Updated : 23 Apr 2022 05:50 IST

మూడు అండగా.. మాడు చల్లగా!

ఈనాడు, హైదరాబాద్‌

ఎండాకాలంలో ఏసీ లేకుండా ఉండలేమా? ఇళ్లలో పగటిపూట ఎండ వేడి... రాత్రిపూట ఉక్కపోతతో అల్లాడిపోవాల్సిందేనా? తెల్లారింది మొదలు ఇళ్లలో ఉండేవారు చెమటలు కక్కుతున్నారు. దీనికి విరుగుడుగా ఇంటి పైకప్పులను చల్లగా ఉంచుకునే విధానాలేమైనా ఉన్నాయా? అంటే ఒకటి కాదు మూడు ఉన్నాయంటున్నారు నిపుణులు. వాటినే కూల్‌ రూఫ్స్‌, గ్రీన్‌ రూఫ్స్‌, పవర్‌ రూఫ్స్‌గా చెబుతున్నారు.  హైదరాబాద్‌లో చాలామంది ఈ పద్ధతులను అవలంబించి వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. వనరులు, అవసరాలు, మేడపైన ఉన్న స్థలాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు.


కూల్‌ రూఫ్స్‌

సాధారణంగా మన భవనాల శ్లాబ్స్‌పై భానుడి కిరణాలు నేరుగా పడతాయి కాబట్టి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. కూల్‌ రూఫ్స్‌తో శ్లాబ్‌పై సూర్యరశ్మి నేరుగా పడకుండా.. పడినా పరావర్తనం చెందేలా చేయడం ద్వారా వేడి తీవ్రతను తగ్గిస్తారు. దీంతో గదిలో వేడి తగ్గుతుంది. ఫ్యాను, ఏసీల కోసం చేసే కరెంట్‌ బిల్లు తగ్గుతుంది. సగటున 15 శాతం బిల్లు ఆదా అవుతుందని విద్యుత్తు ఇంజినీర్లు అంటున్నారు.

* ఇంటి శ్లాబుపై టైల్స్‌ వేసుకోవడం ద్వారా వేడి ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు. మొజాయిక్‌ టైల్స్‌తో చౌకలో పని అయిపోతుంది. స్థోమతను బట్టి వేడిని నియంత్రించే టైల్స్‌, క్లే టైల్స్‌ను వేసుకోవచ్చు.

* శ్లాబుపై కూల్‌ పెయింట్స్‌ వేయించుకోవచ్చు.  ఈ తరహా పెయింట్స్‌లో లీకేజీ నివారణ రసాయనాలు కలుపుతున్నారు. లీకేజీలను అరికట్టడమే కాదు తేమ లేకుండా పనిచేస్తుందని చెబుతున్నారు. గ్రీన్‌ ప్రొ హరిత ఉత్పత్తులను వాడటం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. 

* చాలామంది పై అంతస్తుల్లో రేకులు, సిమెంట్‌ షెడ్లలో ఉంటున్నారు. వీటికి తెల్లని పెయింట్‌ కోట్‌ వేసుకోవడం ద్వారా కొంత వరకు ఉపశమనం ఉంటుంది. రేకుల స్థానంలో మడ్‌రూఫ్స్‌  వేసుకోవచ్చు. ఖర్చు ఎక్కువే కానీ ఒకసారి వేస్తే కొన్నేళ్లపాటూ ఉంటుంది. వీటి కింద చల్లగా ఉంటుంది.

* శ్లాబుపై మెంబరేన్స్‌ వేసుకోవచ్చు. షీట్ల రూపంలో ఉంటాయి. తక్కువ ఖర్చుతో అయిపోతుంది.


మొక్కలతో గ్రీన్‌ రూఫ్స్‌

మిద్దెపైన మొక్కల కుండీలు పెంచుకోవడం ద్వారా.. ముఖ్యంగా బాల్కనీల్లో, కిటీకీలు, తలుపుల ఎదురుగా నిటారు మొక్కల పెంపకం ద్వారా వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. చల్లని గాలి ఇంట్లోకి ప్రసరించేలా చూసుకోవచ్చు.

* రూఫ్‌ గార్డెన్‌, కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. లాన్‌ను పెంచుకోవడం ద్వారా వేడి స్లాబు నుంచి కిందకు రాకుండా నిరోధించవచ్చు. వీటికి ఉదయం సాయంత్రం నీళ్లు పడతారు కాబట్టి చల్లగా ఉంటుంది. వీటిని పెంచుకునే ముందు వాటర్‌ లీక్‌ ఫ్రూప్‌ చేయించడం తప్పనిసరి.

* నేరుగా శ్లాబుపై కాకుండా 0.20 ఎంఎం ప్లాస్టిక్‌ షీట్‌, జియో టెక్స్‌టైల్‌ క్లాత్‌ వేసి వాటిపైన కుండీలు ఏర్పాటు చేసుకోవాలి. మేడపైన కొబ్బరిబూర, ఇసుక, ఎర్రమట్టి సమపాళ్లలో ఉండేలా చేస్తే ఎక్కువ నీటిని పీల్చుకోకుండా ఉంటాయని ఉద్యాన నిపుణులు సచిస్తున్నారు.


సౌర పలకలతో పవర్‌ రూఫ్స్‌

ఇళ్లు, బహుళ అంతస్తుల గృహ సముదాయాలపైన ఖాళీ స్థలం చాలా ఉంటుంది. మిద్దె చల్లగా ఉండాలంటే సౌర విద్యుత్తు పలకలను ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎండ వేడి నేరుగా పడకుండా కొంత వరకు సౌర పలకలు అడ్డుకుంటాయి. దీంతో గదిలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అదే సమయంలో సౌర పలకలతో ఉత్పత్తి అయిన విద్యుత్తును ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. అధిక విద్యుత్తు ఉత్పత్తి ఉంటే డిస్కం గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. నెట్‌ జీరో ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది.

ఒక కిలోవాట్‌ రూఫ్‌టాప్‌ సౌరపలకతో నెలకు 125 యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. నెట్‌మీటర్‌ కనెన్షన్‌ తీసుకుంటే గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. అవసరం ఉంటే మీరు వాడుకుంటారు.. లేదంటే గ్రిడ్‌లో కలిపేస్తారు. మీ నెలవారీ కరెంట్‌ బిల్లులో ఈ మేరకు యూనిట్లను మినహాయిస్తారు. వాడిన దానికంటే గ్రిడ్‌కు అనుసంధానం చేసిన యూనిట్లు అధికంగా ఉంటే ఆ మేరకు లెక్కకట్టి డిస్కం మీకే చెల్లిస్తుంది.

* వీటిని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇదివరకులా శ్లాబుపై కాకుండా నిర్ధారిత ఎత్తులో బిగించుకుంటే పై అంతస్తు సైతం ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. టెర్రస్‌ను అందంగా అలంకరించుకోవచ్చు కూడా.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని