అందుబాటుకు చిరునామా

రాజీవ్‌ రహదారి.. ఓఆర్‌ఆర్‌కు చేరువ.. మేడ్చల్‌ జిల్లా కొత్త కలెక్టరేట్‌కు సమీపం.. ఇప్పటికీ అందుబాటులో ఉన్న ధరలతో శామీర్‌పేట వైపు స్థిరాస్తి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. శామీర్‌పేట సహా చుట్టుపక్కల ప్రాంతాలు

Updated : 19 Feb 2022 04:07 IST

ఈనాడు, హైదరాబాద్‌

రాజీవ్‌ రహదారి.. ఓఆర్‌ఆర్‌కు చేరువ.. మేడ్చల్‌ జిల్లా కొత్త కలెక్టరేట్‌కు సమీపం.. ఇప్పటికీ అందుబాటులో ఉన్న ధరలతో శామీర్‌పేట వైపు స్థిరాస్తి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. శామీర్‌పేట సహా చుట్టుపక్కల ప్రాంతాలు మున్సిపాలిటీలుగా మారడంతో క్రమబద్ధ అభివృద్ధికి అవకాశం ఉంటుందని అక్కడ నివాసాలకు మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగత ఇళ్లు, విల్లాలకు అనుకూలంగా ఉండడంతో క్రమంగా అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీ సంస్కృతి బాగా విస్తరిస్తోంది.

కండ్లకోయ ఐటీ పార్క్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ బయట ఉండే శామీర్‌పేట, ఓఆర్‌ఆర్‌ లోపల ఉండే తూంకుంట ప్రాంతానికి 10-12 కి.మీ. దూరం మాత్రమే. సిటీకి కొంచెం దూరమైనా, భవిష్యత్తు దృష్ట్యా ఎక్కువ మంది ఇక్కడ పెట్టుబడి కోణంలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. బొల్లారం, అల్వాల్‌, హకీంపేట దాటి ఓఆర్‌ఆర్‌ వైపు నివాసాలు ఇప్పటికే వస్తుండటంతో అక్కడ నిర్మాణాలు ఊపందుకున్నాయి.

అందుకునేలా...

గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారడంతో ఇటీవల ఇక్కడ ధరలు పెరిగాయి. అయినా. ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు. విశాలమైన ఇల్లు కట్టుకోవాలనుకునేవారు, అందుబాటు ధరల్లో ఇళ్ల కోసం చూస్తున్న వారికి ఈ ప్రాంతం చిరునామాగా మారింది. ట్రాఫిక్‌ రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకునేవారు సైతం ఇటువైపే చూస్తున్నారు.

* ఈ ప్రాంతంలో విల్లాల ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఉన్నాయి. భవిష్యత్తులో కట్టుకునేందుకు వీలుగా ముందు చూపుతో కొనుగోలు చేస్తున్నారు.

సీనియర్‌ సిటిజన్లు నివసించేందుకు ఈ ప్రాంతం బాగా పేరుగాంచింది. మొట్టమొదటిగా ఇక్కడే ఆ తరహా ప్రాజెక్టులు చేపట్టారు.

మున్ముందు రాబోయేవి..

జేబీఎస్‌ నుంచి అవుటర్‌కు వేగంగా చేరుకునేందుకు ఎక్స్‌ప్రెస్‌ వే ప్రతిపాదనలున్నాయి. మిలిటరీకి చెందిన స్థలాలు ఉండటంతో స్థల సేకరణ చిక్కులున్నాయి. ఇవి తొలగిపోతే నగరం నుంచి శివారుకు, శివారు నుంచి నగరానికి వేగంగా చేరుకోవచ్చు. ఇప్పటికే జేబీఎస్‌ వరకు మెట్రో ఉన్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో అల్వాల్‌ వరకు విస్తరించే ప్రతిపాదనలున్నాయి.

* ఓఆర్‌ఆర్‌ అనుసంధానంతో నగరంలో ఇతర ప్రాంతాలకు వేగంగా చేరుకోవచ్చు. ఐటీ కారిడార్‌కు ఇక్కడి నుంచి చేరుకోవడం సులభం.

* మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌ 13 కి.మీ. దూరంలోనే ఉంది. ఇక్కడి వరకు త్వరలోనే ఎంఎంటీఎస్‌ రైళ్లు తిరగనున్నాయి. తద్వారా నగరం వరకు ప్రజారవాణా సులభతరం కానుంది.

* ఓఆర్‌ఆర్‌ సమీపంలో కడుతున్న మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో స్థిరాస్తి మార్కెట్‌ వృద్ధికి దోహదం చేస్తుంది.

* ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) మొదటి దశ ఇక్కడికి సమీపం నుంచి గజ్వేల్‌ మీదుగా వెళుతుంది. సహజంగానే  ఇక్కడ రియల్‌ లావాదేవీలు పెరిగాయి. మున్ముందు మరింతగా పెరగనున్నాయి.

సామాజిక వసతులు

* ఈ ప్రాంతంలో సామాజిక మౌలిక వసతులు ఒక్కోటి మెరుగవుతున్నాయి. శామీర్‌పేట చెరువు, జింకల పార్క్‌, సమీపంలో మెడిసిటీ ఆసుపత్రితో పాటు పేరున్న పాఠశాలలు అధిక సంఖ్యలో ఉన్నాయి. రెండు పేరున్న రిసార్టులు ఏర్పాటయ్యాయి.

* ఇక్కడికి సమీపంలో జీనోమ్‌ వ్యాలీ ఉంది. ప్రపంచానికి టీకాలు సరఫరా చేస్తున్న భారత్‌ బయోటెక్‌ సహా ఇక్కడ ఏర్పాటైన పలు ఇతర ఫార్మా సంస్థల్లో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. వీరు సమీపంలో వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.

* కండ్లకోయ ఐటీ పార్క్‌ ప్రభావం ఈ ప్రాంతంపై ఉంటుంది. సహజంగానే ఆసుపత్రులు, వాణిజ్య కేంద్రాలు వచ్చే అవకాశం ఉంది.

మార్పు దిశగా..

కొంపల్లి-మేడ్చల్‌-శామీర్‌పేట ప్రాంతం వృద్ధి పథంలో పయనిస్తోంది. నాగ్‌పూర్‌ జాతీయ రహదారి, కరీంనగర్‌ రహదారి చుట్టు పక్కల నిర్మాణాలు పెరిగాయి. భారీ వాణిజ్య భవనాలు, మల్టీఫ్లెక్స్‌లు, బహుళంతస్తుల నివాస సముదాయాలు పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉన్నాయి. సుచిత్ర, కొంపల్లి, బొల్లారం ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు అందుబాటులో ఉండగా.. వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు, స్థలాల కోసం బాహ్య వలయ రహదారి వరకు వెళుతున్నారు.

* సికింద్రాబాద్‌ నుంచి కొంపల్లికి 15 కి.మీ. దూరం ఉంటుంది. దగ్గరలో బొల్లారం ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ ఉంది. ఇది అందుబాటులోకి వస్తే నగరానికి ప్రయాణం సౌకర్యంగా మారనుంది.

* ఎంఎంటీఎస్‌ రానుండడంతో ఈ ప్రాంతం స్థిరాస్తి కొనుగోళ్లకు ఆకర్షణీయంగా మారింది. పెద్ద సంస్థలు తమ ప్రాజెక్ట్‌లను ఇక్కడ మొదలెట్టాయి.

* మెట్రో రైలుతో ఈ ప్రాంతం నుంచి ఐటీ కేంద్రానికి రవాణా సులువు అవుతుందని నిర్మాణదారులు అంటున్నారు. సమీపంలో ప్యారడైజ్‌, పరేడ్‌గ్రౌండ్స్‌ మెట్రో స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడి నుంచి హైటెక్‌ సిటీకి చేరుకోవచ్చు. ఇదంతా స్థిరాస్తి మార్కెట్‌లో సానుకూలతకు దోహదం చేస్తోంది. నివాసాలకు అనువైందిగా మారింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని