బడ్జెట్‌లో ఇల్లు కట్టుకుందాం..!

స్టీల్‌ ధర కొంత దిగి వచ్చింది. సిమెంట్‌ బస్తా ధర సాధారణంగానే ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం అనంతరం వీటి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో చాలావరకు నిర్మాణాలను వాయిదా వేశారు. వీటి ధరలు తగ్గడంతో ప్రస్తుతం మళ్లీ పనులు పుంజుకున్నాయి. వర్షాలతో మధ్యలో ఆటంకాలు ఉన్నా..

Updated : 16 Jul 2022 09:33 IST

నిర్మాణ వ్యయం తగ్గించుకునే మార్గాలు సూచిస్తున్న ఇంజినీర్లు
ఈనాడు, హైదరాబాద్‌

స్టీల్‌ ధర కొంత దిగి వచ్చింది. సిమెంట్‌ బస్తా ధర సాధారణంగానే ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం అనంతరం వీటి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో చాలావరకు నిర్మాణాలను వాయిదా వేశారు. వీటి ధరలు తగ్గడంతో ప్రస్తుతం మళ్లీ పనులు పుంజుకున్నాయి. వర్షాలతో మధ్యలో ఆటంకాలు ఉన్నా.. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఆషాఢం తర్వాత పనులు మొదలెట్టే ప్రణాళికలో ఉన్నారు. పక్కా ప్రణాళికతో చేపడితే అనుకున్న బడ్జెట్‌లో కొత్త ఇంటిని పూర్తిచేసుకోవచ్చు అంటున్నారు ఇంజినీర్లు.
నిర్మాణ సామగ్రి ధరలు కొన్ని దిగి వచ్చినా.. మరికొన్ని గతం కంటే భారీగా పెరిగాయి.  ఇసుక ధరలు కాలాన్ని బట్టి మారుతున్నాయి. నిర్మాణ కూలీల ధరలు సైతం పెరిగాయి. మొత్తంగా చూస్తే చదరపు అడుగుకు రూ.1800 వరకు వ్యయం అవుతుందని నిర్మాణదారులు అంటున్నారు. మార్కెట్లో నిర్మాణ సామగ్రి ధరల హెచ్చుతగ్గులను బట్టి ఇది కొంత తగ్గవచ్చు లేదంటే పెరగవచ్చు అని చెబుతున్నారు. స్టీల్‌ టన్ను ధర ప్రస్తుతం రూ.65వేల నుంచి రూ.68వేల వరకు ఉంది. బ్రాండెడ్‌ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. సిమెంట్‌ బస్తా రూ.350 నుంచి చెబుతున్నారు. ఒక దశలో రూ.400 వరకు కూడా వెళ్లింది. ఈ ధరలు ఇళ్లు కట్టుకునేవారి చేతిలో ఉండవు కాబట్టి వాటి గురించి కంటే.. ఎక్కడ వృథా అవుతుందో తెలుసుకుని ఆ మేరకు ఖర్చు తగ్గించుకోవాలని ఇంజినీర్లు సూచిస్తున్నారు.

పక్కా ప్రణాళిక..
సొంతంగా ఇళ్లు కట్టుకునేవారు పక్కా ప్రణాళికతో పనులు మొదలు పెడితే చాలావరకు వృథా ఖర్చు తగ్గించుకోవచ్చు. సొంతంగా డ్రాయింగ్స్‌ గీయడం, మేస్త్రీ మీదనే పూర్తిగా వదిలిపెట్టడం కాకుండా అనుభవం కలిగిన ఇంజినీర్ల నుంచి ఇంటి ప్లాన్‌ గీయించుకోవాలి. వీరి ఫీజుకు భయపడి చాలామంది సొంత ప్రయోగాలు చేస్తుంటారు. రెడీమేడ్‌ ప్లాన్ల వైపు మొగ్గు చూపుతుంటారు. అలా కాకుండా  ఇంజినీరును సంప్రదిస్తే  మీ ఆలోచనలకు అనుగుణంగా  ఇంటి ప్లాన్‌ ఇస్తారు. స్ట్రక్చరల్‌ డిజైన్స్‌ ఇస్తారు. పునాదులు, కాలమ్స్‌, బీమ్స్‌ ఎక్కడెక్కడ వస్తాయి? ఎంత స్టీల్‌ పడుతుంది? సిమెంట్‌, ఇసుక, ఇటుకల అవసరం ఎంత ఉంటుందనేది సవివరంగా చెబుతారు. ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణం చేపడితే బడ్జెట్‌లోపే వ్యయాన్ని పరిమితం చేయవచ్చు.
నిర్మాణానికి  ముందే..
కాలమ్స్‌, బీమ్స్‌, శ్లాబ్స్‌, గోడలు కట్టిన తర్వాత కూడా చాలామంది మార్పులు చేర్పులు చేస్తుంటారు. శ్లాబ్స్‌ కొంత భాగం తొలగించడం,  కట్టిన గోడలు పగలగొట్టి మళ్లీ కట్టడం  సర్వ సాధారణంగా జరుగుతుంటాయి. వీటితోనూ కొంత ఖర్చు పెరుగుతుంది. ప్లాన్‌ ప్రకారమే కట్టాలని మేస్త్రీకి స్పష్టంగా చెప్పండి. ఒకవేళ మార్పులుంటే కుటుంబ సభ్యులందరూ కలిసి ముందే నిర్ణయించుకుని ఆ మేరకు గోడలు కట్టకముందే మార్పులు చేర్పులు చేసుకోవడం మేలు. వాస్తు లేదని కూడా కూల్చేస్తుంటారు. అనుమానాలు ఉంటే వాస్తు నిపుణులను నిర్మాణానికి ముందే సంప్రదించండి. ప్రస్తుతం ఇంజినీర్లు ఇస్తున్న ప్లాన్లు సైతం వాస్తును పరిగణనలోకి తీసుకునే ఇస్తున్నారు.

 


చదరపు అడుగుకు రూ.200 వరకు తగ్గించుకోవచ్చు
- సీహెచ్‌ రాంచంద్రారెడ్డి, ఛైర్మన్‌, క్రెడాయ్‌ తెలంగాణ

* సామగ్రి వృథాను సాధ్యమైనంత వరకు తగ్గేలా చూసుకోవాలి. సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ చేసేటప్పుడు 10 నుంచి 20 శాతం వృథా అవుతుంది. ఇది 8 శాతం మించరాదు. కింద పడిన సిమెంట్‌ను కొన్నిచోట్ల తిరిగి వాడుకోవచ్చు.
* టైల్స్‌ వృథా ఎక్కువగా ఉంటుంది. 2 శాతం వరకు ఫర్వాలేదు. కానీ 10 శాతం అవుతోంది. దీన్ని తగ్గించుకోవాలి.
* శ్లాబ్‌ పనులు, ఫ్లోరింగ్‌లో కాంక్రీట్‌ను వృథా చేయకుండా లింటెల్‌, సన్‌షేడ్‌ వంటి వాటిలో వాడుకునేలా చూసుకోవాలి.
* ఇటుకలు కూడా వృథా కాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు వాడుకునే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం నిర్మాణ సమయంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.
* అవసరమైన చోట రోబో సాండ్‌, మరికొన్నిచోట్ల నది ఇసుక ఇలా వాడుకోవడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు.  
* ఎలక్ట్రిక్‌ పైపులు స్లాబులోనే సాధ్యమైనంతగా వేసుకునేలా చూడాలి. గోడల్లో వేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. రెండింతల పని, ఎక్కువ పైపులు అవసరం పడతాయి.
* కన్సల్టెంట్‌ను పెట్టుకోవడం ద్వారా చాలా వృథా ఖర్చు తగ్గుతుంది. ప్లాస్టరింగ్‌ ఎంత మందం ఉండాలో అంతే ఉండేలా.. ఎక్కడ వైరింగ్‌ అనేది సైతం ముందే పక్కాగా సూచిస్తారు. మధ్యలో పర్యవేక్షిస్తారు.
* మొత్తంగా చదరపు అడుగుకు రూ.150 నుంచి రూ.200 వరకు ఆదా అవుతుంది. ఆ మేరకు నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.

తూకంలో మోసాలపై జాగ్రత్త
సామగ్రి ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యమైన వస్తువులు వాడటం మేలు. అదే సమయంలో స్టీల్‌, ఇసుక, ఇటుకల విషయంలో తూకాల్లో, అంకెల్లో వర్తకులు ఎక్కువగా గోల్‌మాల్‌ చేస్తుంటారు జాగ్రత్త. మార్కెట్లో ఆయా వస్తువులకు ఏం ధర ఉందో ముందు కనుక్కోండి. సగటు ధరల్లో ఎవరిస్తే వారి వద్ద కొనుక్కోవచ్చు. కొంతమంది అందరికి కంటే తక్కువ ఇస్తామని చెప్పి తూకాల్లో మోసం చేస్తున్నారు. వే బ్రిడ్జీతో చేతులు కలిపి వీరు ఇందుకు పాల్పడుతున్నారు. 20 టన్నుల ఇసుక కొంటే 12 టన్నులు కూడా ఉండదు.  ఇటుకలైతే లారీలో వెయ్యి ఇటుకలు తక్కువ లోడ్‌ చేయడమో లేక.. లారీ అడుగు భాగంలో మిగుల్చుకోవడమో చేస్తున్నారు. స్టీల్‌ తూకాల్లోనూ భారీ మోసాలు ఉంటున్నాయి. నాణ్యతతో పాటూ వీటిపైనా దృష్టి పెట్టాలి. వీటి కొనుగోలులో అనుభవం ఉన్నవారిని వెంట తీసుకెళ్లడం మేలు. లేకపోతే ఇక్కడ రూ.లక్ష వరకు అదనపు భారం పడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని