చూస్తేనే కదా.. ఎలా కడుతున్నారో తెలిసేది!

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ బాగుండటంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకటి రెండు అంతస్తుల్లోని విల్లాలు మొదలు  ఐదు నుంచి యాభై అంతస్తుల వరకు బహుళ అంతస్తుల భవనాలు

Updated : 26 Feb 2022 04:40 IST

నిర్మాణ నాణ్యతపై కొనుగోలుదారులు అంచనాకు రావొచ్చు

ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ బాగుండటంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకటి రెండు అంతస్తుల్లోని విల్లాలు మొదలు  ఐదు నుంచి యాభై అంతస్తుల వరకు బహుళ అంతస్తుల భవనాలు చకచకా కట్టేస్తున్నారు.  ఎంతో అనుభవమున్న బిల్డర్లతో పాటు పెద్ద ఎత్తున కొత్తవారు భవనాలను కట్టిస్తున్నారు. తక్కువకు వస్తుందనో, తెలిసినవారు అనో, పేరున్న సంస్థ అని చెప్పి ఆయా ప్రాజెక్టుల్లో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. మరి నిర్మాణ నాణ్యత సంగతేంటి?

కొత్త ఇంట్లోకి దిగిన తర్వాత నాణ్యత సరిగ్గా లేదని చాలా మంది ఇంటి యాజమానులు బాధపడుతుంటారు. ముందే చూసుకుని కొనాల్సిందని మోసపోయామని చింతిస్తుంటారు. కొత్తగా ఇల్లు కొనబోతున్న వారు ఈ పొరపాటు చేయకూడదంటే నిర్మాణ నాణ్యతను పరిశీలించడం మర్చిపోవద్దు.

హైదరాబాద్‌లో అధికశాతం మంది కొనుగోలుదారులు ప్రాజెక్టు ఆరంభంలోనే ఇళ్లను బుక్‌ చేస్తుంటారు. నిర్మాణం ప్రారంభంలో ఉంటే తక్కువ ధరకు వస్తుందనేది వీరి ఆలోచన. ఇది నిజం కూడా.  ఐదు అంతస్తుల భవనమైతే పూర్తికి రెండేళ్లు, ఆకాశహర్మ్యాలైతే మూడునాలుగేళ్లు పడుతుంది. ముందు చెల్లించేశాం.. నిర్మాణం పూర్తయ్యాక వెళితే సరిపోతుందని భావించకుండా నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని చూసి రావాలి. దీంతో పనులు  ఎలా జరుగుతున్నాయి? చెప్పిన గడువులోపల ప్రాజెక్టు పూర్తిచేసి ఇస్తారా లేదా? పనులు ఆగి ఉంటే ఎందుకని ఆగాయో? పూర్తి చేసే ఆర్థిక స్థోమత ఉందా లేదా అనేవి తెలుస్తాయి. అన్నింటికీ మించి ఉపయోగించే సామగ్రి, వాటి నాణ్యతపై అవగాహన వస్తుంది.

కాంక్రీట్‌ మిశ్రమాల నాణ్యత తనిఖీ

నిర్మాణం కలకాలం నిలబడాలంటే కాంక్రీట్‌ ధృఢంగా ఉండటం ముఖ్యం. కాంక్రీట్‌ మిశ్రమాన్ని సిద్ధం చేయడం, దృఢత్వాన్ని రోజూ పరీక్షించడం కష్టమే. సాధారణంగా డెవలపర్లే కాంక్రీట్‌ నాణ్యత, బలాన్ని తనిఖీ చేస్తారు. కొన్నిసార్లు లోపాయికారి ఒప్పందాలతో నాణ్యతలో రాజీపడే ప్రమాదం ఉంది. సిద్ధంగా ఉన్న కాంక్రీట్‌ మిశ్రమాన్ని ఉపయోగించడం మేలు. వీటిని సైతం ఏ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి.. ప్రాజెక్టులోనే తయారు చేస్తున్నారా? ఎంతదూరం నుంచి రప్పిస్తున్నారనే దాన్ని బట్టి నాణ్యతలో తేడాలుంటున్నాయి. అనుమానం వస్తే కాంక్రీట్‌ను పరీక్షించే మొబైల్‌ వాహనాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. కొనుగోలుదారులు నమూనాలు తీసుకెళ్లి పరీక్షించుకోవచ్చు. డెవలపర్లు చేపట్టిన నాణ్యత తనిఖీల ఆడిట్‌ నివేదికలను చూపించాలని కోరవచ్చు.

స్ట్రక్చరల్‌ డిజైన్‌ కీలకం..

నిర్మాణాల్లో అత్యంత ముఖ్యమైంది స్ట్రక్చరల్‌ డిజైన్‌. భవనం ధృఢత్వం, నిర్మాణం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. గరిష్ఠ భద్రత, మన్నికను అందించే విధంగా డిజైన్‌ ఉందా లేదా అనేది ప్రధానం. వేగంగా వీచే గాలులను తట్టుకుంటుందా? భూకంపాలను తట్టుకునే విధంగా డిజైన్‌ చేశారా అనేది చూడాలి.

గచ్చు మొదలు...

నిర్మాణంలో ఉపయోగించే ఉపకరణాలు చెప్పినవే బిగిస్తున్నారో లేదో చూసుకోవాలి. ఒప్పందం సమయంలోనే  ఇంటిలో వేసే టైల్స్‌, బండలు, వంట గదిలో ఉపయోగించే సామగ్రి, స్నానాలగదిలో వాడే కమోడ్‌లు, కరెంట్‌ ఉపకరణాలు, తలుపులకు వాడే కలప వరకు స్పష్టంగా పేర్కొని ఉంటారు. ఆ మేరకు నాణ్యమైన ఉపకరణాలు వాడారో లేదో చూసుకోవాలి.

భద్రత ముఖ్యం..

ప్రస్తుతం నగరంలో ఆకాశహర్మ్యాల కట్టడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో కొనడానికి అధికశాతం మంది మొగ్గు చూపుతున్నారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే అత్యవసర పరిస్థితుల్లో త్వరగా పైఅంతస్తు నుంచి కిందికి చేరుకునే సౌకర్యాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. చాలా భవనాల్లో ఆలస్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారని గత అనుభవాలు చెబుతున్నాయి. అగ్నిప్రమాద సమయంలో త్వరగా బయటపడే వీలుందా? అందుకు అనుగుణంగా నిర్మాణం ఉందా లేదా చూడాలి. 

గోడలను సైతం..

ప్రస్తుతం మట్టి ఇటుక, సిమెంట్‌ ఇటుక, పూర్తి కాంక్రీట్‌ మేవాన్‌ టెక్నాలజీతో గోడలు నిర్మిస్తున్నారు. సిమెంట్‌ ఇటుకలతో మేలని నిర్మాణదారులు చెబుతున్నా వీటితో ఎక్కువగా పగుళ్లు వస్తున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు. కొనేటప్పుడు వేటితో కట్టారు? ఒకవేళ సిమెంట్‌ ఇటుకలతో కడితే పగుళ్లు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది కూడా చూసుకోవాలి. సుత్తితో గోడను కొట్టడం, మేకును కొట్టడం ద్వారా ఏ మేరకు గోడ బలంగా ఉందో చూసుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. పత్రాల్లో పేర్కొన్న మేరకు గోడ మందం ఉందా లేదా కూడా తనిఖీ చేసుకోవచ్చు.


వ్యాన్‌లోనే పరీక్షలు చేస్తాం..

- అభిజిత్‌, బిజినెస్‌ హెడ్‌, గోద్రెజ్‌ కన్‌స్ట్రక్షన్స్‌

పని ప్రదేశంలో కాంక్రీట్‌ మిశ్రమాన్ని పరీక్షించడం ఇప్పటివరకు పెద్ద సవాల్‌. ల్యాబ్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే ల్యాబ్‌నే వ్యాన్‌లో ఏర్పాటు చేసి సైట్‌ వద్దకు తీసుకెళుతున్నాం. వ్యాన్‌లోనే అన్నిరకాల పరికరాలతో అత్యాధునిక ప్రయోగశాల ఉంటుంది. దీంతో నాణ్యతపరీక్షల ఫలితాల కోసం సమయం వృథా కాదు.


థర్డ్‌ పార్టీతో తనిఖీలు

ఇల్లైనా, ఫ్లాటైనా, స్థలాలైనా కొనుగోలు చేసే ముందు బిల్డర్లు, డెవలపర్ల గత చరిత్ర తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు. అనుమతి లేని వాటిలో ధర తక్కువని కొంటే తాత్కాలికంగా కొంత ఆర్థిక ప్రయోజనం ఉన్నా.. దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవు. 

* డెవలపర్‌ గతంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లను నిబంధనల మేరకే నిర్మించారా? నాణ్యతలో రాజీ పడ్డారా? ఉల్లంఘనలు ఉన్నాయా తెలుసుకోవాలి. ఇదివరకే కొన్నవారిని వాకబు చేస్తే తెలిసిపోతుంది.

* చెప్పిన సమయానికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసిన చరిత్ర ఉందా? నాణ్యమైన సామగ్రి ఉపయోగిస్తున్నారా అనే విషయాలు తెలుసుకోవడం అవసరమే.

* జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందిన డిజైన్‌ ప్రకారం కడుతున్నారో లేదో చూడాలి. చాలాచోట్ల డ్రాయింగ్స్‌ వేరు ఉంటాయి. కట్టేది మరోటి ఉంటుంది. 

* కాలమ్స్‌, బీమ్స్‌ భవన భారాన్ని తట్టుకునే విధంగా ఉన్నాయా లేదో చూడాలి.

* నిర్మాణం చేపట్టే స్థలంలో భూసార పరీక్షలు ఏమైనా చేశారా? వదులు నేల ఉంటే అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా చూడాలి.

* లీకేజీలు, పగుళ్లు లేకుండా నిర్మాణం ఉందా లేదా చూడాలి. లేదంటే ఎక్కువకాలం మన్నవు. భవనం పైన వర్షపునీరు వెళ్లేలా స్లాబ్‌ వాలు సరిగ్గా ఉందా లేదా చూడాలి.

* నిర్మాణంలో ప్రతిదీ ముఖ్యమే. నాణ్యమైన సామగ్రి ఉపయోగిస్తున్నారో లేదో ఒకసారి వెళ్లి చూస్తే తెలుస్తుంది. స్టీల్‌, సిమెంట్‌, ఇసుక అన్నీ నాణ్యమైనవే వాడాలి. మిశ్రమంలో, క్యూరింగ్‌కు మంచి నీరే వాడాలి.

* విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ విభాగాలు, ఇతర థర్డ్‌పార్టీ సంస్థలతోనూ బిల్డర్లు పరిశీలన చేయిస్తే అటువంటి వాటిలో కొనుగోలు చేయవచ్చు. ఏటూ తేల్చుకోలేకపోతే అనుభవజ్ఞులైన వారి సలహాను తీసుకోవచ్చు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని