యూరోపియన్‌ శైలిలో ఇళ్లు

నగరంలో కొన్ని ఇళ్లు, కాలనీలు చూడగానే ఆకట్టుకుంటాయి. భిన్నమైన నిర్మాణ శైలే అందుకు కారణం. ఇప్పుడంటే ఎంతో విలాసంగా నిర్మాణాలు చేపడుతున్నారు. విదేశీ హంగులు అద్దుతున్నారు. సరికొత్త థీమ్‌లతో విల్లాలు కడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితమే యూరోపియన్‌ శైలిలో

Updated : 23 Jul 2022 09:24 IST

రెండు దశాబ్దాల క్రితమే నగరానికి పరిచయం

ఈనాడు, హైదరాబాద్‌ - కంటోన్మెంట్, న్యూస్‌టుడే 

నగరంలో కొన్ని ఇళ్లు, కాలనీలు చూడగానే ఆకట్టుకుంటాయి. భిన్నమైన నిర్మాణ శైలే అందుకు కారణం. ఇప్పుడంటే ఎంతో విలాసంగా నిర్మాణాలు చేపడుతున్నారు. విదేశీ హంగులు అద్దుతున్నారు. సరికొత్త థీమ్‌లతో విల్లాలు కడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితమే యూరోపియన్‌ శైలిలో వరస ఇళ్ల నిర్మాణాన్ని నగరానికి పరిచయం చేసింది ఒక నిర్మాణ సంస్థ. సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడుపల్లిలోని ఏఓసీ కేంద్రానికి సమీపంలోని వెల్లింగ్‌టన్‌ కాలనీతో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రయోజనాలను ఎంతో ముందుగానే నగరవాసులకు పరిచయం చేసింది.  

యూరోపియన్‌ తరహా ఇళ్లలో పైకప్పులు ప్రత్యేకంగా ఉంటాయి. కప్పు ఏటవాలుగా, పొడవైన కిటికీలు, ఆర్చ్‌ ఓపెనింగ్‌తో చూడగానే ఆకట్టుకునే శైలిలో కనిపిస్తుంటాయి. ఆయా దేశాల్లో సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచు కురుస్తుంది. అది ఇళ్లపై పేరుకు పోకుండా కిందకు జారిపోయేలా ఈ తరహా ఇళ్లు కట్టుకుంటారు. విదేశాలకు వెళ్లినప్పుడు మనవాళ్లను ఈ తరహా ఇళ్లు ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. సొంతంగా ఇల్లు ఇలా కట్టుకోవాలని చాలామంది కలలు కంటుంటారు కూడా. వ్యక్తిగతంగా కట్టుకున్నవారు సైతం అక్కడక్కడ సిటీలో కనిపిస్తుంటారు. ఒక కమ్యూనిటీగా మాత్రం వెల్లింగ్‌టన్‌ కాలనీ ఇప్పటికీ ప్రత్యేకత చాటుతోంది. 

అభిరుచితో.. 

మేఘనా కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత సుబ్బారావు 1998లో యూరోపియన్‌ తరహాలో ఇళ్లు నిర్మించారు. ఇక్కడ మొత్తం 15 భవనాల్లో 29 విల్లాలు కనిపిస్తాయి. మనకు మంచు కురియకపోయినా.. వేసవిలో ఎండలు అధికంగా ఉంటాయి. బల్లపరుపుగా ఉండే శ్లాబుపై వేడి నిటారుగా పడుతుంది. ఇక్కడ పైకప్పు ఏటవాలుగా ఉండటమే కాదు టైల్స్‌ అమరికతో వేడిని అంతగా లోపలికి రానివ్వదు. చల్లగా ఉంటుందని న్యూజిలాండ్‌లోని వెల్లింగ్‌టన్‌ నగరంలోని ఇళ్ల స్ఫూర్తితో ఇక్కడ నిర్మించారు.

చిన్నదే అయినా.. 

ఇంటి విస్తీర్ణం తక్కువే. 220 చదరపు అడుగుల్లో డూప్లెక్స్‌ ఇళ్లను ఇక్కడ నిర్మించారు. అన్నీ కూడా ఒకే విధంగా వరసగా కట్టడం ఎక్కువ మందికి నచ్చుతోంది. రెండేసి విల్లాలు కలిపి ఒక నిర్మాణంగా చేపట్టారు. ప్రహరీ ఉమ్మడిగా ఉంటుంది. ముందువైపు ప్రహరీ అడ్డుగోడలు లేకుండా పచ్చదనం పెంచేలా ఏర్పాట్లు చేశారు. కారు నిలిపేలా స్థలం ఇచ్చారు. చూడగానే విదేశాల్లో ఉన్నామనే భావన కలిగేలా రహదారులు, వీధి దీపాలు సాదర స్వాగతం పలుకుతుంటాయి. పూల చెట్లు, పక్షుల కిలకిలారావాలు నివాసితులకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి.

మరెన్నో విశేషాలు 

ప్రతి ఇంటిపై సౌర విద్యుత్తు పలకలను ఏర్పాటు చేసుకున్నారు. కేంద్రీకృత శీతలీకరణ యంత్రాలు(సెంట్రలైజ్డ్‌ కూలర్స్‌) ఏర్పాటుతో ఎక్కువ శాతం ఏసీలను వాడాల్సిన అవసరం ఉండదు. విద్యుత్తు, ఇంటర్‌నెట్‌ కేబుళ్లు అన్నీ ప్రతి ఇంటికి భూగర్భం ఆధారంగా వేశారు. ఎక్కడా తీగలు వేలాడుతూ కనిపించవు. 

ఒక్క మాటపై... 

ఇంటి యజమానులు తమ కాలనీ సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఒకేమాట.. ఒకే బాట అంటున్నారు. పాతికేళ్లు అవుతున్నా నిర్మాణాల ఎలివేషన్‌ మార్చకుండా కాలనీ విశిష్ఠతను కాపాడుతూ వస్తున్నారు. రహదారులపై ఎక్కడా వాహనాలు నిలపరు. కార్లు శుభ్రం చేసేందుకు పైపులతో నీటిని వృథా చేయకుండా బకెట్‌ నీటితో శుభ్రం చేసుకుంటారు.  ఉదయాన్నే అంతర్గత రహదారులపై నడక సాగిస్తుంటారు. జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి పరిష్కరించుకుంటారు. ఉమ్మడి కుటుంబంలా నివసిస్తూ మిగతా కమ్యూనిటీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

చూస్తామని వస్తుంటారు 

- సుబ్రహ్మణ్యం, జనరల్‌ సెక్రటరీ, వెల్లింగ్టన్‌ కాలనీ

నగరంలో ఇప్పుడు ఎన్నో విల్లా ప్రాజెక్టులు వచ్చాయి. దాదాపు పాతికేళ్ల క్రితం మా కమ్యూనిటీ ఏర్పాటైంది. మామూలుగా అయితే ఇన్నేళ్లలో భవనాల రూపురేఖలు మార్చేస్తుంటారు. బయట ఎలివేషన్, కామన్‌ ఏరియా విషయంలో మార్పులు లేకుండా జాగ్రత్త పడుతున్నాం. సొసైటీ నిర్ణయానికే కట్టుబడి అందరూ సహకరిస్తున్నారు. కమ్యూనిటీ అభివృద్ధికి సంబంధించి ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికయ్యే కమిటీ చూస్తుంటుంది.  నీటి కొరత లేకుండా నాలుగేళ్ల క్రితం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి విల్లాపై వర్షాకాలంలో 2 లక్షల లీటర్ల నీరు కురుస్తుంది. దీన్ని ఒడిసి పట్టుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. సైన్యంలో పనిచేసిన వారు, వైద్యులు, క్రికెటర్లు ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటున్నారు.  విశాలమైన ఇంటి కోసం ఇక్కడ ఇల్లు అమ్ముతున్నారని తెలియగానే లోలోపలే అమ్ముడవుతుంటాయి. కమ్యూనిటీ ప్రత్యేకత దృష్ట్యా వీక్షించేందుకు, సినిమాలు, సీరియల్స్‌ షూటింగ్‌ చేసేందుకు అడుగుతుంటారు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని