Updated : 09 Jul 2022 13:02 IST

అక్కడే డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌

ఐటీ విస్తరణను సిటీలోని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా ఆశించిన మేర పురోగతి లేదని.. ఇప్పటికీ పశ్చిమ హైదరాబాద్‌లోని కార్యాలయాలకే డిమాండ్‌ ఉందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసీసీఐ)తో కలిసి వెస్టియన్‌ సంస్థ రూపొందించిన తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా కార్యాలయ నిర్మాణాల్లో అభివృద్ధి చెందుతున్న పోకడలను నివేదికలో చర్చించింది.
దేశంలో ప్రధాన ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్‌ అవతరించింది. క్రమంగా మరింతగా అభివృద్ధి చెందుతూ ఉంది. మెరుగైన మౌలిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణం హైదరాబాద్‌కు కలిసొచ్చిన అంశాలు. ఐటీనే కాదు బయో టెక్నాలజీ, హార్డ్‌వేర్‌, ఫార్మా, టెలీ కమ్యూనికేషన్‌ రంగాలు సిటీలో ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ రియాల్టీకి ఊతంగా నిలుస్తున్నాయి.

నివేదికలో ముఖ్యాంశాలు..
* గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్‌రాంగూడ వంటి ప్రాంతాలు కార్యాలయాల డిమాండ్‌లో అగ్రగామిగా కొనసాగుతున్నాయి. ఇక్కడ 90 శాతం గ్రేడ్‌ ఏ కార్యాలయ నిర్మాణాలు ఐటీ, ఐటీఆధారిత రంగాలు, ఇతర రంగాలు కోరుకున్నట్లుగా లభ్యత ఉంది.
* పశ్చిమ హబ్‌కు దూరంగా నగరమంతటా సమాన అభివృద్ధి ఉండేలా కార్యాలయాల నిర్మాణాల కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ.. తూర్పు, దక్షిణం వైపు మార్కెట్లలో పెద్దగా కదలిక లేదు.
* ఆఫీసు స్పేస్‌ లీజింగ్‌లో క్షీణత ఉన్నప్పటికీ.. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలతో హైదరాబాద్‌ ఆఫీసు మార్కెట్‌ డిమాండ్‌ను 2021 ద్వితీయార్థంలో కొనసాగించింది.
* గతేడాది ద్వితీయార్థం ఇంజినీరింగ్‌/ఉత్పత్తి రంగాలు ప్రధాన లీజింగ్‌ దశకు చేరాయి. వీటి వాటా ఐటీ రంగాల కంటే మించిపోయింది. హార్డ్‌వేర్‌ రంగం అధిక వాటాగా ఉంది.
*  కొవిడ్‌ సమయంలో ఐటీ కంపెనీలు విస్తరణ ప్రణాళికలను వాయిదా వేసినప్పటికీ వాటిలో చాలావరకు కొనసాగింపు చర్యగా కార్యాలయ నిర్మాణాలను తీసుకోవడాన్ని ఎంచుకున్నాయి. కో వర్కింగ్‌ ఆపరేటర్ల విభాగం వాటా 2021 నుంచి గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ప్రథమార్థంలో 24 శాతం వాటా నమోదైంది.

ప్రభావిత అంశాలు..
* కొవిడ్‌ తర్వాత మార్కెట్‌ పుంజుకోవడానికి మౌలిక సదుపాయల అభివృద్ధికి పెద్దపీట వేయడం ప్రధాన ఉత్ప్రేరకంగా పనిచేసింది.
* డేటా సెంటర్లకు ఇన్‌ఫ్రా హోదా ఇవ్వడం. సెజ్‌ నిబంధనలను పునర్‌నిర్వచించడం వంటి విధాన నిర్ణయాలు కార్యాలయ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపించాయి.
* 2021లో దాదాపు 30 కంపెనీలు 3.6 లక్షల కొత్త ఉద్యోగులను చేర్చుకున్నాయి. అగ్రశ్రేణి కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, హెచ్‌సీఎల్‌, టెక్‌ మహేంద్ర సంస్థలు 2.3 లక్షల ఫ్రెషర్లకు ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. వీరి కోసం అవసరమైన 1.85 కోట్ల చదరపు అడుగుల కార్యాలయాలను లీజింగ్‌ తీసుకోవడానికి దోహదం చేశాయి.
* సుస్థిరతకు ప్రాధాన్యం ఇవ్వడంతో హరిత భవనాలు, మౌలిక సదుపాయలపై పెట్టుబడి గణనీయంగా పెరిగింది. సంప్రదాయ నిర్మాణాలతో పోలిస్తే హరిత భవనాలల్లో అద్దెలు సైతం అధికంగా వస్తాయి. విక్రయ ధర సైతం అధికంగా ఉంటుంది.
* కో వర్కింగ్‌ స్పేస్‌లు ప్రారంభంలో అంకుర సంస్థలు అద్దెకు తీసుకోగా.. ద్వితీయ శ్రేణి నగరాల్లో పెద్ద సంస్థలు లీజింగ్‌కు తీసుకుంటుండటంతో వీటికి ప్రాధాన్యం పెరిగింది.

 


పని సంస్కృతి మారుతోంది
దేశంలో మారుతున్న పని సంస్కృతి వాతావరణాన్ని మేం గమనించాం. ఆఫీస్‌ స్పేస్‌లో అభివృద్ధి చెందుతున్న పోకడలను నివేదికలో పొందుపర్చారు. ఇది రియల్టర్లకు మాత్రమే కాకుండా స్థిరాస్తుల కొనుగోలుదారులకు, ప్రభుత్వానికి, పరిశోధన, విద్యాసంస్థలకు, పరిశ్రమకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మారుతున్న అవసరాలకు తగ్గట్టు రెగ్యులేటరీలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి దోహదం చేస్తుంది.

- సంజయ్‌దత్‌, ఎం.డి., టాటా రియల్టీ; సంయుక్త కార్యదర్శి, ఎఫ్‌ఐసీసీఐ రియల్‌ ఎస్టేట్‌ కమిటీ


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని