ఐదంతస్తులు చిన్నబోతున్నాయ్‌!

మబ్బులను ముద్దాడేలా.. గగనాన్ని హత్తుకునేలా నగరంలో ఆకాశహర్మ్యాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. వీటి రాకతో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్లు చిన్నబోతున్నాయి

Published : 31 Mar 2021 19:56 IST

ఈనాడు, హైదరాబాద్‌

బ్బులను ముద్దాడేలా.. గగనాన్ని హత్తుకునేలా నగరంలో ఆకాశహర్మ్యాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. వీటి రాకతో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్లు చిన్నబోతున్నాయి. కొనుగోలుదారులు సైతం ఎత్తైన నిర్మాణాల్లో ఆవాసానికే ఇష్టపడుతున్నారు. ఇవి గేటెడ్‌ కమ్యూనిటీలు కావడం, ప్రాంగణంలో 70 శాతంపైగా ఖాళీ స్థలం వదిలి పచ్చదనానికి కేటాయిస్తుండటంతో నగరంలో సౌకర్యంగా ఉండాలనుకునేవారు వీటికి సై అంటున్నారు. ఎత్తే కాదు వీటిలో ధర కూడా ఎక్కువే సుమా! కొనే ముందు...

ఆరో అంతస్తు పైనుంచి ప్రతి చ.అడుగుకు రూ.10 నుంచి 20 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. పది అంతస్తుల తర్వాత మరో ధర, 20 అంతస్తుల పైన మరో ధర ఉంటుంది.
అత్యవసరాల సమయంలో పై నుంచి కిందికి చేరుకోవడంలో సమస్యలు ఉన్నట్లు ఇప్పుడున్నవారు చెబుతున్నాయి. అత్యంత వేగంగా పనిచేసే లిఫ్ట్‌లు అమర్చడం వంటి చర్యలతో వీటిని సరిదిద్దే దిశగా నిర్మాణ సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నాయి.

వీటిలో కొనుగోలు చేసేటప్పుడు పిల్లలు, పెద్దలు రక్షణ కూడా చూసుకోవాలి. ఆ మేరకు నిర్మాణపరంగా బాల్కనీల్లో ఏర్పాట్లను పరిశీలించాలి.
కిటికీల అమరిక పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలి. గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకు తట్టుకునేలా డిజైన్‌ ఉందో లేదో చూసుకోవాలి.
చివరి అంతస్తులో వేడి ఎక్కువగా ఉంటుంది. ఎండ కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి విద్యుత్తు బిల్లుల వినియోగం పెరుగుతుంది. ఈ మేరకు వేడి లోపలికి రాకుండా ఎలాంటి అద్దాలు వినియోగిస్తున్నారనేది కూడా తెలుసుకోవడం మంచిది.

అసాధారణ పరిస్థితుల్లోనూ తట్టుకునేలా కిటికీల సామగ్రి వాడుతున్నారా లేదా అని చూసుకోవాలి.

సానుకూలతలు ఉన్నాయ్‌..
సమాజంలో 25వ అంతస్తులో నివసించడం అంటే హోదాగా చూస్తుంటారు.
అత్యంత ఎత్తులో ఉండే పై అంతస్తులో నివసించేవారు బాల్కనీల్లోంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. చుట్టూ ఉండే పరిసరాలు, పచ్చదనాన్ని అస్వాదించవచ్చు.
గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి ప్రసరిస్తుంది.
పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలు ఉండవు.
పర్యావరణ సమస్యలు ముఖ్యంగా ధ్వని కాలుష్యం ఉండదు. దోమల బెడద మాటే లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని