భిన్న అనుభూతి.. రెట్టింపు సంతోషం

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నిర్మాణదారులు కొత్తపోకడలకు తెరతీశారు. థీమ్‌ ఆధారిత ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రముఖ సంస్థలు తాము చేపట్టే ప్రాజెక్టుల్లో కనీసం ఒక్కటైనా ప్రత్యేక థీమ్‌తో ఉండేలా డిజైన్‌ చేయిస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి ఆదరణ బాగుండటంతో

Published : 03 Sep 2022 01:18 IST

ప్రత్యేక థీమ్‌లతో ప్రాజెక్టులు చేపడుతున్న స్థిరాస్తి సంస్థలు

ఈనాడు, హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నిర్మాణదారులు కొత్తపోకడలకు తెరతీశారు. థీమ్‌ ఆధారిత ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రముఖ సంస్థలు తాము చేపట్టే ప్రాజెక్టుల్లో కనీసం ఒక్కటైనా ప్రత్యేక థీమ్‌తో ఉండేలా డిజైన్‌ చేయిస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి ఆదరణ బాగుండటంతో ప్రతిష్ఠాత్మకంగా వీటిని నిర్మిస్తున్నాయి. సంస్థకు పేరు తీసుకొచ్చే ప్రాజెక్టులుగా వీటిని పట్టాలెక్కిస్తున్నాయి. నగర రియాల్టీలో చాలాకాలం క్రితమే ఈపోకడ మొదలైనా.. ఇటీవల కాలంలో మరింత విస్తృతమైందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

నగరంలో గేటెడ్‌ కమ్యూనిటీల సంస్కృతి పెరిగింది. ఉండే ఇల్లు ఎంత ముఖ్యమో.. చుట్టూ పరిసరాలు అంతే ప్రధానమని కొనుగోలుదారులు భావిస్తున్నారు. వీటిని డిజైన్‌ చేసేటప్పుడే లక్షిత కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని బిల్డర్లు డిజైన్‌ చేస్తున్నారు. ప్రపంచ పోకడలను దృష్టిలో పెట్టుకుని అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక థీమ్‌తో ముందుకొస్తున్నారు. తమ ప్రతీ ప్రాజెక్టును ఒక భిన్నమైన థీమ్‌తో చేపట్టే ఒక సంస్థ..సంతోషాన్ని రెట్టింపు చేసే థీమ్‌తో ముందుకొచ్చింది. విలాసవంతమైన ఇల్లున్నా.. చుట్టూ ఖరీదైన సౌకర్యాలున్నా సంతోషాన్ని ఇవ్వకపోతే వృథా అనే భావంతో.. విదేశాల్లో అధ్యయనం చేసే మన దగ్గర ఏం చేస్తే ఆనందంగా ఉంటారో వాటిని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరహా ప్రాజెక్టులతో కొనుగోలుదారులు భిన్న అనుభూతి పొందుతున్నారు.

పిల్లల వికాసం..
ఇల్లంటే ఇంటిల్లిపాది కోసం. అందుకోసం పిల్లలను విస్మరిస్తే ఎలా? ఆలస్యంగానైనా వీరి ప్రాధాన్యతను స్థిరాస్తి సంస్థలు గుర్తించాయి. పిల్లల కోసం పదుల సంఖ్యలో సదుపాయాలు కల్పిస్తున్నాయి. క్రీడా సౌకర్యాలతో పాటూ ఇంట్లో జారిపడి దెబ్బలు తగిలించుకోకుండా ఉండేలా టైల్స్, సైకిల్‌ ట్రాక్స్‌ వరకు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల నుంచి ముప్పు లేకుండా పార్కింగ్‌ పూర్తిగా సెల్లార్లకే పరిమితం చేసి వాహన రహిత పోడియం సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. పిల్లల కోసమే ప్రత్యేకంగా యాంపి థియేటర్‌ వంటి సదుపాయాలు ఉంటున్నాయి.

పెద్దల కోసం...

కొంపల్లి, శామీర్‌పేట ప్రాంతాల్లో పెద్దల కోసం ప్రత్యేకంగా గృహ నిర్మాణ ప్రాజెక్టులను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు చేపట్టాయి. వయసు పెరిగేకొద్దీ కుటుంబ సభ్యుల అవసరాలు మారుతుంటాయి. వీటిని తీర్చేలా ఇళ్లనిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్నానాల గదుల్లో జారిపడకుండా టైల్స్‌ దగ్గర్నుంచి, మెట్ల మార్గంలో పట్టుతప్పి పడిపోకుండా రెయిలింగ్, అత్యవసర పరిస్థితుల కోసం అలారం బటన్స్, 24 గంటలు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా కమ్యూనిటీలోనే క్లినిక్, కామన్‌కిచెన్‌ ఏర్పాట్లు ఉంటున్నాయి. అపార్ట్‌మెంట్లతో పాటూ విల్లా ప్రాజెక్టుల్లో వీటిని నిర్మిస్తున్నారు.

హరిత భవనాలు..

కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న నగరంలో హరిత భవనాలకు ప్రాధాన్యం పెరిగింది. నెట్‌ ఎనర్జీ జీరో, నెట్‌ జీరో వంటి థీమ్‌లతో నివాసాలు నిర్మిస్తున్నారు. భవనాలకు అవసరమైన కరెంట్‌ను సౌర, పవన విద్యుత్తుతో సమకూర్చుకోవడం నెట్‌ జీరో.. అయితే ఏ అవసరం కోసం బయటి నుంచి ఆధారపడకపోవడం నెట్‌ జీరో. శివార్లలో ఈ తరహా విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆకాశహర్మ్యాలు కడుతున్నారు. యాభై అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. మూడునాలుగు అంతస్తులు దాటితే పచ్చదనమే కనిపించదు. అందుకని వర్టికల్‌ గార్డెన్స్‌తో హరిత భవనాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ పురోగతిలో ఉన్నాయి.

వారాంతపు విడిది

రోజువారీ పని ఒత్తిడి నుంచి దూరంగా కుటుంబంతో కలిసి గడిపేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. సిటీలో ఇళ్లు ఉన్నా శివార్లలో, సిటీకి మరికొంత దూరంలో వీకెండ్‌ హోమ్స్‌ నిర్మించుకుంటున్నారు. ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారి చుట్టుపక్కల ఈ తరహా ఇళ్లు వస్తున్నాయి. సిటీలో మాదిరి ఉన్న స్థలం మొత్తం నిర్మాణాలు చేపట్టకుండా... సాధ్యమైనంత ఎక్కువ ఖాళీ స్థలం వదిలి చిన్న కుటీరం లాంటి ఇంటిని నిర్మించుకుంటున్నారు. సిద్ధంగా ఉన్న కంటైనర్ల ఇళ్లను, ఎక్కువగా చెట్లు ఉండేలా చిన్నపాటి తోటను పెంచుతున్నారు. సరదాగా ఒకరోజు గడిపి.. ఇంటికి సరిపడా కూరగాయలు కోసుకుని తిరిగి పట్నం వస్తున్నారు. ఇలాంటివారిని దృష్టిలో పెట్టుకుని పలు సంస్థలు వీకెండ్‌ హోమ్స్‌ను భిన్న థీమ్‌లతో నిర్మిస్తున్నాయి. ఇక్కడే ఫామ్‌హౌస్‌లు సైతం నిర్మించుకుంటున్నారు.

స్మార్ట్‌ హోమ్స్‌

మారుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా ఇళ్లను సైతం తీర్చిదిద్దేలా పలు సంస్థలు స్మార్ట్‌హోమ్‌ థీమ్‌తో నిర్మిస్తున్నాయి. ఇంటర్నెట్‌ ఆధారిత సేవలు ఇంట్లో అందుతాయి. కిటికీల తెరలు వేయడం దగ్గర్నుంచి గదుల తాళం వేయడం, బయటి వాతావరణానికి తగ్గట్టుగా ఇంట్లో రంగులు మారడం వరకు, బల్బుల నుంచి ఇంట్లో నీటి నల్లాల వరకు ప్రతిదీ ఆటోమేషన్‌ విధానంలో నిర్మిస్తున్నారు. ఈతరం కోరుకునే విధంగా ఇళ్లను డిజైన్‌ చేస్తున్నారు. స్మార్ట్‌ పార్కింగ్‌ సదుపాయాలు ఈ కమ్యూనిటీల్లో ఉంటున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని