ఇంటికి స్మార్ట్‌ తాళాలు!

రాకేశ్‌ కార్యాలయం పనిమీద వైజాగ్‌ వెళ్లారు. పని ముగించుకుని హడావుడిగా హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. తెల్లవారుజామునే బస్సు దిగి ఆటోలో ఇంటికి చేరుకున్నారు. తీరా వచ్చాక చూస్తే బ్యాగులో ఇంటి

Updated : 04 Jun 2022 04:05 IST

ఈనాడు, హైదరాబాద్‌

* రాకేశ్‌ కార్యాలయం పనిమీద వైజాగ్‌ వెళ్లారు. పని ముగించుకుని హడావుడిగా హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. తెల్లవారుజామునే బస్సు దిగి ఆటోలో ఇంటికి చేరుకున్నారు. తీరా వచ్చాక చూస్తే బ్యాగులో ఇంటి తాళం చెవి కనిపించలేదు. వైజాగ్‌లోనే మర్చిపోయారు. మరో తాళం చెవి ఉన్నా అది ఇంట్లోనే ఉంది. దీంతో తాళం బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఒక్క రాకేశ్‌నే కాదు తరచూ ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతుంటాయి.

* శ్వేత ఉదయం కార్యాలయానికి వెళ్లేటప్పుడు తాళం చెవి వెంట తీసుకెళుతుంది. ఆ తర్వాత అమె భర్త ఇంటికి తాళం వేసి కార్యాలయానికి వెళతారు. అప్పుడప్పుడు శ్వేత ఉదయం పూట హడావుడిగా అఫీసుకు వెళ్లే తొందరలో కొన్నిసార్లు తాళం చెవి మర్చిపోవడం... భర్త వచ్చే వరకు రాత్రివేళ ఇంటి బయట ఎదురుచూపులు తప్పడం లేదు. నెలకోసారైనా ఇలాంటిది ఎదురవుతోంది.

ఇళ్లు, ఇళ్ల డిజైన్‌, ఇంటీరియర్స్‌ అన్నీ మారిపోయాయి.. ఇంటి తాళం మారకపోతే ఎలా? ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా స్మార్ట్‌ డోర్‌ లాక్స్‌ వచ్చాయి. హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న పలు ఆకాశహర్మ్యాల ప్రాజెక్టుల్లో ఇప్పుడు ఈ తరహా ఆధునిక తాళాలు వాడుతున్నారు. సంప్రదాయ పద్ధతిలో తాళం చెవులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. మర్చిపోయిన సందర్భంలో ఇంటి యాజమానులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డిజిటల్‌ స్మార్ట్‌ లాక్స్‌తో ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నాయి స్మార్ట్‌ లాక్స్‌ తయారీ సంస్థలు. సౌకర్యమే కాదు వీటితో భద్రత కూడా ఎక్కువే అని చెబుతున్నారు.

ఇలా పనిచేస్తుంది..
* స్మార్ట్‌ డోర్‌ లాక్స్‌ ఇంట్లోని కుటుంబ సభ్యుల బయోమెట్రిక్‌తో పనిచేస్తాయి.
* ముందుగా కుటుంబ సభ్యుల వేలిముద్రలను స్మార్ట్‌ డోర్‌ లాక్‌లో నిక్షిప్తం చేస్తారు.

* తాళంపై వేలి ముద్ర వేయగానే తలుపులు తెరుచుకుంటాయి.
* యాప్‌ సాయంతోనూ పనిచేస్తాయి. ఇంటి యాజమానులు ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి ఆపరేట్‌ చేయవచ్చు.

* ఇంట్లో లేనప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినా, పాఠశాలల నుంచి పిల్లలు వచ్చినా యాప్‌ సాయంతోనే తాళం తీయవచ్చు.
* బహుళ విధాలుగా వాడుకోవచ్చు. వేలిముద్రతో పాటూ ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డు, రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేస్తాయి.


అప్రమత్తం చేస్తుంది

* స్మార్ట్‌ డోర్‌ లాక్స్‌తో భద్రత ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.
* డోర్‌ సెన్స్‌ టెక్నాలజీ  ఉంటుంది. తాళం సరిగ్గా వేయకపోతే హెచ్చరిస్తుంది.
* ఇతరులు ఎవరైనా తాళం తీసే ప్రయత్నం చేస్తే అలారం మోగుతుంది. యజమానులను అప్రమత్తం చేస్తుంది.

మిగతా వాటికి
* ప్రధాన ద్వారం వరకే స్మార్ట్‌ లాక్‌ను పరిమితం చేయవచ్చు. అవసరం అనుకుంటే ఇంట్లోని పడక గదులకు, వార్డ్‌రోబ్‌లకు సైతం బిగించుకోవచ్చు.
* ఇంట్లో విలువైన ఆభరణాలు, పత్రాలను దాచుకునేందుకు లాకర్లు వినియోగిస్తున్నారు. ఇవి సైతం స్మార్ట్‌ లాక్స్‌తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
* లాక్స్‌ను బట్టి ధరలు చెబుతున్నారు. డోర్‌ లాక్స్‌ రూ.పదివేల నుంచి రూ.75వేల వరకు ఉంటే వార్డ్‌రోబ్‌ తాళాలు రూ.3వేల నుంచి లభిస్తున్నాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని