సామాన్యులు కొనగలిగే ఇళ్లు కట్టండి

‘పేద వర్గాలకు ప్రభుత్వం రెండు పడకల ఇళ్లను కట్టి ఇస్తోంది. ఉన్నత వర్గాల కోసం డెవలపర్లు ఇళ్లు కడుతున్నారు. మధ్యలో ఉన్న సామాన్య వర్గం ఇళ్లు కొనగలిగే స్థోమత లేక నలిగిపోతోంది. వీరిని దృష్టిలో పెట్టుకుని రూ.20-30 లక్షల ధరల శ్రేణిలో ఇళ్ల నిర్మాణంపై రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు దృష్టి సారించాలి.

Updated : 24 Sep 2022 09:48 IST

రియల్‌ ఎస్టేట్‌ సంఘాలను కోరిన ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు
భూమి కేటాయిస్తే కడతామన్న డెవలపర్లు
హైటెక్స్‌లో నరెడ్కో తెలంగాణ 12వ ప్రాపర్టీ షో మొదలు
ఈనాడు, హైదరాబాద్‌

‘పేద వర్గాలకు ప్రభుత్వం రెండు పడకల ఇళ్లను కట్టి ఇస్తోంది. ఉన్నత వర్గాల కోసం డెవలపర్లు ఇళ్లు కడుతున్నారు. మధ్యలో ఉన్న సామాన్య వర్గం ఇళ్లు కొనగలిగే స్థోమత లేక నలిగిపోతోంది. వీరిని దృష్టిలో పెట్టుకుని రూ.20-30 లక్షల ధరల శ్రేణిలో ఇళ్ల నిర్మాణంపై రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు దృష్టి సారించాలి. వీరికి సైతం అందుబాటులో ఉండే ఇళ్లను బిల్డర్లు కట్టాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అవసరమో ప్రతిపాదనలు ఇవ్వాలి, భూమి కేటాయింపు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, అనుమతుల ఫీజుల మినహాయింపు వంటివి సర్కారు పరిశీలిస్తుంది’ అని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అన్నారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి శుక్రవారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నరెడ్కో తెలంగాణ 12వ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. ధరణితో సహా బిల్డర్ల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారని ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ తెలిపారు. ఏడాది కాలంలో టీఎస్‌బీపాస్‌ కింద 1,45 లక్షల దరఖాస్తులను ప్రాసెస్‌ చేశామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తెలిపారు. పెద్ద ప్రాజెక్టులను 15 రోజుల లోపలే అనుమతులు వస్తున్నాయని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ వరకు ఒకటే మాస్టర్‌ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ టెండర్‌ దశలో ఉందన్నారు. ధరణిలో సమస్యలను పరిష్కరించాలని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు సునీల్‌ చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

హరిత ఉత్పత్తులు వాడండి
నగరాలను నిర్మాణాలతో కాంక్రీట్‌ జంగిల్‌గా మారుస్తున్నామని, వాతావరణ మార్పులతో కల్గుతున్న నష్టాల దృష్ట్యా పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాల్లో హరిత ఉత్పత్తులను ఉపయోగించాలని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రాజన్‌ బండెల్కర్‌ డెవలపర్లను కోరారు. నిర్మాణాల్లో సామగ్రి వృథాను తగ్గించేందుకు కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని సూచించారు. నరెడ్కో కార్మికుల కోసం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణను బిల్డర్లు సద్వినియోగం చేసుకోవాలని, వారికి కేటాయిస్తున్న క్యాంపులు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ, జవాబుదారీ తనం, చట్ట పరిధిలో ఉండటం, వినియోగదారుల విశ్వాసం పొందేలా ప్రాజెక్టులు చేపట్టడం వంటి ఐదు అంశాలను పాటించాలని బిల్డర్లకు నరెడ్కో సలహాదారు, మహా రెరా మాజీ ఛైర్మన్‌ గౌతమ్‌ ఛటర్జీ సూచించారు.

భూమిని కేటాయించాలి
సామాన్యులు సైతం కొనగలిగే ఇళ్ల నిర్మాణం డెవలపర్లు చేపట్టాలంటే ప్రభుత్వం భూమిని కేటాయించడం ఒక్కటే పరిష్కారమని నరెడ్కో తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎం.విజయసాయి అన్నారు. గతంలో సరూర్‌నగర్‌లో ఈ తరహాలో అపార్ట్‌మెంట్లు కట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇళ్లు అందుబాటులో లేకపోవడానికి భూముల ధరలు పెరగడం కారణమని, ప్రభుత్వమే భూములను బహిరంగ వేలం వేయడం ద్వారా ఆ ప్రాంతంలో ధరలు పెరుగుతున్నాయని, దీనిపై పునరాలోచన చేయాలని పేర్కొన్నారు. తక్కువ ధరలో ఇళ్లంటే ఎక్కడో నగరానికి దూరంగా కట్టాల్సి వస్తుందని, అంత దూరంలో ఉంటూ ఉపాధి కోసం నగరానికి రావడం కష్టమని అన్నారు.

ఆదివారం వరకు..
ప్రాపర్టీ షోలో ప్రముఖ నిర్మాణ సంస్థలు, బ్యాంకింగ్‌, నిర్మాణ ఉత్పత్తులకు చెందిన స్టాళ్లు వంద వరకు ఏర్పాటుచేశారు. ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల ప్రాజెక్టులతో పాటూ నగరంలోని ఇతర ప్రాంతాల్లో చేపట్టిన అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఓపెన్‌ ప్లాట్ల ప్రాజెక్టులను ఆయా సంస్థలు ప్రదర్శనకు పెట్టాయి. దసరా సందర్భంగా కొన్ని సంస్థలు రాయితీలను సైతం అందిస్తున్నాయి. శని, ఆదివారం కూడా ప్రాపర్టీ షో ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని