Updated : 27 Aug 2022 08:01 IST

5జీ... రియల్‌

నిర్మాణ రంగంలో వేగం పెరిగేందుకు దోహదం

సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సన్నద్ధమవుతున్న బిల్డర్లు  

ఈనాడు, హైదరాబాద్‌: 5జీ సేవలు అందుబాటులోకి వస్తే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ప్రస్తుతం వినియోగిస్తున్న 4జీ సేవలతో పోలిస్తే ఎన్నో వందల రెట్లు అధిక వేగంతో పనిచేసే 5జీతో స్థిరాస్తి రంగం రూపురేఖలే పూర్తిగా మారనున్నాయని  యువ బిల్డర్లు అంటున్నారు. ఇప్పటితో పోలిస్తే నిర్మాణాల వేగం గణనీయంగా పెరుగుతుందని.. సైట్‌లో పనుల పర్యవేక్షణ, కొనుగోలుదారుల సందర్శనలో కొత్త మార్పులు చూస్తారని.. ఈ మార్పులకు సిద్ధపడితేనే పోటీలో ముందుంటామని వారు చెబుతున్నారు.

వేలంలో 5జీ స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న టెలికాం సంస్థలు త్వరలో భారత్‌లోని 13 నగరాల్లో సేవలు ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లోనే మొదటగా అందుబాటులోకి రానున్నాయి. 2జీ నుంచి 4జీకి మారితేనే ఎన్నో మార్పులు చూశాం. కొవిడ్‌ సమయంలో నిజంగా వీటి అవసరం ఎంతో తెలిసింది. ఇక వచ్చేది ఐదోతరం సెల్యూలార్‌ టెక్నాలజీ. బ్యాండ్‌ విడ్త్‌, వేగం గణనీయంగా పెరగనుంది. 4జీతో పోలిస్తే 600 రెట్లు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా విద్య, వైద్య, ఆరోగ్య, ఆటోమొబైల్‌ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీయబోతోంది. ఇదే ఒరవడి రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ ఉంటుంది.

మన దగ్గర పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయడం ఆలస్యం అవుతోందని బిల్డర్లు చెబుతున్నారు. ఇందుకు ప్రణాళిక లోపమే ప్రధాన కారణమని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కచ్చితంగా అంచనా వేయలేకపోవడం మరో లోపం. 5జీ వస్తే సాంకేతికతతో వీటికి చెక్‌పెట్టొచ్చు. వేగం, నాణ్యత, సమయానికి పూర్తిచేయడం, పారదర్శకత పెంపొందించడానికి నూతన టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రియల్‌ ఎస్టేట్‌లో ప్రాజెక్టుపై ఓనర్‌ డ్రైవ్‌ ఎక్కువగా ఉంటుంది. సిస్టమ్‌ డ్రైవ్‌లోకి వెళ్లేందుకు 5జీ ఉపకరిస్తుందని రియల్‌ ఎస్టేట్‌ సంఘాల భావిస్తున్నాయి.

సైట్‌ సందర్శన..

ఇల్లో, స్థలమో కొనాలంటే ప్రాజెక్టు చేపట్టిన ప్రదేశానికి వెళ్లి చూడటం స్థిరాస్తి రంగంలో చాలా సహజం. శివారు ప్రాంతాల్లోని లేఅవుట్లకైతే కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేస్తుంటారు. సిటీలో కట్టే అపార్ట్‌మెంట్లనూ స్వయంగా వెళ్లి పరిశీలిస్తుంటారు. 5జీతో ఉన్నచోట నుంచి సైట్‌ను సందర్శించే సౌలభ్యం కల్గనుందని నిపుణులు చెబుతున్నారు. స్వయంగా వెళ్లి పరిశీలించిన అనుభూతి కల్గుతుందంటున్నారు. దీంతో  మార్కెటింగ్‌ వ్యయం, సమయం వృథా చాలావరకు తగ్గుతుందని వివరిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది డెవలపర్లు ఈ విధానం ఉపయోగిస్తున్నా నెట్‌వర్క్‌ సమస్యతో వీడియోకాల్స్‌లో అంతరాయాలు ఎదురవుతున్నాయి. మున్ముందు ఇలాంటి ఇబ్బందులు ఉండవు. చేతిలోని ఫోన్‌ నుంచే 360 డిగ్రీల కోణంలో ప్రాజెక్ట్‌ను సందర్శించవచ్చు. చుట్టుపక్కల ప్రాంతాలనూ గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూలో స్పష్టంగా చూడొచ్చు.

పనుల పర్యవేక్షణ..

నగరంలో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 50 అంతస్తుల వరకు ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తున్నారు. ఒక భవనం కట్టాలంటే అందులో 30కిపైగా విభాగాలు పనిచేయాల్సి ఉంటుంది. ఒకటి పూర్తయితే తప్ప రెండోది మొదలుపెట్టలేని విధంగా పనులు ఉంటాయి. ఏ పని ఎప్పటికి పూర్తవుతుంది? ఎంతమంది పనివారు అవసరం ఉంటుంది అనేది ప్రస్తుతం అనుభవం ఆధారంగా అంచనా వేస్తున్నారు. చాలాసార్లు ఈ అంచనాలు తప్పుతున్నాయి. డిజిటలైజ్‌తో ఈ వ్యవహారం మొత్తాన్ని కృత్రిమ మేథ తోడ్పాటుతో చేయగల్గితే కచ్చితత్వం వస్తుంది. వ్యయం తగ్గుతుంది. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తిచేయగలమో కచ్చితమైన తేదీని కొనుగోలుదారులకు చెప్పే ధీమాని ఇస్తుంది. 5జీ రాకతో ఈ పక్రియ మరింత వేగం పుంజుకుంటుంది. పనికి సంబంధించి ప్రతిదీ ఫొటోలు, వీడియోల సహా తాజా సమాచారం లభిస్తుంది. ఫలితంగా బిల్డర్లు ఏకకాలంలో ఒకటే కాకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుంటుంది. సైట్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా కార్యాలయం నుంచే డాష్‌బోర్డులో ఏ రోజుకారోజు తాజా పురోగతి తెలుసుకోవచ్చు అని యువ బిల్డర్‌ ఒకరు ‘ఈనాడు’తో అన్నారు.  క్లౌడ్‌ సేవలూ పెరగనున్నాయి. ఇలాంటివి ఇప్పటికే మొదలైనా వేగం పెరిగితే మిగతా వాళ్లు అనుసరించక తప్పనిపరిస్థితులు రాబోయే రోజుల్లో రానున్నాయి. ఫ్లాట్‌ బుక్‌ చేసిన కొనుగోలుదారులు ప్రాజెక్టు పురోగతిని ఇంటి నుంచే లైవ్‌లో పరిశీలించవచ్చు.  ఏఆర్‌, వీఆర్‌తో త్రీడీలో ఇంటి ప్లాన్లను వీక్షించవచ్చు.

అదనపు ఆదాయం...  

4జీతో పోలిస్తే 5జీ సిగ్నల్స్‌ ఎక్కువ దూరం వెళ్లలేవని, దీంతో ఎక్కువ యాంటెనాలు, బూస్టర్ల అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు.  ఫలితంగా ఇళ్లు, కార్యాలయాల భవనాల పైకప్పులపైన వీటి ఏర్పాటుతో అద్దెలు, లీజుల రూపంలో అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  


పరిశ్రమ సన్నద్ధత ఎంత?

రియల్‌ ఎస్టేట్‌ రంగం సాంకేతిక ఆవశ్యకతను గుర్తించింది. టెక్నాలజీ పాత్రను వర్చువల్‌గా ప్రాజెక్టుల సందర్శన, చెల్లింపుల వరకు మాత్రమే పరిమితం చేయకుండా మరిన్ని అంశాలకు విస్తరిస్తోంది. 5జీతో వచ్చే మార్పులను సద్వినియోగం చేసుకోవడంపై పలు సంస్థలు ముందుగానే కసరత్తు ప్రారంభించాయి.నిర్మాణ    పనుల వేగం పెరిగేందుకు అవసరమైన ఏ సాంకేతికతనైనా అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని  బిల్డర్లు చెబుతున్నారు.

* ప్రాజెక్టు ప్రణాళిక మొదలు సైట్‌లో పనులు, నాణ్యత తనిఖీలు, విక్రయాల వరకు.. ప్రధానంగా ఈ నాలుగు అంశాలను సులభతరం చేయడంలో సాంకేతికత తోడ్పడుతుంది. ఈ ప్రక్రియ వేగం అందుకునేందుకు 5జీ అక్కరకొస్తుంది.

* ఏ ప్రాజెక్టుకైనా ప్రణాళిక ముఖ్యం. ఇందుకోసం మార్కెట్లో పలు రకాల సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రాజెక్ట్‌ డ్రాయింగ్స్‌ ఇస్తే ఎంత సామగ్రి అవసరం పడుతుంది? ఏ పనిని ఎన్నిరోజుల్లో పూర్తి చేయాలి?  ఎంత ఖర్చవుతుంది అనే లెక్కలతో సహా ముందే కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు.  

* పనులు జరిగే ప్రాజెక్టులకు తరచూ యజమానులు వెళ్లి  పరిశీలిస్తుంటారు. టెక్నాలజీ తోడ్పాటుతో వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్‌ నుంచే పనులను పర్యవేక్షించొచ్చు. ః ఆకాశహార్మ్యాల్లో ఏ టవర్‌లో ఏ పని జరుగుతుందో పర్యవేక్షించడం కొంచెం కష్టమే. అదే సాంకేతికతతో చాలా సులువు అంటున్నారు. ఏ పని ఏ దశలో ఉంది అనేది ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌డేట్‌ చేయడం ద్వారా సైట్‌ ఇంజినీర్‌ నుంచి సీఈవో వరకు సమాచారం అరచేతిలో ఉంటుంది.

* ఒక ప్రాజెక్టులో ఎన్నో బృందాలు పనిచేస్తుంటాయి. వీరందర్ని సమన్వయ పర్చడం కష్టమే. అందుబాటులోకి వచ్చిన వేర్వేరు సాంకేతికతల సహాయంతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు అంటున్నారు బిల్డర్లు.

* ప్రాజెక్టు ఆలస్యం కాకుండా గడువు కంటే ముందు కొనుగోలుదారులకు అప్పగించేందుకూ సాంకేతిక దన్ను ఉపయోగపడుతుంది. రియల్‌టైమ్‌లో ప్రాజెక్టుపై పర్యవేక్షణతో సాధ్యమవుతుంది.

* ప్రాజెక్టు వ్యయం పెరగడంలో సామగ్రి వృథా పాత్ర అధికం. యాప్‌ల తోడ్పాటుతో కచ్చితంగా ఎంత సామగ్రి అవసరం పడుతుందో లెక్కలేయవచ్చు. ఆ ప్రకారం కొని తెచ్చుకుంటే సరిపోతుంది.

* కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికే డిజిటల్‌ పంథాను అనుసరిస్తున్నారు. ప్రాపర్టీ పోర్టల్‌ ఏర్పాటుతో నేరుగా విక్రయాలు చేపడుతున్నారు. కృత్రిమ మేధతో లక్షిత వినియోగదారుడిని చేరేందుకు ఇదే మేలైన, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారమని చెబుతున్నారు. 5జీ రాకతో ఈ సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయి.


స్మార్ట్‌ హోమ్స్‌..

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) ఆధారంగా స్మార్ట్‌హోమ్స్‌ను ఇప్పటికే పలు సంస్థలు ప్రయోగాత్మకంగా చేపట్టాయి. స్మార్ట్‌ డోర్‌బెల్‌తో ఎవరు తలుపు కొడుతున్నారనేది ఇంటి లోపల నుంచే చూసి తీయవచ్చు. ఇంటికి ఎక్కడో దూరంగా ఉన్నా.. బంధువులు ఎవరైనా వస్తే డిజిటల్‌ తాళం తీసి ఇంట్లోకి ఆహ్వానించొచ్చు. ఈ తరహా సాంకేతికత వినియోగం ప్రీమియం ప్రాజెక్టుల్లోనే అందుబాటులోకి వస్తుంది. మానవ వనరులతో నిర్వహిస్తున్న చాలా పనులు ఎలక్ట్రానిక్‌ పరికరాలతో నిర్వహించే వెసులుబాటు రాబోతోంది. నీటి నిర్వహణ, భద్రత పర్యవేక్షణ, విద్యుత్తు వినియోగం వరకు.. భవనంలోని మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ వ్యవస్థలన్నీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తక్షణం స్పందించేందుకు కొత్త టెక్నాలజీ ఉపకరిస్తుంది..


త్రిడీ ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఇళ్లు

నిర్మాణ రంగంలో భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయనే సంకేతాలను పరిశ్రమ వర్గాలు ఇస్తున్నాయి. 5జీతో మున్ముందు ఇళ్లను త్రిడీ ప్రింటింగ్‌ విధానంలో చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. భారీ పరిమాణంలో ఉండే ప్రింటింగ్‌ మిషన్‌లో డ్రాయింగ్‌లను పొందుపరిస్తే చాలు  ఇల్లు అయిపోతుంది. యూఎస్‌లో ఇప్పటికే మొదలెట్టారు. ఏడాది పట్టే ఇల్లు ఈ విధానంలో గంటల్లోనే పూర్తవుతుంది. మంచి నాణ్యతతో ఉంటుంది. పని పరంగా లోపాలు ఉండవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని