Published : 14 May 2022 03:22 IST

కొంటే ఏమవుతుంది? కొనకపోతే నష్టపోతామేమో?

వ్యవసాయ ప్లాట్లపై తర్జనభర్జనలో కొనుగోలుదారులు
సిటీ బయట పెద్ద ఎత్తున అనుమతి లేని వెంచర్లు
ఫామ్‌ల్యాండ్‌ పాలసీ ఉండాలంటున్న రియల్టర్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఇళ్ల స్థలాల ధరలు పెరగడంతో పెట్టుబడి దృష్ట్యా చాలామంది ఫామ్‌ప్లాట్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. రూ.ఐదారు వేలకే చదరపు గజం వస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కొనకపోతే నష్టపోతామేమో అన్నంతగా రియల్టర్లు ప్రచారం చేస్తుండటంతో వీటివైపు ఆకర్షితులవుతున్నారు. సిటీకి 40 నుంచి 80 కి.మీ. దూరంలో ఈ తరహా పెద్ద ఎత్తున ఫామ్‌ల్యాండ్‌ వెంచర్లు వెలిశాయి. చాలావరకు అనుమతులు తీసుకోకుండానే విక్రయిస్తున్నారు. తెలిసి కొందరు, తెలియక మరికొందరు వీటిలో కొంటున్నారు. కొన్నప్పటికి ఇప్పటికీ ధరలు పెరిగాయని కొనుగోలుదారులు సంతోషంగానే ఉన్నా.. ఫామ్‌ల్యాండ్‌ వెంచర్లు అక్రమమని అధికారులు ప్రకటించినప్పుడల్లా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొత్త వెంచర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కట్టడి చేయలేనప్పుడు ఫ్యామ్‌ప్లాట్లకు సంబంధించి ప్రత్యేకంగా ఫామ్‌ పాలసీ తీసుకురావడం మేలని రియల్టర్లు కోరుతున్నారు.

స్థిరాస్తి వెంచర్లకు సంబంధించి హెచ్‌ఎండీఏ, డీటీసీపీలు అనుమతులు జారీ చేస్తుంటాయి. ఓపెన్‌ ప్లాట్లకు సంబంధించి ఎక్కువగా డీటీసీపీనే స్థిరాస్తి వ్యాపారులు ఆశ్రయిస్తున్నారు. ప్రధాన రహదారి పక్కన, కొనుగోలుదారుల నుంచి ధర ఎక్కువైనా డిమాండ్‌ ఉంటుందన్న ప్రాంతాల్లో వేస్తున్న వెంచర్లకు అనుమతులు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారికి 10 కి.మీ. లోపల,  సిటీకి యాభై కిలోమీటర్ల బయట వేస్తున్న వెంచర్లలో చాలావాటికి అనుమతులు తీసుకోవడం లేదు. ఫామ్‌ప్లాట్ల పేరుతో విక్రయిస్తు న్నారు.  కొత్తకొత్త కాన్సెప్ట్‌లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఇవి అక్రమమని అన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వీటిని కట్టడి చేసేందుకు 20 గుంటల లోపు రిజిస్ట్రేషన్లు చేయవద్దని సర్కారు స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు జారీ చేయగా.. స్థిరాస్తి వ్యాపారులు తెలివిగా ధరణిలో రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు.  ఒక గుంట (121 గజాలు) మొదలు ఐదు నుంచి ఎనిమిది గుంటల వరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు కాబట్టి సక్రమమే అని కొంటున్నారు. శంకర్‌పల్లి, చేవెళ్ల, వికారాబాద్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, ఆమన్‌గల్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌, తూప్రాన్‌, చౌటప్పుల్‌, యాదాద్రి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ తరహా వెంచర్లు ఉన్నాయి. బాహ్య వలయ రహదారి నుంచి ప్రాంతీయ వలయ రహదారి మధ్యలోనూ పెద్ద ఎత్తున వెంచర్లు వెలిశాయి.

కొవిడ్‌ అనంతరం ఎక్కువగా..

కొవిడ్‌ సమయంలో నగరవాసులు పూర్తిగా ఇళ్లకే పరిమితం అయ్యారు. శివార్లలో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవారు అక్కడికి తరలిపోయారు. మరికొందరు సొంతూళ్లకు తరలిపోయారు. తమకు ఉంటే బాగుండునని భావించినవారు ఆ తర్వాత  ఫామ్‌ల్యాండ్ల వైపు మొగ్గు చూపారు. వీటిలో ప్రతి ప్లాట్‌కు మొక్కలు, క్లబ్‌హౌస్‌లతో ఆహ్లాదంగా అభివృద్ధి చేస్తున్నారు. మరికొన్ని వెంచర్లలో ఎర్రచందనం మొక్కలు సైతం పెంచుతున్నారు. వీరు చెప్పిన స్థాయిలో రాబడులు వస్తాయని కచ్చితంగా చెప్పలేము కానీ భూమి విలువ మాత్రం తప్పక పెరుగుతుందని కొంటున్నవారు అంటున్నారు. కొందరు తమకు నచ్చిన మొక్కలను పెంచుకుంటున్నారు. ఎక్కువ భూమి తీసుకున్నవారు పండ్ల మొక్కలను పెంచుకుంటున్నారు. సెలవు రోజుల్లో ఏరువాక పౌర్ణమి,  పండగ రోజుల్లో సిటీ నుంచి ఫ్లాట్‌ కొనుగోలుదారులందరూ ఒకచోట చేరి సరదాగా గడుపుతున్నారు. వీరిని చూసి ఇతరులు కొనుగోలు చేస్తున్నారు.

నష్టపోతున్నారు...

ప్రజలంతా కొన్నాక.. అక్రమమని కూల్చేస్తున్న ఘటనలు ఉన్నాయి. దీంతో కొన్నవారు నష్టపోతున్నారు. అప్పటికే అమ్మేసిన స్థిరాస్తి వ్యాపారులు బాగానే ఉంటున్నారు. ప్రభుత్వం సైతం క్రమబద్ధీకరణ పేరుతో ఖాజానా నింపుకొంటోంది. కొన్నవారే మానసిక వ్యథ అనుభవిస్తున్నారు. ప్రజలు నష్టపోకూడదు అనుకుంటే ఫామ్‌ల్యాండ్‌ను వెంచర్ల రూపంలో విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలి. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, రెరా అనుమతి లేనివాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి ఆదాయం కూడా ముఖ్యమే కాబట్టి కనీసం ఒక పాలసీ అయినా తీసుకురావాలని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు. అప్పుడు ప్రణాళికాబద్ధంగా ఉంటుందని చెబుతున్నారు. ‘ఫ్యామ్‌ల్యాండ్‌ లేవుట్లు అంటూ ఏమీ లేవు. ఒకవేళ విక్రయిస్తున్నట్లయితే లేవుట్‌ అనుమతి తీసుకోవాలి. రెరా అనుమతి పొందిన తర్వాతే విక్రయించాలి. కానీ శివార్లలో పెద్ద ఎత్తున  ఇప్పటికే ఫ్యామ్‌ల్యాండ్‌ వెంచర్లు ఉన్నాయి. ఈ తరహా అక్రమ వ్యాపారం జరగకూడదు, ప్రణాళికారహితంగా అభివృద్ధి ఉండకూడదు అనుకుంటే డీటీసీపీ తప్పకుండా దీనిపై ఒక విధానం తీసుకోవాలి’ అని తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ జి.వి.రావు అన్నారు.

ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులు..

ఫ్యామ్‌ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి తెలంగాణ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ గత ఏడాది ఆగస్టులో కొన్ని నిబంధనలు విధించింది.

2000 చదరపు మీటర్లు(20 గుంటలు) కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్‌ చేయవద్దు.

ఫామ్‌ ప్లాట్లు కొత్త రహదారి సరిహద్దులతో ఉన్నట్లయితే లేవుట్‌ అనుమతి తప్పనిసరిగా ఉండాలి.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని