సొంతింటితోనే స్వేచ్ఛ

శ్రావణంలో మంచి ముహూర్తాలు ఉండటంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున నూతన గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇదివరకే కొనుగోలు చేసినవారు ఇప్పుడు సొంతింట్లోకి అడుగు పెడుతున్నారు. మీరూ త్వరలో ఓ ఇంటివారు కావాలంటే ఇప్పుడే మంచి తరుణం

Updated : 13 Aug 2022 05:58 IST

ఈనాడు, హైదరాబాద్‌

శ్రావణంలో మంచి ముహూర్తాలు ఉండటంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున నూతన గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇదివరకే కొనుగోలు చేసినవారు ఇప్పుడు సొంతింట్లోకి అడుగు పెడుతున్నారు. మీరూ త్వరలో ఓ ఇంటివారు కావాలంటే ఇప్పుడే మంచి తరుణం అంటున్నాయి నిర్మాణ సంస్థలు. నిర్మాణం పూర్తై గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు మార్కెట్లో ప్రస్తుతం చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. నిర్మాణంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు సైతం ప్రారంభం అవుతున్నాయి. 2025 నాటికి అందుబాటులోకి వస్తాయి.  బడ్జెట్‌ను బట్టి నచ్చిన ప్రాజెక్టును ఎంపిక చేసుకోవచ్చు. మూడు నెలల నుంచి మార్కెట్‌ మందకొడిగా ఉండటంతో కొనుగోలుదారుల కోసం నిర్మాణదారులు ఎదురుచూస్తున్నారు. నిజంగా ఇల్లు కొనే ఉద్దేశం ఉన్న కొనుగోలుదారులకు ఆయా సంస్థలు ధరలో కొంత తగ్గింపు ఇవ్వడానికి సైతం సిద్ధపడుతున్నాయి. అద్దె ఇంటి ఇబ్బందుల నుంచి విముక్తి పొంది సొంతింట్లో స్వేచ్ఛగా జీవించాలంటే ఇక ఆలస్యంవద్దంటున్నారు నిర్మాణదారులు.

ఆలస్యం చేసే కొద్దీ ఏటేటా ఇంటి ధరలు పెరగడం తప్ప తగ్గిన దాఖలాలు హైదరాబాద్‌ మార్కెట్లో పెద్దగా లేవు. ఇంటి ధరలతో పాటూ గృహ రుణ వడ్డీరేట్ల పెంపుతో కొనుగోలుదారులు వెనకా ముందు ఆడుతున్నారు. ఈ కారణంగా మార్కెట్‌ దూకుడు కొంత తగ్గింది. కొనేవారికి  ఇదే అనువైన సమయం. పెట్టుబడి దృష్ట్యా రెండు మూడేళ్లలో రాబడి రెండింతలు కావాలని చూసేవారు మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు కొంటారు. ధరలు పెరగగానే అమ్మేసి సొమ్ములు చేసుకుంటారు. మీరు కొనేది రాబడి దృష్ట్యా కాదు కాబట్టి మార్కెట్‌ స్తబ్ధుగా ఉన్నప్పుడు, తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ద్వారా బేరమాడటానికి అవకాశం ఉంటుంది. కొద్దిరోజులు కాగానే మార్కెట్‌ పుంజుకుని ధరలు మరింత పెరుగుతాయి. నోట్ల రద్దు తర్వాత, కొవిడ్‌ తర్వాత ఇంటి ధరలు ఏ రీతిన పెరిగాయో తెలిసిందే కదా. ఇప్పుడు తగ్గిన మార్కెట్‌ ఎన్నికల తర్వాత దూకుడు ప్రదర్శిస్తుంది. ఆలోపే నచ్చిన ప్రాజెక్టులో బేరమాడి కొనుగోలు చేయడం మేలు. బిల్డర్లు కొన్ని ప్రాజెక్టుల్లో తగ్గించడానికి సముఖంగా ఉన్నారు.

* ఇల్లు కొనేటప్పుడు మొదట ఎంత బడ్జెట్‌ వరకు అనేది నిర్ణయించుకోవాలి. వచ్చే  ఆదాయం ఎంత? ఎంతవరకు డౌన్‌పేమెంట్‌ చెల్లించగలరు? రుణం ఎంతవస్తుంది? ఈఎంఐ ఎంతవరకు కట్టగలరు? వీటిని బట్టి  నిర్ణయించుకోవచ్చు.

* బడ్జెట్‌పై స్పష్టత వచ్చాక ఆ ధరల శ్రేణిలో ఎక్కడ ఇళ్లు, ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయో చూడాలి.  అర కోటి లోపల ఇళ్లు ఎక్కువగా శివార్లలో నిర్మాణంలో ఉన్నాయి. పశ్చిమ హైదరాబాద్‌ మినహా ఉత్తర, దక్షిణ, తూర్పు హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఈ తరహా ఇళ్ల లభ్యత ఉంది. పని ప్రదేశానికి ఎంత దూరం? భవిష్యత్తులో అక్కడ వృద్ధి ఉంటుందా? అనే విషయాలను బేరీజు వేసుకోవాలి.

* వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్, గేటెడ్‌ కమ్యూనిటీ..ఇలా చాలా అవకాశాలు కొనుగోలుదారుల ముందున్నాయి. వీటిల్లో దేంట్లో ఇల్లు తీసుకోవాలనేది కూడా ముందే నిర్ణయించుకోవాలి. లేకపోతే బడ్జెట్‌ ఒకటి ఉంటే చూసే ఇల్లు మరోటి ఉంటుంది. ఎప్పటికీ కొనలేరు. రూ.అర కోటి లోపు అయితే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ శివార్లలో వస్తుంది. కొద్దిగా ఎక్కువ మొత్తం సమకూర్చుకోగల్గితే గేటెడ్‌ కమ్యూనిటీలో కొనుగోలు చేయవచ్చు. ఇంకొంచెం ఎక్కువ దూరం వెళితే వ్యక్తిగత ఇళ్లు సైతం ఈ బడ్జెట్‌లో దొరుకుతాయి.  ఐటీ కారిడార్‌లో కొనాలంటే రూ.కోటి పైన సిద్ధం చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని