చూస్తున్నారు. ఈ పరిణామాలన్నీ హైదరాబాద్‌ మార్కెట్‌ పెరగడానికి దోహదం చేశాయి. నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇలాంటి సమయంలో సిమెంట్‌, స్టీలు ధరలు అదుపు లేకుండా పెరుగుతుండటం ఆందోళ కలిగిస్తోంది. వీటిని నియంత్రించకపోతే మున్ముందు కష్టమే. సామగ్రి ధరలు పెరిగాయని ఫ్లాట్ల రేట్లను పెంచలేము. రెరాలో ముందే ధరను ప్రకటించి ఉంటాము కాబట్టి తర్వాత పెంచడానికి కుదరదు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో సమస్యలు తొలగినా.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ధరణిలో చేస్తుండటంతో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. జీపీఏ, ఎస్‌పీఏ కావడం లేదు. గతంలో కొన్న భూములు మ్యుటేషన్‌ కాకపోవడంతో రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. వీటిని పరిష్కరించాలి. భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తే త్వరలోనే ఈ సమస్యలు తొలగిపోతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని