నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు అందేనా?

కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 1న రాబోతుంది. కొవిడ్‌తో ఏడాది కాలంగా అన్ని రంగాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం నేపథ్యంలో వస్తున్న బడ్జెట్‌ కావడంతో అందరి దృష్టి ఈసారి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై ఉంది. స్థిరాస్తి రంగం చాలా ఆశలు పెట్టుకుంది....

Published : 30 Jan 2021 03:17 IST

పరిశ్రమ హోదా మా చిరకాల డిమాండ్‌
‘ఈనాడు’తో స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు
ఈనాడు, హైదరాబాద్‌

కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 1న రాబోతుంది. కొవిడ్‌తో ఏడాది కాలంగా అన్ని రంగాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం నేపథ్యంలో వస్తున్న బడ్జెట్‌ కావడంతో అందరి దృష్టి ఈసారి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై ఉంది. స్థిరాస్తి రంగం చాలా ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ నినాదమైన 2022 నాటికి అందరి ఇళ్లు సాకారం కావాలంటే ఈ రంగానికి ప్రత్యేకించి కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు అంటున్నారు. పరిశ్రమ హోదాపై సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. నిర్మాణ సామగ్రిపై జీఎస్‌టీ రేట్ల హేతుబద్ధీకరణ, సిమెంట్‌, స్టీలు ధరల నియంత్రణ వరకు పలు డిమాండ్లు ఉన్నాయి. వీటితో పాటూ పరిశ్రమ బాగుకోసం వారు ఇంకేం ఆశిస్తున్నారో ‘ఈనాడు’తో పంచుకున్నారు.


ఆ పరిమితులు సడలించాలి
- సీహెచ్‌ రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ తెలంగాణ

* అందుబాటు ధరల్లో ఇళ్లపై ఉన్న పరిమితులు సడలించాలని కోరుతున్నాం. ఇంటి ధర గరిష్ఠంగా రూ.45 లక్షలు దాటొద్దనే నిబంధన ఉంది. భూముల ధరలు పెరిగిన పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌లో ప్రధాన నగరంలో ఫ్లాట్లు రావు. శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిందే. పరిమితిని రూ.60 లక్షల వరకు పెంచితే ఎక్కువ మంది నిర్మాణదారులు ఈ విభాగంలో ఇళ్లు కట్టేందుకు ముందుకొస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక పరిమితి, హెచ్‌ఎండీఏలో మరోటి ఉండేలా.. నగరవారీగా పరిమితుల సడలింపులు ఉండాలి. ఈ విభాగంలో రివైజ్డ్‌ ప్లాన్లను అనుమతించాలి.
* దీర్ఘకాల మూలధన రాబడిపై పన్ను 20 శాతం వరకు ఉంది. సుంకాలు కలుపుకుంటే 22 శాతం అవుతుంది. దీన్ని 10 శాతానికి తగ్గించాలి.
* కొత్త నిర్మాణాల్లో రెండేళ్లు దాటాక అమ్ముడుపోని ఫ్లాట్లపై సైతం ఆదాయం వస్తున్నట్లుగా రెండేళ్ల క్రితం కొత్త నిబంధనలు తెచ్చారు. లేదంటే అద్దెకు ఇచ్చి వచ్చే కిరాయిని ఆదాయంలో కలపాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఎత్తివేయాలి.  


ధరలను నియంత్రించేలా..
-పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

* నిర్మాణ సామగ్రిపై జీఎస్‌టీ రేట్లు కొన్నింటిపై చాలా ఎక్కువగా ఉన్నాయి. 28 శాతం నుంచి 18 శాతం వరకు వసూలు చేస్తున్నారు. ఇదివరకు ఇన్‌ఫుట్‌ క్రెడిట్‌ ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా తీసేశారు. ఫలితంగా ప్రతి చదరపు అడుగు నిర్మాణంపై రూ.400 వరకు భారం పడుతుంది. రేట్లను తగ్గించి హేతుబద్ధీకరించాలి.
* సిమెంట్‌, స్టీలు ధరలు ఇష్టారీతిగా పెంచేస్తున్నారు. ఏడాది క్రితం టన్ను స్టీలు రూ.40 వేలు ఉంటే ఇప్పుడు రూ.65 వేల వరకు ఉంది. ఏడాది కాలంలో ఇంత పెరిగితే ఇల్లు కట్టుకునేవారికి చాలా ఇబ్బందే. టెలికాం రంగంలో ధరల నియంత్రణకు ట్రాయ్‌ ఉన్నట్లే.. సిమెంట్‌ ఇష్టారీతిగా పెంచకుండా ఒక ఆధారిటీ ఉండాలి.
*  2022 నాటికల్లా  అందరికీ ఇల్లు  అనేది  కేంద్ర ప్రభుత్వ నినాదం. ఇది సాకారం కావాలంటే పన్నులను  హేతుబద్ధీకరించే  చర్యలు చేపట్టాలి. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలను ప్రకటించాలి.


మధ్యతరగతి వాసులకు ప్రోత్సాహకాలు
-జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

*  బడ్జెట్‌లో మధ్యతరగతి సొంతింటి కలను నేరవేర్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించాలి. గడువు ముగుస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన రుణ ఆధారిత సబ్సిడీని పొడిగించాలి. లాక్‌డౌన్‌తో గత ఏడాది ఈ అవకాశాన్ని ఎక్కువ మంది వినియోగించుకోలేదు. కనీసం రెండేళ్లైనా పొడిగింపు ఇవ్వాలి.
*  రియల్‌ ఎస్టేట్‌కు పరిశ్రమ హోదా ఇవ్వాలి. ఎంతోకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను కేంద్రం గుర్తించాలి. ఫలితంగా ఈ రంగానికి తక్కువ వడ్డీలకు రుణాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు 13 నుంచి 15 శాతం వరకు వడ్డీ పడుతుంది.
*  స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే మౌలిక వసతుల కొత్త ప్రాజెక్ట్‌లను తెలంగాణకు కేటాయించాలి. ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి. నగర శివార్ల వరకు ఎంఎంటీఎస్‌ విస్తరించేందుకు నిధుల కేటాయింపు పెంచాలి.


వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పెంచాలి

- ఆర్‌.చలపతిరావు, అధ్యక్షుడు, ట్రెడా

* ఆదాయ పన్నులో సెక్షన్‌ 24(బి) ప్రకారం గృహరుణ వడ్డీపై పన్ను మినహాయింపు రూ.2 లక్షల వరకే ఉంది. ఐదు లక్షల వరకు పెంచాలి. ఆ మేరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఫలితంగా ఎక్కువ మంది ఇళ్లు కొనుక్కునేందుకు ముందుకొస్తారు.
* లేబర్‌ కాంట్రాక్ట్స్‌పైన జీఎస్‌టీ 18 శాతం వసూలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం లేబర్‌ ఛార్జీలు పెరిగాయి కాబట్టి వీరితో కుదుర్చుకునే కాంట్రాక్ట్‌లపైన జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలి.


పరిశ్రమ నుంచి మరికొన్ని డిమాండ్లు

* అమ్ముడు పోకుండా మిగిలిపోయిన ఇళ్లపై పన్ను మినహాయిం పులను 3 నుంచి 5  ఏళ్లకు పొడగించాలి.
* క్రెడిట్‌ లింక్‌డ్‌ సబ్సిడీ స్కీమ్‌ను 31 మార్చి 2023 వరకూ పొడగించాలి
* రాయితీని రూ. 2.67 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచాలి.
* భవన నిర్మాణ సామాగ్రిపై 18శాతం జీఎస్‌టీను 5 శాతానికి తగ్గించాలి.
నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ కేంద్ర ఆర్ధిక మంత్రికి ఇచ్చిన వినతులు..
* అద్దె ఇళ్లకు ఎఫ్‌డీఐలు అనుమతిం చాలి. బిల్డర్లకు పదేళ్ల ట్యాక్స్‌ హాలిడే ఇవ్వాలి.
* స్థిరాస్తి వ్యాపారానికి ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్‌(ఈసీబీ)ను అనుమతించాలి.
* బ్యాంకు క్రెడిట్‌కు రిట్‌లను పరిగణలోకి తీసుకోవాలి.
* ఇంటి విలువలో 90 శాతం రుణాలు ఇవ్వాలి.
* పన్నులపై  సర్‌ఛార్జిను తగ్గించాలి.
* జాయింట్‌ డెవలప్‌ మెంట్‌ అగ్రిమెంట్‌లో మూలధన లాభంపై పన్ను స్పష్టత ఇవ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని