నాణ్యంగా కడితేనే ఖర్చు తక్కువ

నిర్మాణరంగంలో అత్యధికశాతం మంది చిన్న, మధ్యస్థాయి బిల్డర్లే.  సామాన్య, మధ్యతరగతి వారికి బడ్జెట్‌లో ఇళ్లను అందించేది వీరే.

Updated : 10 Apr 2021 02:43 IST

చిన్న బిల్డర్ల బలోపేతానికి చర్యలు
ఐఐటీలతో కలిసి సాంకేతికతపై పరిశోధనలు
నిర్మాణ కార్మికులకు టీకాలు
‘ఈనాడు’తో క్రెడాయ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు జి.రాంరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌:  నిర్మాణరంగంలో అత్యధికశాతం మంది చిన్న, మధ్యస్థాయి బిల్డర్లే.  సామాన్య, మధ్యతరగతి వారికి బడ్జెట్‌లో ఇళ్లను అందించేది వీరే. అయితే పెద్ద బిల్డర్ల మాదిరి వీరు తమ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు సాంకేతికతను వాడలేకపోతున్నారు. అందుకు కారణం చిన్న ప్రాజెక్టుల్లోనూ వినియోగించే సాంకేతికత లేకపోవడం ఒకటైతే, ఆర్థికంగా భరించే సామర్థ్యం లేకపోవడం ప్రధాన అవరోధంగా ఉంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఐఐటీలతో కలిసి పరిశోధనలు చేయనున్నట్లు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి క్రెడాయ్‌ జాతీయ కార్యవర్గానికి ఆయన ఇటీవల ఎన్నికయ్యారు. రాష్ట్రం నుంచి 13 మంది బిల్డర్లకు జాతీయ కార్యవర్గంలోని వేర్వేరు కమిటీల్లో చోటు లభించింది. ఈ స్థాయిలో రాష్ట్ర బిల్డర్లకు ప్రాధాన్యం దక్కడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా రాంరెడ్డితో ‘ఈనాడు’ ముఖాముఖి.
* నాణ్యత పాటిస్తేనే ఖర్చు స్వల్పం అంటున్నారు.. ఎలా ?
నిర్మాణ రంగంలో నాణ్యతే ప్రధానమైంది. ప్రణాళిక దశ నుంచే దీన్ని పాటించాలి. రాజీపడితే రకరకాల సమస్యలు వస్తాయి. వాటిని సరిచేసేందుకు అదనపు వ్యయం చేయాల్సి వస్తుంది. అదే మొదటిగానే  జాగ్రత్తగా చేపడితే అదనపు ఖర్చు ఉండదు. మార్కింగ్‌ పక్కాగా లేకపోతే వంకరపోయే అవకాశం ఉంది. స్తంభం నిటారుగా కాకుండా పక్కకు ఒరిగితే తిరిగి సరిచేయడానికి వ్యయ ప్రయాసలు తప్పవు.  బాత్రూమ్‌లో లీకేజీ వేధిస్తుంటుంది. మళ్లీ పగలగొట్టి, చిప్పింగ్‌ చేసి సరిదిద్దాలి. ఇదంతా అదనపు వ్యయమే. మొదటిసారే పక్కాగాచేస్తే అనుకున్న వ్యయంలోనే నిర్మాణం పూర్తవుతుంది.
* సెకెండ్‌ వేవ్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ భయాలతో కార్మికులు తిరిగి స్వగ్రామాలకు తరలుతున్నారు? దీని ప్రభావం నిర్మాణ రంగంపై ఉందా?
పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధిస్తారేమోననే భయాలైతే ఉన్నాయి. గత ఏడాది మాదిరి కార్మికులు వెళ్లిపోయే పరిస్థితి ఉండదు. క్రితంసారి లాక్‌డౌన్‌లో రెండునెలల పాటూ నిర్మాణ కార్మికులను బిల్డర్లు బాగా చూసుకున్నారు. ఉండేది ఎక్కువగా క్యాంపుల్లో కాబట్టి  ముందుజాగ్రత్తగా బిల్డర్లు చర్యలు చేపడుతున్నారు.  గతంలో మాదిరి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ కార్మికులు సురక్షితంగా ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు టీకాలు వేయించబోతున్నాం. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖకు లేఖ రాశాం. టీకా వేసేందుకు బిల్డర్లు సౌకర్యాలు కల్పిస్తారని ఆ మేరకు వ్యయం భరించేందుకు సిద్ధమని లేఖ రాశాం. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని భావిస్తున్నాం.
* జాతీయ ఉపాధ్యక్షుడిగా పదవి చేపట్టారు. మీకు అప్పగించిన బాధ్యతలు..మీ ప్రాధాన్యతలు ఏవి?
ప్రధానంగా మూడు ప్రాధాన్యాలు ఉన్నాయి. క్రెడాయ్‌కి దేశవ్యాప్తంగా 227 ఛాప్టర్లలో 13వేల మంది బిల్డర్లు ఉంటే వీరిలో 10వేల మందికి పైగా చిన్న, మధ్యస్థాయి బిల్డర్లే ఉన్నారు. చిన్న బిల్డర్లు సాంకేతికతను వినియోగించకలేక పోతున్నారు. చిన్న నిర్మాణాలకు తగ్గ సాంకేతికత అందుబాటులో లేకపోవడం, ఆర్థికంగా వారికి ఆ సామర్ధ్యం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. వీరికి తోడ్పాటు అందిస్తూ చిన్న బిల్డర్ల సామర్థ్యాలను పెంపొందించడం ప్రధమ ప్రాధాన్యంగా నిర్దేశించుకున్నాం. ఇందుకోసం ఐఐటీలతో కలిసి నిర్మాణ రంగ సాంకేతికతలపై  పరిశోధనలను చేపట్టనున్నాం. కొత్తతరాన్ని ప్రోత్సహించనున్నాం. నాణ్యత పెంచడం మరో ప్రధాన అంశం. నాణ్యంగా కడితే ఖర్చు పెరుగుతుందనే భావన ఎక్కువ మందిది. నిజానికి పక్కా ప్రణాళికతో నాణ్యంగా నిర్మిస్తే అదనపు వ్యయాలే ఉండవు. వీటిపై అవగాహన పెంపొందించబోతున్నాం. బిల్డర్లు అంటే సమాజంలో వేర్వేరు కారణాలతో అంత గౌరవం లేదు.  ఈ భావన తొలగిపోయేలా చేయడం మరోముఖ్యమైన అంశంగా పెట్టుకున్నాం. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా కార్యక్రమాలను పెంచనున్నాం. వీటిలో రెండు అంశాలకు నేనే నేతృత్వం వహిస్తున్నాను.
* ప్రీలాంచ్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లను అందిస్తామంటే క్రెడాయ్‌కి ఎందుకు అభ్యంతరం అని కొన్ని సంస్థలు అంటున్నాయి. ఆ ధరకు ఇవ్వడం సాధ్యం కాదా?
ఒక ప్రాంతంలో వాస్తవంగా చదరపు అడుగు ధర రూ.6వేల వరకు ఉంటే.. ప్రీలాంచ్‌లో రూ.మూడు వేలకు ఇస్తామంటున్నారు. ఇలాంటివాటిలో ఎక్కువగా ఇన్వెస్టర్లు ఉంటున్నారు. నాకు చదరపు అడుగుకు రూ.1500 లాభం వచ్చినా చాలని రూ.4500కు సదరు ఫ్లాటును విక్రయానికి పెడితే...  బిల్డర్‌ కూడా అదే ధరకు విక్రయించాల్సిన పరిస్థితి  వస్తుంది. మిగిలిన ఫ్లాట్ల విక్రయాలు బిల్డర్‌కు సవాల్‌గా మారుతాయి. ఆ ధరకు ఇస్తే మిగతా ప్రాజెక్టును పూర్తి చేయలేక మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  ఇక్కడ తక్కువ ధరకు ఇస్తామంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే సక్రమంగా అన్ని అనుమతులు తీసుకుని విక్రయించమని కోరుతున్నాం. అనుమతులు పొంది, రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసి రూ.3వేలకు కాకపోతే రూ.2వేలకు విక్రయించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కొనుగోలుదారు సొమ్ముకు రెరా భరోసా ఉంటుంది. ఇప్పుడు యూడీఎస్‌ కింద విక్రయాలతో కొనుగోలుదారుడు చెల్లించిన సొమ్ముకు ఎలాంటి రక్షణ లేదు. ఇదే విషయాన్ని మేం చెబుతున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని