Updated : 16 Jul 2022 04:54 IST

మిద్దె తోటను సిద్ధం చేసుకోండిలా..

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లపైన మొక్కలు పెంచుకునేందుకు ఇదే సరైన సమయం. మిద్దె మీద స్థలాన్ని బట్టి పూల కుండీలు, మడుల్లో పూలు, కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచుకోవచ్చు. అంతకంటే ముందు రూఫ్‌ని వాటర్‌ ప్రూఫింగ్‌ చేయించాలి.
* మడులు కూడా కట్టుకోవచ్చు. నేరుగా శ్లాబుపై కాకుండా ఒక అడుగు ఎత్తు వదిలి మడులు నిర్మించుకోవచ్చు. నాలుగు అడుగుల పొడవు, వెడల్పుతో ఏర్పాటు చేసుకోవచ్చు. లోతు 8 అంగుళాలు ఉంటే సరిపోతుందని మిద్దెతోట నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో  ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే కాకుండా పండ్ల మొక్కలను సైతం ఎంచక్కా పెంచుకోవచ్చు అంటున్నారు. బొప్పాయి వంటి  మొక్క సైతం పెరుగుతుందని చెబుతున్నారు.
* ఇంటి మేడపైన స్థల లభ్యతను బట్టి ఎన్ని మడులైనా కట్టుకోవచ్చు. మొత్తం బరువు ఒకే దగ్గర కాకుండా కాలమ్స్‌, బీమ్స్‌ను బట్టి ఏర్పాటు చేసుకోవడం మేలు.  వ్యయం ఎక్కువైనా శాశ్వతంగా ఉంటుంది. మడుల్లో ఎక్కువైన నీరు వెళ్లేలా డ్రైన్ల ఏర్పాటు  ఉండాలి.


ఇకపై ప్రామాణిక కేటాయింపు పత్రం

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మహారాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) గుర్తింపు పొందింది. నిర్మాణదారులతో స్థిరాస్తి కొనుగోలుదారులకు ఏర్పడిన వివాదాలు పరిష్కరించడంలో ముందు వరసలో ఉంటుంది. పారదర్శకత పెంచేందుకు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాలను తగ్గించేందుకు ప్రామాణిక కేటాయింపు పత్రాలను ప్రవేశపెట్టింది. కొనుగోలుదారుడు ఎవరైనా బిల్డర్‌ వద్ద ఫ్లాట్‌, విల్లా కొనుగోలు  చేస్తే.. ఎప్పటికి అందజేస్తారు? పార్కింగ్‌ కేటాయింపు ఎక్కడ? ఒకవేళ బుకింగ్‌ రద్దు చేసుకుంటే ఎంత శాతం రుసుం చెల్లించాలి? వంటి వివరాలన్నీ ప్రామాణిక కేటాయింపు పత్రంలో బిల్డర్‌ పేర్కొనాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ప్రామాణికంగా లేకపోవడంతో  బిల్డర్లు  ఎవరికి వారు తమకు అనుకూలంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు.కొనుగోలుదారులు సైతం కొన్నిసార్లు బుకింగ్‌లు రద్దు చేసుకుంటున్నారు. సొమ్ము వెనక్కి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వీటిపై మహా రెరాలో ఫిర్యాదులు పెరిగాయి.  దీంతో ప్రామాణిక కేటాయింపు పత్రాన్ని ప్రవేశపెట్టింది. ప్రాజెక్ట్‌ను రెరాలో రిజిస్టర్‌ చేసేటప్పుడే ఈ లేఖను పొందుపర్చాలి. వివరాలు అందజేయపోతే దరఖాస్తును తిరస్కరిస్తారు. ప్రాజెక్ట్‌ వ్యయంలో 5 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts