రెరాలో 2 లక్షల ఇళ్లు

తెలంగాణలో స్థిరాస్తి నియంత్రణ అథారిటీ(రెరా) అమల్లోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఇప్పటివరకు ఇందులో నమోదైన ప్రాజెక్టుల్లో దాదాపుగా రెండు లక్షల ఇళ్లు రిజిస్టర్‌ అయ్యాయి.   గత ఏడాది రికార్డు స్థాయిలో 83వేల ఇళ్లు రెరాలో నమోదయ్యాయి. ఇందులో కొన్ని ప్రారంభం కావాల్సి ఉండగా.. మరికొన్ని వేర్వేరు నిర్మాణ దశల్లో ఉన్నాయి. వీటిలో పూర్తైన ఇళ్లు సైతం ఉన్నాయి. చట్టం...

Updated : 15 Jan 2022 02:21 IST

గతేడాది రికార్డు స్థాయిలో నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో స్థిరాస్తి నియంత్రణ అథారిటీ(రెరా) అమల్లోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఇప్పటివరకు ఇందులో నమోదైన ప్రాజెక్టుల్లో దాదాపుగా రెండు లక్షల ఇళ్లు రిజిస్టర్‌ అయ్యాయి.   గత ఏడాది రికార్డు స్థాయిలో 83వేల ఇళ్లు రెరాలో నమోదయ్యాయి. ఇందులో కొన్ని ప్రారంభం కావాల్సి ఉండగా.. మరికొన్ని వేర్వేరు నిర్మాణ దశల్లో ఉన్నాయి. వీటిలో పూర్తైన ఇళ్లు సైతం ఉన్నాయి. చట్టం ప్రకారం విల్లాలు, అపార్ట్‌మెంట్లు, స్థలాలు, వాణిజ్య ప్రాజెక్టుల వరకు రెరాలో నమోదు తప్పనిసరి. ఏ స్థిరాస్తి సంస్థ అయినా తమ ప్రాజెక్టుకు అనుమతి రాగానే మొదటగా రెరాలో నమోదు చేసిన తర్వాతే విక్రయించాలి. 2021 డిసెంబరు వరకు నమోదైన ప్రాజెక్టులను చూస్తే ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

ఆరు పడకల గదుల వరకు..

ఒక పడక గది మొదలు ఆరు పడక గదుల ఇళ్లు, ఫ్లాట్ల వరకు ఇందులో ఉన్నాయి. చాలా పరిమితంగా 1.5; 2.5; 3.5 పడక గదుల ప్రణాళికలు ఉన్నాయి. స్టూడియో రూమ్‌లు కడుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి. డ్యూప్లెక్స్‌, ట్రిఫ్లెక్స్‌, 4 బీహెచ్‌కే డ్యూప్లెక్స్‌ పోకడలు సైతం కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో క్లబ్‌ హౌస్‌ వంటి సౌకర్యాలు ఈ రోజు అనివార్యంగా మారడంతో వీటిని సైతం ప్రత్యేకంగా  పేర్కొంటున్నారు.  

మూడు పడక గదులే ఎక్కువ

మూమూలుగానే హైదరాబాద్‌ వాసులు విశాలమైన ఇళ్లను కోరుకుంటారు. కొవిడ్‌తో ఇది మరింత పెరిగింది. రెరాలో నమోదైన యూనిట్లను పరిశీలిస్తే.. అత్యధికంగా మూడు పడక గదులే ఉన్నాయి. రెండు లక్షల యూనిట్లలో మూడు పడక గదుల వాటానే దాదాపుగా 50 శాతంగా ఉంది. 95వేల వరకు వీటినే కడుతున్నారు. రెండు పడక గదులు నాలుగేళ్లలో 85 వేలు రిజిస్టర్‌ అయ్యాయి.

2020 వరకు 5 పడక గదుల వరకు ఉంటే 2021 వరకు వచ్చేసరికి ఆరు పడక గదుల ప్రాజెక్టులు సైతం వచ్చాయి.

విల్లాలు ఆ ఏడాది అధికంగా..

కొవిడ్‌ తర్వాత విల్లాలకు డిమాండ్‌ పెరిగింది. అంతకు ముందు నుంచి విల్లాల నిర్మాణం చేపట్టినా.. కొవిడ్‌ అనంతరం వేగంగా విక్రయాలు జరిగాయి. 2018లో 1729 విల్లాలు రెరాలో నమోదైతే.. అత్యధికంగా 2019లో 6176 విల్లాలు రిజిస్టర్‌ అయ్యాయి. 2020లో 2768, 2021లో 2976   నమోదయ్యాయి.

వాయిదాలు ఇవ్వడంతో..

గత ఏడాది అత్యధిక ప్రాజెక్టులు అనుమతులు పొందడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. కొవిడ్‌తో 2020లో ఆగిపోయిన ప్రాజెక్టులను గత ఏడాది చేపట్టడం ఒకటైతే... నిర్మాణ అనుమతుల ఫీజులను వాయిదాల్లో చెల్లించే వెలుసుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంతో ఎక్కువ మంది బిల్డర్లు కొత్త ప్రాజెక్టులతో ముందుకు వచ్చారని క్రెడాయ్‌ వర్గాలు తెలిపాయి. మార్కెట్‌ బాగుండటం కూడా ఒక కారణమని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని