చిన్న ఇంటికి ఇంటీరియర్స్‌ ఇలా..!

ఇంటీరియర్స్‌ అనంతరం ఇల్లు ఇరుకైందన్న భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ విస్తీర్ణంలో ఉండే ఇళ్లలో ఈ సమస్య వస్తుంది. కొత్తగా ఫ్లాట్‌ కొని ఇంటీరియర్‌ పనులు చేయించుకునే వారికి డిజైనర్స్‌ ఏం సూచిస్తున్నారంటే..

Updated : 19 Mar 2022 04:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటీరియర్స్‌ అనంతరం ఇల్లు ఇరుకైందన్న భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ విస్తీర్ణంలో ఉండే ఇళ్లలో ఈ సమస్య వస్తుంది. కొత్తగా ఫ్లాట్‌ కొని ఇంటీరియర్‌ పనులు చేయించుకునే వారికి డిజైనర్స్‌ ఏం సూచిస్తున్నారంటే..

* తక్కువ విస్తీర్ణం కలిగిన నివాసాల్లో పడకగది విశాలంగా ఉంటుందని ఊహించలేం. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని మంచమే ఆక్రమిస్తుంది కాబట్టి దీని కిందనే క్యాబినెట్‌లు, ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకుంటే పుస్తకాలు, అల్బమ్స్‌, టాయ్స్‌ వంటివాటిని దాచుకోవచ్చు. బెడ్‌ను చేయించేటప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సులువుగా తీసేలా చూసుకోవాలి. దీంతో వస్తువులు బయటికి కనిపించకుండా గది విశాలంగా అనిపిస్తుంది.
* హాల్‌లో ఇదివరకు ఎక్కువగా దివాన్‌ సెట్స్‌ కనిపిస్తుండేవి. స్థలాభావంతో వీటి స్థానంలో బహుళ ఉపయోగరకంగా ఉండే ఫర్నిచర్‌ వచ్చింది. సోఫా, దివాన్‌ రెండింటి అవసరాలు తీరుస్తున్నాయివి. ఇక్కడ వేసే బెడ్‌ కింది భాగంలో అల్మారాల ఏర్పాటుతో బెడ్‌షీట్లు, ఇతరత్రా వస్తువులను వేర్వేరు అరలలో దాచుకోవచ్చు. లివింగ్‌ రూమ్‌లో గోడకు వేలాడదీసిన టీవీ సెట్‌ కేంద్రంగా క్యాబినెట్‌ చేయిస్తే అలంకరణ వస్తువులు ఇక్కడ సర్దుబాటు చేసుకోవచ్చు.
* ప్రతి గదిలో అవసరం మేరకు మాత్రమే అల్మారాలు చేయించుకోవాలి. ఇంటీరియర్స్‌ చేయిస్తున్నాం కదా అని ఇంట్లో ఖాళీ లేకుండా గోడలను మొత్తం అల్మారాలతో కప్పేస్తుంటారు. దీంతో ఇల్లు ఇరుకుగా కనిపిస్తుంది. అల్మారాలు ఏమైనా వినియోగిస్తుంటారా అంటే అదీ లేదు. అన్నీ ఖాళీగా దుమ్ముపట్టి ఉంటాయి. రెడీమేడ్‌ అయితే అవసరం మేరకే వాడుకునేలా ఉంటాయి. గది మూలల్లో, గోడ వెంట అల్మారాలు అడ్డంగా గది మొత్తం ఆక్రమించేలా కాకుండా నిలువుగా ఉండే వాటిని చేయించుకోవాలి. దీంతో ఎక్కువ వస్తువులను వాటిలో సర్దేయవచ్చు. మూలకో, ఎక్కడో ఒక పక్కనే అల్మారా ఉంటుంది కాబట్టి గది విశాలంగా అనిపిస్తుంది.  
* ప్రధాన ద్వారం వెనకాల పుస్తకాల అల్మారాను ఏర్పాటు చేసుకోవచ్చు. కింద, పైన రెండు భాగాలుగా విడదీయవచ్చు. పైన పుస్తకాలు కనిపించేలా.. కింద అల్బమ్స్‌, దినపత్రికలు దాచుకునేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో మెట్ల కింద స్థలాన్ని ఖాళీగా వదిలేయకుండా.. పుస్తకాల అల్మారాను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఖాళీగా ఉన్న గోడలకు చెక్కతో చేసిన క్యూబ్స్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లోపలి వైపు నుంచి గోడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గది అందం చెడకుండా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని